ప్రభుత్వమా ? ప్రైవేట్ కంపెనీయా? 

సాధారణంగా యువతలో ఎక్కువమంది ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటారు. మంచి ప్రభుత్వ ఉద్యోగం దొరికితే ఇక జీవితానికి ఢోకా ఉండదని అనుకుంటారు. ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా గడిపేయ వచ్చని అనుకుంటారు.…

సాధారణంగా యువతలో ఎక్కువమంది ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటారు. మంచి ప్రభుత్వ ఉద్యోగం దొరికితే ఇక జీవితానికి ఢోకా ఉండదని అనుకుంటారు. ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా గడిపేయ వచ్చని అనుకుంటారు. కానీ ప్రభుత్వాల నిర్వాకం కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 

కొన్ని ప్రైవేటు కంపెనీల్లో జీతాలు సమయానికి అంటే ఒకటో తేదీకల్లా ఇవ్వరు, చాలా ఆలస్యంగా అంటే నెల గడిచిపోయిన తరువాత పది రోజులకో, పదిహేను రోజులకో ఇస్తారు. చిన్నా చితకా కంపెనీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇక రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని ప్రయివేటు సంస్థల్లో నోరెత్తకుండా పనిచేస్తూ ఇచ్చిన జీతం తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈ విషయంలో ఏపీని ప్రముఖంగా చెప్పుకోవాలి. తెలంగాణా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉన్నా ఏపీ అంత అధ్వానం కాకపోవడం సంతోషించదగ్గ విషయం. ఇక ఏపీ విషయానికొస్తే కరోనా కష్టకాలంలోనూ ఉచిత పథకాలు ఆపడంలేదని, అప్పులు చేసైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఊదరగొడుతున్నారు. కానీ ఉద్యోగులకు జీతాలు మాత్రం సమయానికి చెల్లించడంలేదు. ఈమధ్య కాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువైంది. 

ఒకటో తేదీ వస్తోందంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రకమైన ఉద్విగ్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రభుత్వానికి.. ఇటు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటే టెన్షన్. తమ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో.. అది జీతాలివ్వడానికి సరిపోతుందో లేదో అని ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చూసుకుంటూంటే.. తమ అకౌంట్లలో జీతాలు పడ్డాయో లేదో అని.. ఉద్యోగులు, పెన్షనర్లు ఫోన్ల వైపు చూసుకుంటూ ఉంటారు.

కరోనా కావొచ్చు, ఇతర కారణాలు కావొచ్చు ఒకటో తేదీకి మాత్రం ఆర్థిక శాఖ అల్లాడిపోతోంది. ఒకటో తేదీ వచ్చే నాటికి.. ప్రభుత్వం చెల్లించాల్సినవి దాదాపుగా రూ.13వేల కోట్ల వరకూ ఉంటున్నాయి.  వాలంటీర్లను పెట్టి ఒకటో తేదీనే సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వాటికి రూ. పదిహేను వందల కోట్ల వరకూ కావాలి. ఇక ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు ఐదున్నర వేల కోట్ల రూపాయలకు పైగానే కావాలి.  

నెలవారీగా రుణాల కోసం చెల్లించాల్సిన వాయిదాలు, వడ్డీలు ఇలా అన్నీ కలిపి దాదాపుగా రూ. 13వేల కోట్ల రూపాయలు అవసరం. కాగ్ విడుదల చేసిన ఏప్రిల్ నెల లెక్కలు చూస్తే… ఆ నెల ఖర్చులు గడవడానికి రూ. 19వేల కోట్లకుపైగా అప్పులు చేయాల్సి వచ్చింది.  ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం అన్ని మార్గాల ద్వారా చేసిన అప్పు రూ.19,717 కోట్లు. అన్ని మార్గాలు అంటే.. ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేయడం, బ్యాంకుల నుంచి సేకరించడం.. ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవడం వంటివి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఈ మధ్యనే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి టీడీపీయే కారణమని తేల్చిపారేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా అందుకు టీడీపీయే కారణమని చెప్పడం ఒక అలవాటుగా మారింది. 

నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతోంది. కొన్ని శాఖల ఉద్యోగులకు రెండు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి. జూన్‌ నెలకు సంబంధించి మొదటి 15 రోజులకు దాదాపు 50శాతం మంది పెన్షన్ దారులకు, 20శాతం మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. 

పెన్షన్ల కోసం రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకులు చుట్టూ తిరిగిన దృశ్యాలు కనిపించాయి. ఇక ఈనెల జీతాల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా ఓవర్ డ్రాఫ్టుల మీద నెట్టుకొస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు ఆటంకం కలగకూడదని గట్టి పట్టుదలతో ఉన్న ప్రభుత్వం అందుకోసం ఉన్న నిధులన్నింటినీ ఖర్చుచేస్తోంది.

జీఎస్‌డీపీలో అప్పులు శాతం దాదాపు 36 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే.. ఇది 5 శాతం పెరిగింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్నీ ప్రయత్నాలూ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి అనుమతించిన రుణంలో డిసెంబర్ నెలవరకూ వాడాల్సిన దానిని ఇప్పటికే వాడేశారు. వచ్చే జనవరి-మార్చి మధ్య చేయాల్సిన రుణమొత్తాన్ని ఇప్పుడే మంజూరు చేయించుకునేందుకు ఆర్థిక మంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

చివరకు ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం బాండ్ల వేలం కూడా వేస్తోంది. మధ్య తరగతి ఉద్యోగికి జీతాలు వచ్చినట్లుగా ఏపీ సర్కార్‌కు కూడా ఒకటో తేదీన కొంత మొత్తం కేంద్రం నుంచి వస్తుంది. జీఎస్టీ సర్దుబాట్లు, పన్నుల వాటా, కేంద్ర పథకాల నిధులు.. ఇలా పలు రకాల సోర్స్‌ల ద్వారా కొంత మొత్తం ఆదాయం.. ఏపీ ఖాతాకు జమ అవుతుంది.

అయితే అది మరీ భారీగా ఉండదు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల మధ్యనే ఉంటుందని అంచనా. ఒక్కో నెల ఇది రూ.రెండు వేల కోట్లే ఉన్నా ఆశ్చర్యం లేదు. మిగతా రూ.6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వచ్చిన మొత్తం వచ్చినట్లుగా వివిధ రకాల అత్యవసర చెల్లింపులకు వినియోగిస్తోంది. అంటే… ఇప్పుడు జీతాలు చెల్లించాలంటే కచ్చితంగా అప్పు తేవాల్సిందే. 

మూడు నెలల నుంచి ఆర్బీఐలో వారానికి రెండువేల కోట్ల రూపాయల బాండ్లను వేలం వేయడం ద్వారా నిధులు సమకూర్చుకుని జీతాలిస్తున్నారు. దీని వల్ల ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలొస్తున్నాయి. చివరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో పని చేస్తున్నారో, పనికి మాలిన ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది.