ఈసారి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోగలరా?

“సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.. ప్రతి సంక్షోభాన్ని ఓ అవకాశంగా మలుచుకోవాలి. అలా ముందుకు పోవాలి.” మైక్ దొరికితే చంద్రబాబు చెప్పే డైలాగ్ ఇది.  Advertisement అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల సార్లు ఈ డైలాగ్ కొట్టారో…

“సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.. ప్రతి సంక్షోభాన్ని ఓ అవకాశంగా మలుచుకోవాలి. అలా ముందుకు పోవాలి.” మైక్ దొరికితే చంద్రబాబు చెప్పే డైలాగ్ ఇది. 

అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల సార్లు ఈ డైలాగ్ కొట్టారో బాబుకే తెలియదు. మరి ఇప్పుడు అదే డైలాగ్ ను బాబు తన రాజకీయ జీవితానికి వర్తింపజేస్తారా? రాజకీయ జీవిత చరమాంకంలో ఆ ఫార్ములాని పాటించగలరా..? ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న పార్టీని గట్టెక్కించగలరా..?

చేజారిపోతున్న క్యాడర్-నేతలు..

సంక్షోభంలో ఉన్న పార్టీని గట్టెక్కించాలని బాబుకి గట్టిగానే ఉంది. అయితే ప్రస్తుతం బాబు తానే స్వయంగా బయటపడలేని పరిస్థితి. తనతో పాటు పార్టీని బయటకు లాగేందుకు ఆయనకి అవకాశమే లేదు. చరిత్రలో ఎప్పుడూ లేని ఘోర పరాభవం ఇది. 

ఇక టీడీపీలో ఉంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేననే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుకే పార్టీ నేతలు ఒక్కొక్కరే బయటకు వెళ్లిపోతున్నారు. క్యాడర్ స్థానిక ఎన్నికలప్పుడే జంప్ అయ్యారు.

ఇటీవల కాలంలో బాబు నిరసన ప్రదర్శనలకు పిలుపిచ్చినప్పుడు ఆ పార్టీ వెంట ఎంతమంది ఉన్నారో స్పష్టంగా బయటపడింది. కేవలం జూమ్ మీటింగ్ లకు వస్తారే కానీ, జనాల్లోకి రమ్మంటే మాత్రం ఎవరూ రారు. పార్టీని సంక్షోభంలో నుంచి బయటపడేయాలంటే ముందు క్యాడర్ ని వెనక్కు తెచ్చుకోవాలి. కనుచూపు మేరలో అది అసాధ్యమని తేలిపోయింది. కేడర్ లేకుండా లీడర్లు పార్టీలో మిగిలి ఉంటారనుకోవడం అత్యాశే.

వైసీపీ నుంచి ఎదురుదాడులు..

తాను అధికారంలో ఉండగా, వైసీపీ నుంచి వలసల్ని విపరీతంగా ప్రోత్సహించారు చంద్రబాబు. అలా వలసొచ్చిన నేతలకు కూడా మంత్రి పదవులు కట్టబెట్టి నీఛ రాజకీయాలు చేశారు. 

ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిని, కోడికత్తి దాడిగా అపహాస్యం చేశారు. ఇప్పుడు అవకాశం వైసీపీది. కానీ చంద్రబాబులాంటి నీఛ రాజకీయాలు జగన్ చేయట్లేదు. పనిగట్టుకుని ప్రతీకారం తీర్చుకోవట్లేదు కానీ, అనుకోకుండానే జగన్ కి అది కలిసొచ్చింది.

రకరకాల కారణాలతో టీడీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. అవినీతి చేయబట్టే అచ్చెన్నని లోపలేశారు. మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు కాబట్టే కొల్లు రవీంద్రను కటకటాల్లోకి నెట్టారు. వీటన్నిటినీ వైసీపీ ఎదురుదాడులుగా భావించినా, భావించకపోయినా.. టీడీపీ నేతలు మాత్రం చిక్కుల్లో పడుతూనే ఉన్నారు. తాజాగా దేవినేని ఉమా అరెస్ట్ దీనికి కొనసాగింపు.

చిరాకుపెడుతున్న లోకేష్..

కొడుకు చేతికి అందివస్తే చంద్రబాబుకి ఇంత ఆపసోపాలు ఉండేవి కావు. కానీ లోకేష్ మొద్దబ్బాయి కావడంతో వయోభారంతోపాటు, పార్టీ భారం కూడా చంద్రబాబే మోయాల్సి వస్తోంది. ఎంతగా జాకీలు పెట్టి లేపుతున్నా.. అంతగా దిగజారిపోతున్నారు లోకేష్. 

పార్టీకి సరైన వారసుడు లేడన్న భయం చంద్రబాబుని పట్టిపీడిస్తోంది. మిగతా సంక్షోభాల నుంచి గట్టెక్కగలరేమో కానీ, వారసుడి రూపంలో తలకు చుట్టుకున్న ఈ సంక్షోభాన్ని మాత్రం చంద్రబాబు ఎప్పటికీ తప్పించుకోలేరు.

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ సెగ..

కొడుకు అసమర్థుడు కావడంతో మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. లోకేష్ వల్ల కాదు, జూనియర్ ని తీసుకురండి, పార్టీని కాపాడండి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

సాక్షాత్తూ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఈ రాజకీయ సెగ మొదలు కావడం విశేషం. రాగాపోగా చంద్రబాబుకి ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందీ అంటే.. జూనియర్ కి ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోవడం. అందుకే బాబు ధైర్యంగా ఉన్నారు.

ఈ సంక్షోభాలనుంచి ఎప్పుడు బయటపడేను..?

చివరకు రాష్ట్ర విభజన సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకుని తన అనుభవాన్ని చూసి ఓట్లు వేయండి అని ప్రచారం చేసుకుని 2014లో గద్దెనెక్కారు బాబు. కరోనా సంక్షోభంలోనూ ప్రజల వద్దకు వెళ్లే అవకాశం లేకుండా.. జూమ్ మీటింగ్ లతో సరిపెట్టారు. 

జూమ్ లోనే మహానాడు నిర్వహించారు. అలాంటి బాబుకి ఇప్పుడు ఎదురౌతున్న సంక్షోభాలు ఎలాంటి అవకాశాలను మిగల్చకపోవడమే విచిత్రం.