రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వచ్చిన ఆ వాస్తవం. ఇతర పార్టీల్లో యేవో కారణాలవల్ల అసంతృప్తిగా ఉన్నవారు కొందరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలామంది నాయకులతో మాట్లాడుతున్నాడు. తాను పార్టీ అధ్యక్షుడు కాగానే చాలామంది సీనియర్ నాయకులను కలుసుకొని మాట్లాడాడు. వారికి తనపట్ల సానుకూల వైఖరి కలిగేలా వ్యవహరించాడు. నిర్వీర్యమైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉనికిని చాటుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.
మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీని పూచికపుల్లలా చూసిన కేసీఆర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి అంతో ఇంతో ఆలోచించాల్సిన పరిస్థితిని రేవంత్ కల్పించగలిగాడు. ఇప్పుడు ఆయన లక్ష్యం హుజూరాబాద్ ఉప ఎన్నిక. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులే భావించడంలేదు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోయినా.. కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితికి తీసుకెళ్లగలిగితేనే.. రేవంత్ రెడ్డి మొదటి అడుగులో తనదైన విజయం సాధించినట్లుగా భావించవచ్చు. దీని కోసమే రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలను జోరుగా చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి రేసులో లేదు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే పరిస్థితి ఏర్పడిపోయింది. అంతకు ముందు కమలాపూర్‌లో కానీ ఇప్పటి హూజూరాబాద్‌లో కానీ కాంగ్రెస్ గెలిచి దశాబ్దాలు దాటిపోయింది. 1978లో దుగ్గిరాల వెంకట్రావు..చివరి సారిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మళ్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు. అదే దుగ్గిరాల వెంకట్రావు 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు.
ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారగా..ఆ తర్వాత టీఆర్ఎస్ పెట్టని కోటగా నియోజకవర్గం మారిపోయింది. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌కూ ఎప్పుడూ 40వేల మెజారిటీ తగ్గలేదు. అయితే అక్కడ కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం కాలేదు. ఎప్పుడూ రెండో స్థానంలో ఉంటూనే వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయకు అరవై వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి హుజూరాబాద్‌లో సున్నా నుంచి ప్రారంభించాల్సి ఉంది. పార్టీ పరిస్థితిపై రేవంత్ అంతర్గతంగా నివేదికలు తెప్పించుకున్నారు.అక్కడ పార్టీ బలాలు, బలహీనతలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ దళిత ఫార్ములా ప్రయోగిస్తూండటంతో … దీటుగా ఎదుర్కొనే వ్యూహాన్ని రేవంత్ అమలు చేయడం ప్రారంభించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలకు కాంగ్రెస్ ఇంచార్జ్‌గా సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహను నియమించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త దామోదర రాజనర్సింహనే. ఆ విషయలో ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సబ్ ప్లాన్ వల్ల… దళితుల నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా దళిత వర్గాలకే అందుతున్నాయి.
దీని వల్ల దళిత వర్గాల్లో దామోదరకు ఆదరణ ఉంటుందని రేవంత్ రెడ్డి అంచనా. ప్రస్తుతానికి హుజూరాబాద్‌కు దామోదరనే ఇంచార్జ్ గా పెట్టినా… చివరికి పరిస్థితిని బట్టి ఆయననే అభ్యర్థిగా ఖరారు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం… కాంగ్రెస్ వర్గాల్లో ఏర్పడింది. అలాగే దళిత గిరిజనుల్ని ఏకం చేసేందుకు కార్యక్రమాలను రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ఇంద్రవెల్లిని ఎంచుకున్నాడు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల.. దళితులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారకుండా చేయగలిగితే.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఛాన్స్ ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.