మొదట్లో తాను బీసీనంటూ గొప్పగా చెప్పుకున్నారు ఈటల రాజేందర్. దొరల పెత్తనం సహించను అన్నారు. బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. బడుగులపై బ్రహ్మాస్త్రం అంటూ కేసీఆర్ తనపై మంత్రుల్ని, ఎమ్మెల్యేలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. తన బీసీ కార్డుని వాడుకుని, కేసీఆర్ ని దొర పేరుతో టార్గెట్ చేయాలనుకున్నారు ఈటల.
కట్ చేస్తే ఇప్పుడు హుజూరాబాద్ లో బీసీ రాజకీయం మారిపోయింది. కేసీఆర్ దొర అని హైలెట్ చేయాలనుకున్న ఈటలపై దళిద ద్రోహి అనే ముద్రపడేలా అధికార పార్టీ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది.
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈటలను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ దళిత కార్డు ఉపయోగించారు. దళిత బంధు ప్రకటించారు. ఆ పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టాలని చూశారు. ఈ నేపథ్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు దళితబంధును ఎన్నికల ముందు అమలు చేయకుండా ఆపాలంటూ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు గొడవ మొదలైంది.
వారిని ప్రోత్సహించి ఎన్నికల కమిషన్ వరకు పంపించింది ఈటలేనని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. దళితులు బాగుపడితే ఈటల చూస్తూ ఉండలేకపోతున్నారని మండిపడ్డారు.
దళిత ద్రోహి అనే ముద్ర..
హుజూరాబాద్ లో దళిత సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. అందుకే వారిని ప్రసన్నం చేసుకోడానికి ప్రధాన పార్టీలు పాకులాడుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. వారి ఓట్లు కావాలి కానీ వారికి ఎవరూ సీటు ఇచ్చే పరిస్థితి లేదు. పాతికేళ్లుగా ప్రధాన పార్టీల నుంచి అక్కడ దళిత అభ్యర్థి బరిలోకి దిగలేదు. పోనీ ఇప్పుడు వారికి సీటు ఇస్తారనే ఆశ కూడా లేదు.
అయితే ఈటల వర్గాన్ని దళితులకు వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ఆపసోపాలు పడుతున్నారు. దాదాపుగా ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఇటీవల ఈటల బావమరిది చేసిన వాట్సప్ చాటింగ్ లో దళితుల్ని కించపరిచేలా పదప్రయోగం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో ఈటల రాజేందర్ దళితులతో పాలాభిషేకం చేయించుకున్నారని, కాళ్లు కడిగించుకున్నారని కూడా టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన దాడి కూడా దళితులపై బీజేపీ నేతలు చేసిన దాడిగా తిప్పికొడుతున్నారు.
దీంతో ఒక్కసారిగా ఈటల డిఫెన్స్ లో పడ్డారు. తాను బీసీనని చెప్పుకుని సింపతీ కొట్టేయాలని చూసిన, ఈటలకు కేసీఆర్ దళిత కార్డు వేసి అడ్డుకట్ట వేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన ఆధిపత్య పోరు… చివరకు రెండు వర్గాల మధ్య పోరుగా మారింది. హుజూరాబాద్ లో సామాజిక చిచ్చు రేపినట్టయింది.