సీమ వైఎస్‌ఆర్సీపీ నేతలు.. వెంకన్నకు మొక్కులు!

ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వెంకన్నకు ఆ పార్టీనేతలు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గెలిచినప్పటి నుంచి వరసగా తిరుమలను సందర్శించారు. ఎన్నికలకు ముందు, పాదయాత్ర…

ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వెంకన్నకు ఆ పార్టీనేతలు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గెలిచినప్పటి నుంచి వరసగా తిరుమలను సందర్శించారు. ఎన్నికలకు ముందు, పాదయాత్ర సమయంలోనూ శ్రీనివాసుడిని దర్శించుకున్నారు జగన్‌ మోహన్‌రెడ్డి. కాలినడక ద్వారా శ్రీనివాసుడిని దర్శించుకున్నారు జగన్‌.

ఇక ప్రధానమంత్రి తిరుమలకు వచ్చినప్పుడు కూడా జగన్‌ మోహన్‌రెడ్డి మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఎన్నికలకు ముందు దర్శించుకున్న గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా ఇటీవల మరోసారి దర్శించుకున్నారు జగన్‌. అలా సీఎంకాక ముందు దేవుళ్లను దర్శించుకుని, సీఎం అయ్యాకా మరోసారి వారిని దర్శించుకున్నారాయన.

ఆ సంగతలా ఉంటే.. రాయలసీమ ప్రాంతంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, వారి కుటుంబీకులు శ్రీనివాసుడిని కాలినడకన దర్శించుకుంటూ ఉన్నారు. కాలినడకన అంటే.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడంకాదు, తమ తమ సొంతూళ్ల నుంచి వారు తిరుమల వరకూ కాలినడకన సాగుతూ ఉన్నారు.

ఈ జాబితాలో ముందుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి నిలిచారు. జమ్మలమడుగులో సంచలన విజయం సాధించారు డాక్టర్‌ సుధీర్‌రెడ్డి. రాజకీయాలకు అత్యంత సీనియర్లు అయిన ప్రత్యర్థులు ఇద్దరూ ఏకమై కూడా సుధీర్‌రెడ్డి విజయాన్ని అక్కడ ఆపలేకపోయారు. అలా ప్రభంజనం లాంటి విజయాన్ని సాధించిన సుధీర్‌రెడ్డి, ఫలితాలు వచ్చాకా కాలినడకన శ్రీవారి దర్శనానికి బయల్దేరారు.

పెద్ద సమూహంగా సుధీర్‌రెడ్డి బృందం తిరుమలకు వెళ్లింది. కాలినడకన కొన్నిరోజుల పాటు వారి యాత్ర సాగింది. తనతో పాటు నడిచి వెళ్లే వారందరికీ భోజన ఏర్పాట్లు చేసి సుధీర్‌రెడ్డి తిరుమల చేరుకున్నారు. మొక్కు చెల్లించుకున్నారు.

ఇక సుధీర్‌రెడ్డి కన్నా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా శ్రీవారి దర్శనానికి బయల్దేరారు కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి. రాయదుర్గం నుంచి ఆమె తిరుమలకు పాదయాత్రగా సాగుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె పాదయాత్ర సాగుతోంది. కొంతమంది బృందంగా భారతితో పాటు శ్రీవారి దర్శనానికి కాలినడకన సాగుతూ ఉన్నారు. ఇలా ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో శ్రీనివాసుడి మొక్కులను చెల్లించుకుంటున్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?