రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ అధికారాన్ని సొంతం చేసుకుంటారనే ధీమా వైసీపీ నేతల్లో కంటే, జనసేనాని పవన్‌కల్యాణ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్‌పై జనంలో వ్యతిరేకతను సృష్టించేందుకు అన్ని హద్దుల్ని పవన్ దాటుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 8 నెలలు వున్నప్పటికీ, జగన్‌ను తిట్టడానికి ఇక ఏ పదాలు లేకుండా పవన్‌కల్యాణ్ వాడేశారు.
తానింతగా జగన్‌పై విష ప్రచారం చేస్తున్నా, జనంలో సీఎంపై అభిమానం పోలేదనే ఆందోళన పవన్‌ను వెంటాడుతోంది. ఇందుకు పవన్ వ్యాఖ్యలే నిదర్శనం.
‘వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో, సంక్షేమం నిలిచిపోతుందేమో అని అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలుంటాయి. అంతే తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తాం’ అని పవన్ కల్యాణ్ నమ్మబలికారు. తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని పవన్ చెప్పకనే చెప్పారు. అయితే తాను లేదా పొత్తులో భాగంగా ఏర్పాటు చేసే ప్రభుత్వం ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడమే ట్విస్ట్.
జగన్ పాలన అంటే సంక్షేమానికి పెద్ద పీట వేసిందని పవన్ స్వయంగా అంగీకరించినట్టైంది. మరోవైపు జగన్‌ను ఓడిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయోమో అనే భయం జనంలో ఉండడాన్ని పవన్ గ్రహించారు. అందుకే తనకు తానుగా జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయని, సంక్షేమం నిలిచిపోతుందని అనుకోవద్దని తన పార్టీ కార్యకర్తలను వేడుకోవడం చర్చనీయాంశమైంది. జగన్‌ను గద్దె దించడం తన ఎజెండానే తప్ప, ప్రజల ఆకాంక్ష కాదని పవన్ కామెంట్స్ తెలియజేస్తున్నాయి.
జగన్‌కు, సంక్షేమానికి విడదీయని బంధం వుందని పవన్ కామెంట్స్ కంటే నిదర్శనం ఏముంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల రూపంలో పేదల హృదయాల్లో జగన్ గూడు కట్టుకున్నాడని పవన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే పవన్ భయపడుతున్నారని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.