తానో గొప్ప విజనరీ అని, తన వల్లే ఈ సమాజం మార్పు చెందుతోందనే మెసేజ్ ఇవ్వడానికి చంద్రబాబు తెగ తాపత్రయపడు తుంటారు. సాంకేతికత అభివృద్ధి చెందని దశకంలో, కేవలం టీడీపీ అనుకూల మీడియా మాత్రమే రాజ్యమేలుతున్న కాలంలో “అబ్బో చంద్రబాబు ఎంత గొప్పో” అని భ్రమల్లో ముంచారు. అయితే మారిన, మారుతున్న కాల పరిస్థితుల్లో చంద్రబాబు ఇంకా విజనరీ మాటలతో మభ్యపెట్టడానికి కుదరదు.
తాజాగా విశాఖ కేంద్రంగా చంద్రబాబు 2047 విజనరీ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఆ సమయానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సందర్భంగా దేశాభివృద్ధి కోసం చంద్రబాబు కలలు గనడంపై పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీయడం వెనుక రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాబు 2047 విజనరీపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
అప్పట్లో విజన్ 2020, ఆ తర్వాత నవ్యాంధ్య కోసం విజన్ 2029 అన్నారని, ఇప్పుడు దేశం కోసం విజన్ 2047 అంటున్నారని , ఇవన్నీ పక్కన పెడితే కన్న కొడుకు లోకేశ్, దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్‌లను గెలిపించుకునే విజన్ ఏమైనా వుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాళ్లిద్దరినీ ఎమ్మెల్యేలుగా చూడాలనుకున్న చంద్రబాబు విజన్ -2019 అట్టర్ ప్లాప్ అయ్యిందని, కనీసం విజన్-2024లో అయినా చట్టసభలో చూడగలుగుతారా? అని నెటిజన్లు నిలదీయడం గమనార్హం.
ఏపీని, దేశాన్ని ఉద్దరించడం సంగతేమో గానీ, కన్న, దత్త పుత్రుల భవిష్యత్ గురించి ఏదైనా ఆలోచిస్తే ప్రయోజనం వుంటుందని చంద్రబాబుకు హితవు చెప్పడం గమనార్హం. గొప్పలు చెప్పుకోవడం మాని, దత్త పుత్రుడు, కన్న కొడుకుల రాజకీయ భవిష్యత్ కోసం విజన్ డాక్యుమెంటరీ ఏదైనా వుంటే విడుదల చేయాలని చీవాట్లు పెట్టడం చర్చనీయాంశమైంది.