ప్రభుత్వ యంత్రాంగంలో సేవలు అందిస్తున్న వారు ప్రభుత్వ కార్యక్రమాల గురించి అవగాహన కలిగి ఉండడం అవసరం. ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతూ, ప్రజలను పలుమార్లు కలుస్తూ, వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉంటూ పనిచేసే వాలంటీర్లకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వ్యవహారాల గురించిన పూర్తి పరిజ్ఞానం ఉండడం అవసరం. ఈ ఉద్దేశంతోనే వాలంటీర్లు అందరికీ దినపత్రిక కొనుగోలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఈ వ్యవహారంపై ఈనాడు దినపత్రికకు కన్ను కుట్టింది. సాక్షి సర్కులేషన్ పెంచుకోవడానికి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, అనుచితమైన జీవోలు ఇచ్చారని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. తదనంతర పరిణామాలలో ఈ కేసును ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు మారుస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుండగా సాక్షి సంస్థ అధిపతి వైఎస్ భారతికి మరియు పత్రికల సర్కులేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చినీయాంశం అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక పత్రిక యజమానికి గాని, పత్రికల సర్కులేషన్ సంగతులను పరిశీలించే సంస్థకు గాని ఏం సంబంధం ఉంటుంది.. అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
ఎందుకంటే ప్రభుత్వం వాలంటీర్లు అందరికీ దినపత్రికలో కొనుగోలుకు నెలకు 200 రూపాయల భత్యం ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంలో ఇచ్చిన జీవోలో ఎక్కడా సాక్షి దినపత్రిక కొనడం గురించి ప్రస్తావించలేదు. ఒక దినపత్రికను కొనాలి అని మాత్రమే వాలంటీర్లకు అలవెన్స్ ఇచ్చారు. పైగా వారికి అలవెన్స్ గా కేటాయిస్తున్నది కేవలం 200 రూపాయలు మాత్రమే. దాంతో వారికి నచ్చిన పత్రికను కొనుగోలు చేయవచ్చు. ఆ స్వేచ్ఛ వారికి ఉంటుంది. సాక్షి మాత్రమే కొనాలనే నిబంధన ఎక్కడా ఉండదు. అయితే వారు సాక్షినే కొనే అవకాశం ఉంటుందన్నది నిజం.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్ల చందాల రూపేణా సాక్షి దినపత్రిక సర్కులేషన్ తమను దాటి పోతుందనే భయంతో ఈనాడు కుట్రపూరిత ఉద్దేశాలతో కోర్టులలో పిటిషన్లు వేసి నానారాద్ధాంతం చేస్తోందని పలువురు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్కులేషన్ పరుగు పందెంలో ఈనాడు నెంబర్ వన్ అని చెప్పుకునే వాతావరణం ఒకప్పట్లో ఉండేది. ఈ నెంబర్ వన్ ర్యాంకు వలన ప్రకటనల ధరల నిర్ణయం వంటివి వారి చేతుల్లోనే ఉండేది. వాలంటీర్లు అందరూ సాక్షి దినపత్రికను కొంటే గనుక వారి సర్కులేషన్ తమ గణాంకాలు దాటిపోతే ప్రకటనల ఆదాయానికి గండిపడుతుందని భయంతో ఈనాడు ఇట్లాంటి వక్రబుద్ధులను ప్రదర్శిస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు పరిశీలించవచ్చు, అలా వాలంటీర్లకు అలవెన్స్ ఇవ్వడం కరెక్టో కాదో నిర్ణయించవచ్చు. మధ్యలో సాక్షి భారతికి, ఏబీసీ వారికి నోటీసులు ఇవ్వడం ఈనాడు కుట్రలో భాగమేననే అభిప్రాయం వినిపిస్తోంది.