చంద్రబాబు విజన్-2047 పనికొచ్చేదేనా?

నేడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం. ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన విజన్ 2047 గురించి ప్రస్తావించడం జరిగింది. లంచగొండితనం, వారసత్వ రాజకీయం, తాత్కాలిక ప్రయోజనాలపైన మాత్రమే దృష్టి పెట్టడం అనే మూడింటిపై పోరాడాలని చెప్పారు.…

నేడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం. ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన విజన్ 2047 గురించి ప్రస్తావించడం జరిగింది. లంచగొండితనం, వారసత్వ రాజకీయం, తాత్కాలిక ప్రయోజనాలపైన మాత్రమే దృష్టి పెట్టడం అనే మూడింటిపై పోరాడాలని చెప్పారు. డెమోక్రసి, డెమోగ్రఫీ, డైవర్సిటీ అనే మూడూ ఈ దేశ పునాదులని వెల్లడించారు. మహిళాసాధికారత, స్వఛ్చభారతం, శ్రేష్ఠభారతం వంటి వాటిని ప్రస్తావించారు. నేషనల్ ఏడ్యుకేషన్ పాలసీయొక్క ఆవశ్యకత వివరించాక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కొత్తది కాకపోయినా దానిని విస్తృతంగా అమలుపరచాలని ఉద్ఘాటించారు. ఇవన్నీ చేస్తూ ఉంటే దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని, 2047 కల్లా సమగ్రాభివృద్ధి సాదించిన దేశంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరుతుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తన విజన్ 2047 విడుదల చేసారు.  డ్రోన్లు, రోబోట్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటివాటితో ఆరోగ్య, వ్యవసాయ, విద్యా, పరిపాలనా, వాణిజ్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకురావాలన్నారు. అలాగే మోదీ చెప్పిన పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-భాగస్వామ్యం అభివృద్ధికి అత్యవసరమని ప్రకటించారు. అలాగే దశాబ్దాలుగా చెప్పుకుంటున్న నదుల అనుసంధానం తన విజన్ 2047 లో చేర్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇందులో కొత్తగా చెప్పిందేమీ లేదు. ఏ ప్రభుత్వమొచ్చినా ఇవన్నీ ఎలాగూ జరిగేవే. సాంకేతిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పుణ్యమా అని ప్రపంచం రూపురేఖలు ఎలాగూ మారతాయి. ఎలాగో జరిగేవి తన జాబితాలో చేర్చి, రేపు జరిగాక అదిగో నేను ఎప్పుడో చెప్పాను అని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఉంది నాయుడుగారి విజన్ 2047. అలాగని ఆయన్ని పూర్తిగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చేసిందేవిటి, చేయనిది ఏవిటి చెప్పుకుందాం. 

తన విజన్ 2020లో భాగంగా చెప్పకుండా ఆయన చేసిన పని ఒకటుంది. అది వ్యవస్థల్లో తన వాళ్ళని పెట్టుకోవడం. అందుకే నేడు ఒక పక్క మోదీ కన్నెర్ర చేసినా, మరొ పక్క జగన్ మోహన్ రెడ్డి ఇబ్బంది పెడదామనుకున్నా మీడియా, న్యాయవ్యవస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నింటిలోనూ తన సిబ్బంది ఉండడం వల్ల ఎవ్వరూ తనను ఏమీ చెయ్యలేకపోయారు. ఆ విషయంలో ఆయన విజన్ 2020 అమోఘం. ప్రజలకి చేసిన మేలు పక్కనపెడితే తనకు తాను కట్టుకున్న రక్షణదుర్గం మాత్రం నభూతోనభవిష్యతి. 

ఇక ప్రజల్లో సొంతవాళ్లకి ఆయన చేసిన మేలు ఇంతా అంతా కాదు. హైద్రాబాదులో రియలెస్టేట్ బూం తెచ్చి ఎందరో స్వపక్ష రియాల్టర్స్ ను కోటీశ్వరులుగా మార్చారు. ఆ బూం ని చూసి కొందరు మధ్యతరగతి జనాలు కూడా హైద్రాబాద్ చుట్టుపక్కల చిన్న చిన్న స్థలాలు కొనుక్కుని బాగుపడినంతమంది బాగుపడ్డారు. అయితే నాయుడుగారి దృష్టంతా హైద్రాబాదు మీదే. తన సొంత జిల్లా చిత్తూరుకి కనీసం నేషనల్ హైవే తెచ్చుకోలేకపోయారు ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కనీసం మునిసిపల్ హోదా కూడా కల్పించలేకపోయారు. 

అలాగే ఆయన కాలంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా ఉండేవి. ప్రభుత్వ పాఠశాలలు ఎందుకున్నాయా అన్నట్టుండేవి. ప్రైవేట్ పాఠశాలల జోరు విపరీతంగా ఉండేది. మెడికల్ కాలేజీలు కూడా చంద్రబాబు హయాములో పెద్దగా వచ్చినవేం లేవు. ఎందుకంటే చంద్రబాబు దృష్టి వీటిపై లేదు. సంక్షేమం అనేది ఆయన జాబితాలో చివరిది. రాష్ట్రమనే శరీరానికి లోపల ఎన్ని వ్యాధులున్నా పైకి మాత్రం రంగురంగులబట్టలేసి మేకప్ వేసి కూర్చోబెట్టడం చంద్రబాబుకి తెలిసిన విద్య. అలా పైనపటారం లోన లొటారం పరిస్థితి ఏ రాష్ట్రానికైనా ఎక్కువకాలం ఉంటే ప్రమాదమే. 

2019లో జగన్ మోహన్ రెడ్డి గెలిచే ముందే తన విజన్ ఏమిటో చెప్పారు. “నవరత్నాలు” ఏవిటో వివరించారు. అవన్నీ అమలుపరుస్తూ వస్తున్నారు. చంద్రబాబు టైములో లాగ రోడ్లు బాలేదు…నిజమే..కానీ ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి; చంద్రబాబు విజన్ మాదిరిగా రియల్ బూం రాలేదు…నిజమే…కానీ కొత్త మెడికల్ కాలేజీలొస్తున్నాయి; చంద్రబాబు హయాములో లాగ రైతుల ఆత్మహత్యలు లేవు…”రైతుభరోసా కేంద్రాలు” వాటిని ఆపేసాయి. అలా లేవలేక చతికిలపడ్డ విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలు జగన్ మోహన్ రెడ్డి హయాములో ఊపిరి పోసుకుని లేచి నిలబడ్డాయి. నవరత్నాల్లో ఏదో ఒక రత్నం ప్రతి పేదవాడికి అందుతోంది కనుక పేదరికం వల్ల తిండి లేక కుటుంబసమేతంగా ఉరేసుకున్న వార్తలు చాలా కాలంగా లేవు. జగన్ మోహన్ రెడ్డి విజన్ అంటే ఇది. ఇదే ఆయనను ప్రజలకు బాగా దగ్గర చేసింది. 

అయితే ఈ రెండింటిలో రాష్ట్రానికి ఏది అవసరం? చంద్రబాబు విజనా, జగన్ విజనా అంటే…రెండూ అవసరమే అని చెప్పాలి. ఎప్పటికీ జగనే సీటులో ఉండాలంటే ప్రస్తుతం చేస్తున్నవి చేస్తూ రోడ్ల మీద, రియల్ ఎస్టేట్ బూం మీద, పర్సెప్షన్ మీద కూడా దృష్టి సారించాలి. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ఉన్న రుగ్మతల్ని బాగు చేసి ఊరుకోవడమే కాకుండా తన సొంత నియోజకవర్గం పులివెందుల మీద పెట్టిన దృష్టి ప్రతి జిల్లా మీదా పెట్టాలి. ఆ పర్సెప్షన్ విధానాలు, హైటెక్ ప్రెజెంటేషన్స్, మసిపూసి మారేడు చేయడాలు కొన్ని చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకు తీరాలి. నచ్చినా నచ్చకపోయినా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రజల్ని సంతృప్తి పరచాలంటే ఇది అవసరం. 

అలాగే చంద్రబాబు మళ్లీ పదవిలోకి రావాలంటే తను చేసిన గొప్పలు చెప్పుకుని కూర్చుంటే సరిపోదు. ఇప్పుడు తాజాగా వదిలిన విజన్ 2047 కూడా దేనికీ పనికిరాదు. ప్రజల్లోకి వెళ్లాలి, వాళ్లతో మమేకమవ్వాలి, జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా తానేమి చేయగలరో చెప్పాలి. అంతే తప్ప “జగన్ సైకో” అంటూ అరిస్తే పని జరగదు. ఈ విషయంలో చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి దగ్గర చాలా నేర్చుకోవాలి. 

వైకాపా, తెదేపాలు కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు. అది ఎక్కువమంది ప్రజలకి వినోదం, కొంతమందికి ఉద్రేకం, చిరాకు తెప్పించవచ్చు. కానీ అందరూ కోరుకునేది శాంతమయ రాష్ట్రం, సుఖమయ జీవితం. అధికశాతం ఓటర్లైన పేదలకి సంక్షేమ పథకాలు సుఖాన్నివ్వొచ్చు; సగటు మధ్యతరగతి వాళ్లకి ధరలు అదుపులో ఉండడం సుఖాన్నివ్వొచ్చు; ఆ పై వాళ్లకి రోడ్లు విశాలంగా ఉండడం..ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకపోవడం సుఖాన్నివ్వొచ్చు; ఇలా ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి. అలాగే వ్యాపారులకి, విద్యార్థులకి వాళ్లకి కావాల్సిన వెసులుబాట్లేవో వాళ్లకివ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వర్గాలన్నింటినీ సంతుష్ట పరచాల్సిన బాధ్యతుంటుంది. అంతే తప్ప ఏ వర్గాన్ని విస్మరించినా పదవికి ప్రమాదం సంభవించవచ్చు. ఎందుకంటే ప్రతి వర్గం దేనికదే విడిగా కనిపిస్తున్నా అన్ని వర్గాల్లోని జీవితాలు ఒకరితో ఒకరు పెనవేసుకున్నవే అనే సత్యాన్ని మరువకూడదు. 

శ్రీనివాసమూర్తి