తిరుమలకు నడిచి వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు చేతికర్ర ఇవ్వాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో చాలామంది వెకిలిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దుడ్డుకర్ర భక్తుల ప్రాణాలు కాపాడుతుందా అని హేళన చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారికి ఏ మాత్రం బాధ్యత లేదనిపిస్తోంది. లేదా ప్రభుత్వం మీద దుగ్దతో ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలంటే…మొత్తం అటవీ మార్గమే. అది అలిపిరి మెట్ల మార్గమైనా, శ్రీవారి మెట్టు మార్గమైనా తొలి మెట్టు మొదలు చివరి సోపానం దాకా అడవే. అందులోనూ రిజర్వు ఫారెస్టు. అందుకే శేషాచల అడవుల్లో వన్యప్రాణులు ఎక్కువగానే వుంటాయి. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి చడీచప్పుడు లేకపోవడంతో అడవి జంతువులు … మెట్ల మార్గంలోనూ, ఘాట్ రోడ్లలోనూ స్వేచ్ఛగా తిరగాడటం మొదలుపెట్టాయి. అందుకే కరోనా తరువాత.. చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల సంచారంపై తరచూ వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే భక్తులపై అడవి జంతువుల దాడులు పెరిగాయి. భక్తుల రక్షణ కోసం టిటిడి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అప్పుడప్పుడు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సమస్య మరింత తీవ్రమయింది.
నడక దారి భక్తుల రక్షణ కోసం, సౌకర్యం కోసం… వందల కోట్లు ఖర్చుచేసి నడక దారులను అద్భుతంగా నిర్మించారు. నడవడానికి సౌకర్యవంతంగా మెట్లు, వాతావరణ ఇబ్బందులను తట్టుకునేలా పైకప్పు నిర్మించారు. రాత్రిపూట కూడా నడవడానికి ఇబ్బంది లేకుండా కాంతివంతమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే… చిరుతల జాడ కనిపించినపుడు వాటిని బంధించి దూరంగా విడిచిపెడుతున్నారు.
దేశంలోని ఏ దేవాలయమూ కల్పించని ఏర్పాట్లను టిటిడి చేస్తున్నది. ఇన్ని చేస్తున్నా ఏదో ఒక కారణంతో టిటిడిని విమర్శిస్తున్న వారు ఉన్నారు. తిరుమలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సున్నితంగా మార్చేయడం, సంచలనం చేయడమే ఇందుకు కారణం. అది వేరే అంశం.
ఇక ప్రస్తుత విషయానికొస్తే…భక్తల రక్షణ కోసం చేతికి కర్రలు ఇవ్వాలని నిర్ణయించడం తప్పవుతుందా? భక్తులకు కర్రలు కాకుండా తుపాకులివ్వాలా? అయినా కర్రని తేలిగ్గా తీసేయాల్సిన పనిలేదు. గ్రామాల్లో ఒంటరిగా పొలానికెళ్లే రైతు చేతిలో కర్ర వుంటుంది. ఆ సమయానికి ఆ చేతికర్రే రైతుకు తోడు. రక్షణ. అటవీ ప్రాంతాల్లో సంచరించే గిరివాసులకు కర్రే బలమైన ఆయుధం. ఏనుగును మావటి నియంత్రించేది కర్రతోనే.
మనిషి చేతిలో కర్రను చూస్తే ఏ జంతువైనా భయపడుతుంది. తిరుమల నడక దారిలో చిరుతలతో పాటు ఎలుగుబంట్ల బెడదా వుంది. అలాంటప్పుడు భక్తుల చేతిలోని కర్ర కచ్చితంగా రక్షణగా నిలుస్తుంది. వందలాది భక్తుల చేతుల్లో కర్రలుంటే చిరుతైనా తోక ముడుస్తుంది. ఉత్తి చేత్తో నడవడం కంటే…చేతిలో కర్ర వుండటం ఎన్నో రెట్లు ధైర్యాన్నిస్తుంది. చేతి కర్ర ఊతంతో మెట్లు ఎక్కడమూ సులభమవుతుంది.
ఇలాంటివేవీ పట్టించుకోకుండా, భక్తుల ప్రాణాలు సంకటంలో వున్న వేళలోనూ రాజకీయాల కోసం అవహేళన చేయడం, అసంబద్ధ విమర్శలు చేయడం సమర్ధనీయం కాదు. అయినా చేతికి కర్రలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోలేదు. భక్తులను గుంపులుగా పంపడం, ప్రతి పది మీటర్లకు ఇక సెక్యూరిటీ గార్డు ఏర్పాటు, అటవీ ప్రాంతం వైపు అధిక కాంతినిచ్చే విద్యుత్ దీపాలు, శబ్దం చేస్తూ అడవి జంతువులను దూరంగా తరమటం, అడవి దారిలో చిన్నారుల నడక సమయంలో మార్పులు ఇలాంటి చర్యలూ టిటిడి చేపట్టింది. భక్తుల రక్షణ కోసం ఏమి చేయాలో అన్నీ టిటిడి చేస్తున్నది. దీన్ని అభినందించాల్సింది పోయి… ఎగతాళి చేయడం సరికాదు.
– ఆదిమూలం శేఖర్, సీనియర్ జర్నలిస్టు.