అన్నదాతలపై ఇది గులాబీ సమ్మోహనాస్త్రం!

బ్రహ్మాస్త్రాన్ని మించిన సమ్మోహక అస్త్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికలకు ముందుగా ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల పైచిలుకు అన్నదాతల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా లక్ష రూపాయల వరకు ఉన్న…

బ్రహ్మాస్త్రాన్ని మించిన సమ్మోహక అస్త్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికలకు ముందుగా ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల పైచిలుకు అన్నదాతల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆచరణలోకి కూడా తెచ్చేశారు. 5800 కోట్ల రూపాయల నిధులను ఇందుకు విడుదల చేశారు. 

తమది రైతుబంధు ప్రభుత్వం అని పదే పదే చాటుకుంటున్న చంద్రశేఖర రావు ప్రభుత్వం ఎన్నికల ముంగిట్లో వారిని తమ పార్టీ పట్ల మరింత ఘనంగా ఆకర్షించేలాగా, ఆ విషయాన్ని మరొకసారి నిరూపించుకుంది. నాలుగేళ్లుగా పట్టించుకోని రుణమాఫీ ఇప్పుడే ఎందుకు తెరమీదకు వచ్చిందని విపక్ష పార్టీల నాయకులు ఆడిపోసుకోవచ్చు గాక, ఈ నాలుగేళ్లలో అయిన వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లించాలని సరికొత్త డిమాండ్లను వినిపించవచ్చు గాక, కానీ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల మేర రైతులకు జరిగిన లబ్ది ముందు వారు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు అన్నీ దూది పింజెల్లాగా ఎగిరిపోతాయి!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేస్తున్నారు. అస్త్ర శస్త్రాలను ప్రోది చేస్తున్నారు. అభ్యర్థుల జాబితా విషయంలో అధికార భారత రాష్ట్ర సమితికి పెద్ద చింత లేదు. ఎందుకంటే సిటింగులకే మళ్లీ టికెట్లు అని కెసిఆర్ ఆల్రెడీ తేల్చి చెప్పారు. 

అతి పరిమితమైన స్థానాలలో తప్ప తిరుగుబాటు అభ్యర్థుల బెడద వారికి లేదు. అలాగే కొన్ని నియోజకవర్గాలలో మాత్రమే సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చే ఆలోచన పార్టీ అధిష్టానం చేస్తున్నట్లుగా ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పోటీచేసే వ్యక్తుల గురించి దిగులులేదు కనుక, పూర్తిగా జనాన్ని ఆకర్షించే ఆలోచనల మీదికే కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే రైతు రుణమాఫీ కూడా ఇవాళ కార్యరూపం దాల్చింది.

ఉద్యోగ వర్గాలలో ఉండే అసంతృప్తిని బుజ్జగించడానికి కూడా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. గత పిఆర్సి బకాయిలను ఇప్పటిదాకా చెల్లించకపోవడం వలన వారిలో విపరీతంగా అసంతృప్తి ఉంది. అయితే వారికి ఒక ఆకర్షణ మాటలాగా దేశం మొత్తం నివ్వెరపోయే చూసేటువంటి స్థాయిలో వారికి పిఆర్సి ఉంటుందని త్వరలోనే ఐఆర్ కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల వెల్లడించారు. అయితే ఎన్నికలు ఇంకాస్త దగ్గర పడిన తరువాత ఈ పిఆర్సి ప్రకటన వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. 

అలాగే అన్ని సామాజిక వర్గాలను కూడా ఆకర్షించే వరాలను ఎన్నికలకు ముందుగానే కేసీఆర్ కార్యరూపంలోకి తేవడానికి వ్యూహరచనతో ఉన్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.