విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. వి.విజయసాయి రెడ్డి సారధ్యంలో పార్టీ ఎంపీలు గురువారం పార్లమెంట్ భవనంలోని కార్యాలయంలో రైల్వే మంత్రితో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయాలని కోరుతూ వారంతా సంతకం చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. భేటీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్ట్‌ల స్థితిగతులను మంత్రికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్ళు దాటినా ఇప్పటికీ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదని విజయసాయి రెడ్డి మంత్రికి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి 13 వేల కోట్ల రూపాయల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి అయిన జోన్‌గా రాణిస్తుంది.
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టులకు ఈ జోన్ ద్వారా అందించే రైలు రవాణా సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. దీని వలన రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఎంతగానో అవసరమైన రవాణా అవసరాలు నెరవేరతాయి. రైల్వేకి కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుందని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి వివరించారు. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన కోరారు.
రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ ఒకటని విజయసాయి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలోని కొన్ని రైల్వే జోన్లకంటే కూడా వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది. తూర్పు కోస్తాలో అత్యధిక ఆదాయం గడించే డివిజన్లలో వాల్తేరు డివిజన్‌దే అగ్రస్థానం. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుందని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి స్పష్టం చేశారు. వాల్తేరు డివిజన్ రద్దు వలన కొత్త సమస్యలు కోరి తెచ్చుకున్నట్లవుతుందని కూడా ఆయన చెప్పారు.
వాల్తేరు డివిజన్‌లో ప్రస్తుతం జరిగే కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ డివిజన్‌కు తరలించడం వలన నిర్వహణా సమస్యలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సమస్యలు ఉత్పన్నమై ప్రమాదాల సమయంలో రైల్వే యంత్రాంగం స్పందించే వేగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. అలాగే విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్‌లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
కంటైనర్ టెర్మినల్స్, లోకో షెడ్, వాగన్ వర్క్‌షాప్, 2300 మంది సిబ్బందికి సరిపడ స్టాఫ్ క్వార్టర్లు ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నంలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 125 ఏళ్ళనాటి వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచవద్దని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.