తనపై అబద్ధపు ప్రచారానికి పాల్పడుతున్నారంటూ మీడియా సంస్థలపై పరువు నష్టం దావాను వేశారు నటి శిల్పా షెట్టి. ఒకవైపు ఆమె భర్త పోర్న్ వీడియోల వ్యవహారంలో చిక్కుకుని పోలిస్ కస్టడీలో ఉండగా.. రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూ ఉండగా.. ఇదే వ్యవహారానికి సంబంధించి శిల్ప కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
తన మీద కొన్ని మీడియా వర్గాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయనేది శిల్ప ఆవేదన. ఇందుకు సంబంధించి 29 మీడియా సంస్థలపై దావా వేసింది శిల్ప. పోర్న్ వీడియోల వ్యవహారంతో తనకు సంబంధం ఉందని ఆ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, శిల్ప పేర్కొంది.
పోర్న్ వీడియోల వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినా, మీడియా సంస్థలు తన పరువును తీసేలా కథనాలను ప్రసారం చేస్తున్నాయని శిల్ప తన పిటిషన్లో పేర్కొంది. ఒకవైపు పోలిస్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారాలు తనకు క్షోభను కలిగిస్తున్నాయని శిల్ప పేర్కొంది.
ఈ తరహా ప్రచారానికి పాల్పడుతున్నాయంటూ మొత్తం 29 మీడియా సంస్థలపై ఆమె ఫిర్యాదు చేసింది. ఆ మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారాన్ని తక్షణం ఆపేలా ఆదేశాలివ్వాలని, ఇప్పటి వరకూ ప్రచురించిన కథనాలను డిలీట్ చేయించి, తనకు వారి చేత బేషరతుగా క్షమాపణలు చెప్పించాలని శిల్ప కోర్టును కోరింది.
అలాగే తన పరువునకు నష్టం కలిగించినందుకు గానూ 25 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించేలా కూడా ఆదేశాలను ఇవ్వాలని కోరింది. మొత్తానికి రాజ్ కుంద్రా విషయంలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా శిల్పా షెట్టి ఈ కౌంటర్ పిటిషన్ ను వేసినట్టుగా ఉంది.