పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో భారీ సినిమా ఒకటి తయారవుతున్న సంగతి తెలిసిందే. మలయాళ మాతృక నుంచి లైన్ తీసుకుని, టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ స్క్రిప్ట్, మాటలు అన్నీ సమకూర్చారు.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు 23 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. సాధారణంగా రీమేక్ లకు ఇంత రేటు పలకదు.
అయితే మాతృక నుంచి లైన్ మాత్రం తీసుకుని, చాలా వరకు మార్చేయడం, పైగా భారీ ఫైట్లు జోడించడం వంటి కారణాలతో ఈ రేటు పలికినట్లుంది.
ఇప్పటి వరకు తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రేట్లలో వినయ విధేయరామ దే రికార్డు. బోయపాటి సినిమాలకు సహజంగానే హిందీ డబ్బింగ్ రైట్ల రేట్లు ఎక్కువ పలుకుతాయి. ఆ సినిమాకు 21 కోట్లకు పైగా పలికింది.
రానా పేరు నార్త్ లో కూడా పరిచయం కావడం, సినిమా మల్టీ స్టార్టర్ ఎమోషనల్ యాక్షన్ మూవీ కావడంతో 23 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుండగా సినిమా నిర్మాతలు శాటిలైట్ డిజిటల్ కు కూడా భారీ రేటు కోట్ చేస్తున్నారు. 44 కోట్ల వరకు కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జీ సంస్థతో బేరసారాలు సాగుతున్నాయి. వీళ్లు ఎంతకు దిగుతారో? వాళ్లు ఎంత వరకు వస్తారో తెలియాల్సి వుంది.
ఈ రేటు కనుక ఫిక్స్ అయితే తెలుగు సినిమా (బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను పక్కన పెడితే) కు నాన్ థియేటర్ హక్కుల రూపంలో 67 కోట్లు రావడం అన్నది ఓ రికార్డే అవుతుంది.