లోకేష్ మీద వీళ్లకి ‘చిరాకు’, వాళ్లకి ‘జాలి’

ఏ ముహుర్తంలో ఆర్జీవీ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” తీసాడో గానీ అప్పటినుంచి లోకేష్ తన పాత్రని అందులో చూపించినట్టే నిలబెట్టుకుంటున్నాడు. కాస్త కూడా డెవలప్ అయ్యే సూచనలు చూపించట్లేదు.  Advertisement సినిమాల్లో బ్రహ్మానందాన్ని చూస్తే…

ఏ ముహుర్తంలో ఆర్జీవీ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” తీసాడో గానీ అప్పటినుంచి లోకేష్ తన పాత్రని అందులో చూపించినట్టే నిలబెట్టుకుంటున్నాడు. కాస్త కూడా డెవలప్ అయ్యే సూచనలు చూపించట్లేదు. 

సినిమాల్లో బ్రహ్మానందాన్ని చూస్తే నవ్వొచ్చేట్టుగా రాజకీయాల్లో లోకేష్ పరిస్థితి అలానే ఉంది అధికార పార్టీ వర్గీయులకి. దానికి ప్రధాన కారణం అతనిలో వాక్పటిమ లేకపోవడమో మరొకటో కాదు..కేవలం అహంకారపూరితమైన చాలెంజింగ్ డయలాగ్స్. 

ప్రతి ప్రెస్ మీట్ లోనూ పంచ్ డయలాగ్స్ కొట్టే పని పెట్టుకుంటున్నాడు. తనకి తాను హీరోగా ఫీలవుతున్నాడు. కానీ ఆ సో కాల్డ్ పంచులన్నీ ఉత్తరకుమార ప్రగల్భాల్లాగానే కొడుతున్నాయి. 

అదేదో సినిమాలో “ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే తెలివైనవాడు” అని చెప్పిన సూత్రాన్ని ఏ మాత్రం పాటించట్లేదు లోకేష్ బాబు. 

ఓటర్లు తేప తేపకీ కొడుతున్న దెబ్బలకి నిలబడలేక చతికిలబడి, ఆ తర్వాత బొక్కబోర్లా పడ్డ పార్టీ ప్రస్తుతం కోమాలో ఉంది. ఇప్పుడు కావల్సింది హీరోయిక్ డయలాగ్స్ కావు. జనం చేత హీరో అనిపించుకునే పనులు చెయ్యాలి. 

ఎందుకంటే మాటలతో నెగ్గగలిగే సత్తా ఎలాగో లేదు. కనీసం చేతలతో అయినా ఒళ్లొంచి కష్టపడాలి. జనంతో కలవాలి, నిత్య పాదయాత్ర చెయ్యాలి, మజ్జిగ తాగి “తియ్యగున్నాయి” లాంటి కామెడీ విన్యాసాలు చెయ్యకుండా సీరియస్ గా ప్రజల సమస్యలు తెలుసుకుని నోట్స్ రాసుకోవాలి. ఇలా చెయ్యగా చెయ్యగా నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రధాన ప్రత్యామ్నాయంగా లోకేష్ కనిపించాలి. అప్పుడు గానీ అధికారం కలలు నెరవేరవు. 

తెలుగు ప్రజలు లెక్కల మాస్టర్లు లాంటివాళ్లు. వాళ్లకి ప్రతి విషయంలోనూ ఒక లెక్కుంటుంది. 2014 లో విభజన అయ్యాక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అందుకే చంద్రబాబుకి పట్టం కట్టారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఉన్న మోదీ వేవ్, ఆ పార్టీతో టీడీపీతో పొత్తు మొదలైనవి కూడా కచ్చితంగా పని చేసాయి. 

భవిష్యత్తులో లోకేష్ లాంటి నాయకుడు రాష్ట్రానికి కావాలి అని జనం అనుకుంటే తప్ప మళ్లీ సైకిలుకేసి చూడరు. అది అయ్యే పనేనా అంటే…చాలా చాలా కష్టం. 

లోకేష్ వయసులో ప్రస్తుత ముఖ్యమంత్రికన్నా చిన్నవాడు. సరిగ్గా నిలబెట్టుకుంటే రాజకీయభవిష్యత్తు ఎంతో ఉన్నవాడు. తండ్రి కోరిక నెరవేరేలా ముఖ్యమంత్రి అవ్వాలంటే తనకేది సూటవుతుందో ఆ పని చెయ్యాలి. అంతే తప్ప సూట్ కాని పంచ్ డయలాగ్స్ కావు. స్వీయావలోకనం, మానసిక విశ్లేషణ చాలా అవసరం. 

జగన్ లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే అతనికంటే ధైర్యంగా నిలబడాలి. అతని కంటే ఎక్కువగా పాదయాత్ర చెయ్యాలి. అతని కంటే ఎన్నో రెట్లు ప్రజాభిమానాన్ని మూట కట్టుకోవాలి. అంతే కాని అతన్నొక సాడిస్టుగానో, ఫ్యాక్షనిస్టుగానో నిరూపించే విధంగా ప్రెస్ మీట్లు పెడతానంటే పని జరగదు. 

శత్రువు మరఫిరంగులతో ఉన్నప్పుడు పాత పద్ధతిలో అతని మీద యుద్ధానికి కత్తులు, గదలు పట్టుకెళ్తానంటే ఎలా? 

ఇలాంటి ప్రాథమిక సూత్రాలు చెప్పడానికి ప్రశాంత్ కిషోర్లు, రాబిన్ శర్మలు అవసరం లేదు. జస్ట్ కామన్ సెన్స్ చాలు. 

ఇలా పనికిరాని మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్న లోకేష్ ని చూసి సొంత పార్టీ వాళ్లు చిరాకు పడుతున్నారు. అతన్నంతలా నమ్ముకుని ముందుకు తోస్తున్న చంద్రబాబుపై కోపం కలిగున్నారు. 

మిగతా వారికి మాత్రం హాస్యం స్టేజ్ దాటి ఇప్పుడు జాలి కలుగుతోంది. అవును..అందరికీ విషయం అర్థమవుతున్నా అతని గురించి అతను తెలుసుకోలేక ఎలాంటి తిప్పలు పడుతున్నాడో ..అనిపించినప్పుడు కలిగేది జాలే. 

– సాయినాథ్ మానాప్రగడ