ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు రిలాక్స్ లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఎస్ఈసీని ఆదేశించలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలు నిర్వహించకూడదనే నిమ్మగడ్డ అభిమతానికి తగినట్టే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్టైంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఓ పెద్ద ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దీంతో మొదట పంచాయతీ, ఆ తర్వాత పురపాలక ఎన్నికలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పూర్తి చేశారు.
గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ఎన్నికలు పూర్తి అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఈ నెలాఖరులో నిమ్మగడ్డ పదవీ విరమణ చేయనుండడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు మంగవారం తీర్పునిచ్చింది.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో ఎస్ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. అది ఎస్ఈసీ ఇష్టమని పేర్కొంది. ఎన్నికల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 30కి వాయిదా వేసింది. దీంతో నిమ్మగడ్డ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశమే లేకుండా పోయింది.