కేటీఆర్ కోసం విశాఖ ఎదురుచూపు

విశాఖపట్టణం తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కోసం ఎదురు చూస్తోంది. విశాఖ ఎదురుచూడటమంటే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు,…

విశాఖపట్టణం తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కోసం ఎదురు చూస్తోంది. విశాఖ ఎదురుచూడటమంటే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు, ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్న నాయకులు….వీరంతా కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.

ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఉద్యమ నాయకులు, ఏపీ రాజకీయ నాయకులు కోరకముందే కేటీఆర్ తానే స్వయంగా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి అవసరమైతే ఉద్యమంలో పాల్గొంటానన్నారు. కేసీఆర్ అనుమతి తీసుకొని విశాఖ వెళతానన్నారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాగానే విశాఖ వెళతానన్నారు. కేటీఆర్ ఈ ప్రకటన చేయగానే ఉక్కు కర్మాగారం ఉద్యోగ సంఘాల నాయకులు హైదరాబాద్ కు వచ్చి ఆయన్ని కలిసి ధన్యవాదాలు తెలిపి తప్పనిసరిగా విశాఖకు రావాలని కోరారు. వస్తానని ఈయన మాటిచ్చారు. 

ఆ తరువాత ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు కేటీఆర్ ను కలుసుకొని విశాఖకు రావాలని కోరాడు. వస్తానని ఆయనకూ కేటీఆర్ మాటిచ్చారు. ఈలోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. మరి సమావేశాల్లో పాల్గొనాలి కదా. ఆయన మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ సమావేశాల తరువాత వెళ్ళాలి. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అసెంబ్లీ సమావేశాలు ముందే ముగిస్తారని అంటున్నారు. మరి కేటీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

విశాఖ వెళతానని కేటీఆర్ చెప్పగానే తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ నాయకులు కూడా కేటీఆర్ విశాఖకు రావడమేమిటని ప్రశ్నించారు. ఇక్కడ ఆయన అవసరం లేదన్నారు. కానీ ఉద్యమ నాయకులు మాత్రం కేటీఆర్ విశాఖ పర్యటన కోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ విశాఖ వెళ్లి మద్దతు ఇవ్వడమో, ఉద్యమంలో పాల్గొనడమే చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ ఆగదు. 

ఇదిలా ఉంటే, ‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేం ఒప్పుకోం..’ అని తేల్చి చెప్పాడు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి. అదీ రాజ్యసభ సాక్షిగా. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే ‘విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి మనకేమీ హక్కులు లేవు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమ..’ అని తేల్చేశారు. 

అలాంటప్పుడు, విజయసాయిరెడ్డి ‘మేం ఒప్పుకోం..’ అని కేంద్రానికి పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పడం వల్ల ఉపయోగమేంటి.? అంటే నామమాత్రంగా ప్రశ్నించారని అనుకోవాలా ? జగన్ తో ఆల్రెడీ సంప్రదింపులు జరిపామని ఉక్కు శాఖ మంత్రి ఇదివరకే పార్లమెంటులో చెప్పశారు. కాబట్టి ప్రైవేటీకరణ విషయం వైసీపీ వాళ్లకు తెలియనిదికాదు. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి ఒకలా.. ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఇంకొకలా వ్యవహరిస్తుండడం వల్ల ఈ వ్యవహారం పూర్తి గందరగోళంగా మారిపోతోంది. 

కేంద్రం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి అడుగులు చాలా వడివడిగా వేసేస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి నిరుపయోగంగా వున్న భూముల సంగతి తర్వాత తేలుస్తాం. ముందైతే, ప్రైవేటీకరణ పూర్తి చేస్తామని తాజాగా ఇంకోసారి కుండబద్దలుగొట్టేసింది కేంద్ర ప్రభుత్వం.