సోనియాగాంధీ పగ్గాలు వదిలేసి ఆమె తనయుడికి అప్పగించారు. అతడేమో సరిగ్గా రెండేళ్లు అయినా తిరక్కముందే పార్టీని గెలిపించలేక, విరక్తి వచ్చి వాటిని వదిలేశారు. ఇలా అయినా కాంగ్రెస్ మారుతుంది, ఆ పార్టీ తీరులో మార్పు వస్తుంది, గాంధీయేతర కొత్త నాయకత్వం వస్తుంది… అని కొంతమంది ఆశించారు. అయితే కాంగ్రెస్ తీరుమారదు, ఆ పార్టీ మారలేదు అని మరోసారి స్పష్టం అవుతోంది.
పార్టీ అధ్యక్ష పీఠం విషయంలో వినిపిస్తున్న పేర్లు ఆ అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష బాధ్యతలు మళ్లీ సోనియాకే దక్కబోతున్నాయని అంటే ఆ పార్టీ తీరును చూసి నవ్వుకుంటున్నారు సామాన్య ప్రజానీకం.
ఆల్రెడీ సోనియా తనకు వయసు మీద పడిందని, ఆరోగ్యం సహకరించడం లేదనే తన వారసుడికి పగ్గాలు అప్పగించారు. అతడికేమో పార్టీని గెలిపించే శక్తిలేకపోయా, ఓపికగా ఉండటమూ చేతకాదాయె. ఇతడిని బుజ్జగించడానికి నెలన్నర ప్రయత్నించారు. అది సాధ్యంకాలేదు. దీంతో మళ్లీ సోనియానే బాధ్యతలు తీసుకుంటున్నారట!
అది తాత్కాలికంగా అని చెబుతున్నారు. అంటే కొన్నాళ్లు సోనియా ఆ పీఠంలో మళ్లీ కూర్చుని, ఆ తర్వాత రాహుల్ కు అప్పగిస్తారేమో! రాహుల్ ను బుజ్జగించడానికే సోనియా మరోసారి పగ్గాలు చేపడుతుందేమో! సోనియా కాదంటే ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగిస్తారట. ఆమెలోనూ రాజకీయం పట్ల ఉన్న సీరియస్ నెస్ ఎంతో అందరికీ తెలిసిందే!
ఏతావాతా రాహుల్ గాంధీ చేసిన రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కొత్త శక్తిని ఇవ్వడంమాట అటుంచితే… మరింత అభాసుపాల్జేస్తోందని మాత్రం స్పష్టం అవుతోంది.