కరోనా థర్డ్ వేవ్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. దీంతో మరోసారి ప్రపంచం చిగురుటాకులా వణికిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రపంచ పెద్దన్న అమెరికాపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఒక్క అమెరికానే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలను భయాందోళనకు గురి చేస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో 88,376 కేసులు నమోదయ్యాయి.
కరోనాను తరిమి కొట్టిన దేశంగా రికార్డుకెక్కిన అమెరికాలో తాజా గణాంకాలు మరోసారి అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం మళ్లీ ఇదే మొదలు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి ధాటికి 6.12లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3.5 కోట్ల మంది వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మహమ్మారిని తరిమి కొట్టేందుకు అమెరికా యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. వ్యాక్సినేషన్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55 శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా రావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే మరణాల సంఖ్య పెద్ద మొత్తంలో ఉండడం థర్డ్ వేవ్ తీవ్రతకు సంకేతాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతవారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే అమెరికాలోనే ఎక్కువ నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. జూలై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5లక్షలకు పైగా కేసులు వెలుగు చూడడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం అక్కడ వారానికి సగటు కొత్త కేసుల సంఖ్య 60వేలకు పైనే ఉంటోంది.
జూన్ నెలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్ విస్తృతే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.