ఇప్పుడు నాలుగో వంతు సీఎంలు మాజీల కొడుకులే!

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అని మంగళవారం ప్రకటించిన తర్వాతనే ఆయన రాష్ట్ర మాజీ సీఎం దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై కొడుకనే విషయం ఎక్కువ మందికి తెలిసింది. ఇలా సీఎంగా కొంత కాలం…

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అని మంగళవారం ప్రకటించిన తర్వాతనే ఆయన రాష్ట్ర మాజీ సీఎం దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై కొడుకనే విషయం ఎక్కువ మందికి తెలిసింది. ఇలా సీఎంగా కొంత కాలం పదవిలో ఉన్న బడా నేతల కొడుకులు (కూతుళ్లు సహా) ఎంత మంది అయ్యారనే లెక్కలేయడం వెంటనే పాత్రికేయుల పనిగా మారింది. సాక్షి దినపత్రిక బుధవారం సంచికలో ముఖ్యమంత్రులైన తండ్రీ కొడుకుల (తండ్రీ కూతురును కలిపి) జాబితా ప్రకటించారు. 

ఈ లిస్టులో సీఎం పీఠమెక్కిన 15 మంది తండ్రులు, వారి సంతానం పేర్లు రాశారు. (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు 1956 నవంబర్‌ ఒకటిన అవతరించిన మధ్యప్రదేశ్‌ మొదటి సీఎం పండిత్‌ రవిశంకర్‌ శుక్లా ( సీఎం అయిన రెండు నెలలకే మరణించారు) పెద్ద కొడుకు శ్యామా చరణ్‌ (ఎస్‌సీ) శుక్లా తన తండ్రి కన్నుమూసిన 13 సంవత్సరాలకు (1969 మార్చి) తొలిసారి సీఎం కాగలిగారు. 

హిందీ రాష్ట్రాల రాజకీయాల్లో ఆధిపత్యం ఉన్న కాన్యకుబ్జ బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈ తండ్రీకొడుకులిద్దరూ చాలా ఏళ్ల క్రితం మరణించడంతో ఈ జాబితాలో వారి పేర్లు చేర్చలేదనిపిస్తోంది.) ఈ పేర్లన్నీ చదివాక, అన్ని రాష్ట్రాలకు చెందిన పెద్ద నాయకుల పిల్లలు–వారిలో కొందరు రాజకీయాల్లోకి వచ్చి రాణించడమే గాక ముఖ్యమంత్రి పదవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో సంపాదిస్తున్నారని అర్థమైంది.

ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాలకుగాను (నామమాత్రపు అధికారాలే ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల సంగతి ప్రస్తుతానికి వదిలేద్దాం) ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ సీఎంల కుమారులే. అంటే, నాలుగో వంతు రాష్ట్రాల్లో గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన నాయకుల కుటుంబ వారసలులే రాజకీయ వారసులుగా మారి సీఎం పీఠాలపై ఇప్పుడు కూర్చుని ఉండడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ దిశగా పయనిస్తోందో సూచిస్తోంది. 

ఇప్పుడు పదవిలో ఉన్న ఈ ఏడుగురు ముఖ్యమంత్రులు : ఆంధ్రప్రదేశ్‌–వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, అరుణాచల్‌పదేశ్‌–పేమా ఖాండూ, ఝార్ఖండ్‌–హేమంత్‌ సొరేన్, మేఘాలయా–కాన్రాడ్‌ సంగ్మా, ఒడిశా–నవీన్‌ పట్నాయక్, తమిళనాడు–ఎంకే స్టాలిన్, తాజాగా, కర్ణాటక–బసవరాజ బొమ్మై. దేశంలో సరిగ్గా 25 శాతం రాష్ట్రాల్లో ఇలా ఒకప్పటి సీఎంల కొడుకులే ముఖ్యమంత్రి పీఠాలపై ఉండడం బహుశా మరే దేశంలోనూ సాధ్యమయ్యే పని కాదేమో. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి సీఎంలు కావడం అంత తేలిక కూడా కాదు. 

తండ్రుల తర్వాత అంటే వారు బతికుండగా గాని, మరణించాక గాని వారి కొడుకులు ముఖ్యమంత్రులయ్యే అవకాశం ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ అని చరిత్ర చెబుతోంది. పైన చెప్పిన ప్రస్తుత సీఎంల లిస్టు కూడా ఇదే విషయం వెల్లడిస్తోంది. ఈ ఏడుగురిలో ఐదుగురు (జగన్‌మోహన్‌రెడ్డి–వైఎస్సార్సీపీ, హేమంత్‌ సోరేన్‌–జేఎంఎం, కాన్రాడ్‌ సంగ్మా–నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఒడిశా–నవీన్‌ పట్నాయక్,  ఎంకే స్టాలిన్‌–తమిళనాడు) ప్రాంతీయ పార్టీల నేతలు. మిగిలిన ఇద్దరు: బసవరాజ బొమ్మై–కర్ణాటక, పేమా ఖాండూ–అరుణాచల్‌ప్రదేశ్‌– కేంద్రంలో పాలక కూటమిని నడిపే భారతీయ జనతాపార్టీకి చెందిన నేతలు. ఈ ఏడుగురిలో వయసులో అందరికన్నా చిన్నవాడడైన (41 ఏళ్లు) అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ఖాండూ ఇప్పుడు పేరుకు బీజేపీ నయకుడే గాని 2016లో ద్వితీయార్ధంలో మూడు పార్టీల తరఫున రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసి ఎవరూ చెరపలేని రికార్డు సృష్టించారు.

ఆయన జాతీయ పార్టీగా ఇప్పటికీ చెలామణి అవుతున్న కాంగ్రెస్‌ తరఫున 2016లో జులై 17 నుంచి సెప్టెంబర్‌ 17 వరకూ రెండు నెలలు సీఎంగా ఉండి, హఠాత్తుగా సెప్టెంబర్‌ 17న పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ అనే ప్రాంతీయపక్షంలో చేరి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక, మళ్లీ 3 నెలల 15 రోజులకే రాజీనామా చేసి బీజేపీలో చేరి అదే ఏడాది డిసెంబర్‌ 31న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇలా ఒకే ఏడాది మూడు పార్టీల తరఫున సీఎంగా ప్రమాణం చేసిన ఖాండూ మొత్తంమీద దాదాపు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. వ్రతం చెడినా ఫలం దక్కిందనే సామెత ఖాండూను చూస్తే గుర్తుకొస్తుంది.
 
ఏపీ సీఎం జగన్‌ ప్రయాణం తండ్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్‌తోనే మొదలైనా గాని తండ్రి మరణానంతరం పార్టీ నాయకత్వంతో జరిపిన పోరు ఫలితంగా రాజీనామా చేసి 2011 మార్చి 12న వైఎస్సార్సీపీ స్థాపించారు. ప్రాంతీయపార్టీ పెట్టిన తర్వాత మొదటి ప్రయత్నంలో (2014 ఏప్రిల్‌)లో పరాజయం పాలైనాగాని మొత్తానికి పదేళ్లలోపే సైజు తగ్గిన (294 నుంచి 175 అసెంబ్లీ సీట్లకు కుదించిన అసెంబ్లీ, రాష్ట్రం) ఆంధ్రప్రదేశ్‌లో  2019లో ఆశించిన పదవిని కైవసం చేసుకున్నారు. జాతీయపక్షంలో కాని పని ప్రాంతీయపక్షం స్థాపించాక జగన్‌కు సాధ్యమైంది. 

ఏడుగురు వారసుల (ముఖ్యమంత్రుల) రాష్ట్రాల్లో అన్నిటి కన్నా పెద్దదైన తమిళనాడు సీఎం ముత్తువేల్‌ కరుణానిధి (ఎంకే) స్టాలిన్‌ మిగిలిన వారితో పోల్చితే చాలా ఆలస్యంగా లేటు వయసులో (65 ఏళ్లు) ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయపార్టీ నేత అయిన స్టాలిన్‌ 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచాక తండ్రి కరుణానిధి బతికుండగానే (కొడుకు కోసం కరుణ రెండేళ్లకే రాజీనామే చేస్తే) ముఖ్యమంత్రి పీఠమెక్కుతారని భావించారు. అది జరగలేదు. మొత్తానికి స్టాలిన్‌ సీఎం కావడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. 

జగన్‌ మాదిరిగా లోక్‌సభ (ఐదేళ్లు), అసెంబ్లీ (ఐదేళ్లు) సభ్యుడిగా ఒక్కొక్కసారి మాత్రమే కొనసాగి స్టాలిన్‌ సీఎం కాలేదు. ఆయన మొదట మద్రాసు మేయర్‌గా చాలా కాలం పనిచేశారు. తర్వాత తండ్రి కరుణానిధి కేబినెట్‌లో మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా (2006–20011 మధ్య) ఐదేళ్లు చేశాక ముఖ్యమంత్రి అయ్యారు. అంటే, మోదటిసారి మంత్రి అయిన 15 సంవత్సరాలకు, తండ్రి కన్నుమూసిన తర్వాత 9 మాసాలకు స్టాలిన్‌కు సీఎం పీఠం దక్కింది. జగన్‌ తండ్రి వైఎస్సార్‌ మరణ ంచిన పదేళ్లకు, సొంత ప్రాంతీయ పార్టీ పెట్టిన 8 ఏళ్లకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు. జగన్‌ 45 ఏళ్లకు, స్టాలిన్‌ 65 ఏళ్ల వయసులో తండ్రులు అధిరోహించిన ఉన్నత పీఠాలకు చేరుకున్నారు. 

ఏపీ పొరుగు రాష్ట్రం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా,తన తండ్రి బిజయానంద (బిజూ) పట్నాయక్‌ జాతీయ పార్టీ జనతాదళ్‌ సీఎంగా కొనసాగి (1990–95) 1997లో మరణించిన మూడేళ్లకు బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అనే ప్రాంతీయ పార్టీ స్థాపించి 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి గత 21 ఏళ్లుగా సీఎం పదవిలో కొనసాగి రికార్డు స్థాపించారు. దేశంలో ఒక ప్రాంతీయపార్టీ నేత వరుసగా ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా రాజ్యమేలడం ఇదే మొదటిసారి. 

బుధవారం సీఎంగా ప్రమాణం చేసిన బసవరాజ బొమ్మై తండ్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కూడా జనతాదళ్‌ సీఎంగా 1980ల చివరిలో మూడేళ్లు పనిచేశారు. అయితే, ఆయన కొడుకు మాత్రం బీజేపీ తరఫున సీఎం పదవి సంపాదించడం విశేషం. నవీన్, జగన్, బసవరాజ తమ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడంలో వారి తండ్రుల పాత్ర లేదు. వారు సీఎం పదవి చేపట్టేనాటికి వారి తండ్రులు జీవించి లేరు. బతికుండగా తమ కుమారులను వారు వారసులుగా ప్రకటించనూ లేదు.

ముఖ్యమంత్రి పదవిలో కొన్నేళ్లు ఉండి దిగిపోయాక తమ కుమారులను ఆ పదివిలో చూడాలనుకున్న హరియాణా మాజీ సీఎం, మాజీ ఉప ప్రధాని దేవీలాల్, యూపీ మాజీ సీఎం ములాయంసింగ్‌ యాదవ్, ఒకప్పటి జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫారూఖ్‌ అబ్దుల్లా, ఝార్ఖండ్‌ మాజీ సీఎం శిబూ సోరెన్, కర్ణాటక మాజీ సీఎం, మాజీ ప్రధాని ఎచ్‌డీ దేవెగౌడలు తమ కుమారులు వరుసగా ఓంప్రకాశ్‌ చౌటాలా, అఖిలేశ్‌ యాదవ్, ఒమర్‌ అబ్దుల్లా, హేమంత్‌ సోరెన్, ఎచ్‌డీ కుమారస్వామిని దగ్గరుండి మరీ ముఖ్యమంత్రి పీఠాలపై కూర్చోబెట్టారు. 

వారిలో ములాయం, ఫారూఖ్‌ అబ్దుల్లా, శిబూ సోరెన్, దేవెగౌడలు ప్రస్తుతం ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. షేరే కశ్మీర్‌గా పేరొందిన షేక్‌ అబ్దుల్లా తన కొడుకు డాక్టర్‌ ఫారూఖ్‌ను తన వారసునిగా సీఎంను చేయాలనే లక్ష్యంతో మొదట 1980లో శ్రీనగర్‌ నుంచి లోక్‌సభకు పంపించారు. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర విషయానికి వస్తే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శంకర్‌రావు (ఎస్‌బీ) చవాన్‌ రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన మరణించిన నాలుగేళ్లకు 2008లో ఆయన కొడుకు అశోక్‌ చవాన్‌ కూడా తండ్రి పార్టీ తరఫునే ముఖ్యమంత్రిగా దాదాపు రెండేళ్లు చేసి దిగిపోవాల్సివచ్చింది. 

ప్రస్తుత ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ తన తండ్రి శిబూ సీఎం పదవి నుంచి వైదొలగిన నాలుగున్నర సంవత్సరాలకు 2014 డిసెంబర్‌లో మొదటిసారి సీఎం పదవి చేపట్టి దాదాపు ఏడాదిన్నరకే దిగిపోయారు. 2019 డిసెంబర్‌ ఎన్నికల్లో జేఎంఎం కూటమి విజయం సాధించాక రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, పదవిలో కొనసాగుతున్నారు. మొదట్లోనే ప్రస్తావించిన మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఎస్‌సీ శుక్లా రెండోసారి 1975–77లో, మూడోసారి 1989–1990లో వరుసగా ఏడాది నాలుగు నెలలు, 82 రోజులో ముఖ్యమంత్రి పదివిలో ఉండగలిగారు. మొదటిసారి మాత్రం (1969–1972) దాదాపు 3 ఏళ్లు సీఎంగా రాజ్యమేలారు. 

కాంగ్రెస్‌లో బడా నేతలు కొడుకులెవరూ సమర్ధులుగా నిరూపించుకోలేదనడానికి కారణం వారెవరూ వరుసగా ఐదేళ్లూ పదవిలో కొనసాగి పరిపాలనాదక్షులుగా పేరు సంపాదించ లేక పోవడమే. అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో ‘నట్వర్‌లాల్‌’ (జిత్తులమారి)గా పేరొందిన కాంగ్రెస్‌ బ్రాహ్మణ నేత హేమవతీ నందన్‌ (ఎచ్‌ఎన్‌) బహుగుణ కాంగ్రెస్‌ సీఎంగా యూపీలో 1973–74 మధ్య రెండేళ్లు మాత్రమే పదవిలో ఉన్నా మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను పదవికి రాజీనామా చేయించి కేంద్రానికి రప్పించుకున్నారు. 

ఈ కారణంగానే ఆయన 1977లో బాబూ జగ్జీవన్‌రామ్‌ తదితర నేతలతో కలిసి బయటికి వచ్చి 1988లో మరణించే వరకూ కాంగ్రెసేతర పార్టీల్లోనే కొనసాగారు. ఆయన కొడుకు విజయ్‌ బహుగుణ తర్వాత కాంగ్రెస్‌లో చేరి తమ పూర్వీకుల మూలాలున్న ఉత్తరాఖండ్‌ సీఎంగా కాంగ్రెస్‌ తరఫున 2012–14 మధ్య దాదాపు రెండేళ్లు ఉన్నారు. తండ్రులు రవిశంకర్‌ శుక్లా, ఎచ్‌ఎన్‌ బహుగుణ, శంకర్‌రావు (ఎస్‌బీ) చవాన్‌లు సమర్థ నేతలుగా ప్రసిద్ధికెక్కినా, వారి సుపుత్రులు వరుసగా ఎస్‌సీ శుక్లా, విజయ్‌ బహుగుణ, అశోక్‌  చవాన్‌లు ఆ స్థాయిలో రాణించలేదు. వారికి ఉన్న కుటుంబ నేపథ్యం కారణంగా మాత్రం పదవులైతే దక్కాయి. 

ఆరంభంలో కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల ప్రస్తావన అనవసరం అని చెప్పినా, ఇక్కడ ఒక విషయం గుర్తుచేసుకోవాలి. ప్రస్తుత గోవా రాష్ట్రం 1961లో పోర్చగల్‌ నుంచి స్వాతంత్య్రం సాధించి కేంద్రపాలితప్రాంతంగా కొన్నేళ్లు కొనసాగింది. ఇక్కడ 1963 నుంచి అసెంబ్లీ, ముఖ్యమంత్రితో కూడిన ప్రజా ప్రభుత్వాలు దాదాపు పాతికేళ్లు ఉన్నాయి. ఈ కాలంలో మొదటి ముఖ్యమంత్రి అయిన మహరాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) అనే ప్రాంతీయ పార్టీ నేత దయానంద్‌ బందోద్కర్‌ మధ్యలో మూడు నెలలు మిన హా 1973 ఆగస్ట్‌ 12న కన్నుమూసే వరకూ ముఖ్యమంత్రిగా దాదాపు పదేళ్లు అతి పెద్ద కేంద్రపాలి ప్రాంత సీఎంగా కొనసాగారు. 

ఆయన మరణించిన వెంటనే ఆయన కూతురు శశికళా కాకోద్కర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు రెండేళ్లు అధికారంలో ఉన్నారు. తర్వాత ఆమె రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కూతురిగా (అప్పట్లో గోవా కేంద్రపాలిత ప్రాంతమైనాగాని) సీఎం అయిన తొలి మహిళగా ఆమెను గుర్తు పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా మరో నాయకురాలిని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం రాష్ట్ర హోదా కోల్పోయిన కశ్మీర్‌ పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీయే తండ్రి మరణానంతరం సీఎం అయిన రెండో మహిళ. 

వీపీ సింగ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసి అసమర్థునిగా పేరుతెచ్చుకున్న జమ్మూకశ్మీర్‌ నేత ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కాంగ్రెస్‌ నుంచి 1987లో వీపీ సింగ్‌తోపాటు వైదొలగి కొంత కాలం జనతాదళ్‌లో కొనసాగారు. తర్వాత కొన్నాళ్లు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా కాంగ్రెస్‌లో చేరి 1999లో కూతురు మెహబూబాతో కలసి జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) స్థాపించారు. ఆయన కాంగ్రెస్‌తో పొత్తుతో రెండుసార్లు (దాదాపు నాలుగేళ్లు ) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

సీఎంగా ఉండగా 2015లో మరణించిన రెండున్నరేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆయన కుమార్తె మెహబూబా బీజేపీతో పొత్తుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రెండేళ్ల రెండు నెలలకు బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆమె  2018 జూన్‌లో రాజీనామా చేశారు. ఇలా మెహబూబా కూడా సీఎంగా పనిచేసిన తండ్రి కూతురుగా శశికళ మాదిరిగా ముఖ్యమంత్రి కాగలిగారు. శశికళా కాకోద్కర్‌ (గోవా) తెరమరగు కాగా మెహబూబా సమర్థ నేతగా నిరూపించుకున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలే ఎక్కువ మంది తండ్రుల తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టగలుగు తున్నారు. ప్రాంతీయపార్టీలు దాదాపు కుటుంబ పార్టీలుగా (భారత జాతీయ కాంగ్రెస్‌ సైతం జాతీయ స్థాయిలో నెహ్రూ–గాంధీ పరివార్‌ నేతృత్వంలోని పార్టీయే) నడుస్తున్న కారణంగా వాటిలో కొడుకులు, కూతుళ్లకు తండ్రుల తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కడం సులువేగాని నిలబెట్టు కోవడం కష్టమని భారత రాజకీయాలు నిరూపించాయి. 

ముఖ్యంగా దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో కేరళ, తెలంగాణ (ఇక్కడా సీఎం కేసీఆర్‌ ఏకైక పుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు 2023 డిసెంబర్‌ లోపు ఎప్పుడైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కవచ్చనే ఊహాగానాలున్నా) మినహా మిగిలిన మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాకటకలో దివంగతులైన ముఖ్యమంత్రుల కొడుకులే ఇప్పుడు అధికారంలో ఉండడం కొత్త పరిణామం.

తెలంగాణలో కూడా ప్రాంతీయపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండడం పదవిలోని ముఖ్యమంత్రి కుమారుడికి సీఎం పదవి వారసత్వంగా దక్కుతుందనే వాదనకు అతి సహజమైన కారణం. పైన వివరించిన ముఖ్యమంత్రుల కొడుకులు, కూతుళ్లలో సీఎంలు అయినవారి జాబితాలో 17 మంది (కేంద్రపాలిత ప్రాంతంగా ఉండగా గోవా సీఎం అయిన దయానంద్‌ బందోద్కర్‌ కూతురు శశికళా కాకోద్కర్‌ సహా) లో ఇద్దరు బీజేపీ నేతలు (అరుణాచల్‌ ప్రదేశ్‌–పేమా ఖాండూ, కర్ణాటక–బసవరాజు బొమ్మై)కాగా, ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులు (ఉత్తరాఖండ్‌–విజయ్‌ బహుగుణ, మధ్యప్రదేశ్‌–ఎస్‌సీ శుక్లా, మహారాష్ట్ర–అశోక్‌ చవాన్‌) 

అయితే, మిగిలిన 12 మంది (జమ్మూ కశ్మీర్‌–ఫారూఖ్, ఒమర్‌ అబ్దుల్లాలు, మెహబూబా ముఫ్తీ, ఒడిశా–నవీన్‌ పట్నాయక్, హరియాణా–ఓంప్రకాశ్‌ చౌటాలా, ఉత్తర్‌ ప్రదేశ్‌–అఖిలేశ్‌ యాదవ్, కర్ణాటక–ఎచ్‌డీ కుమారస్మామి, ఆంధ్రప్రదేశ్‌–వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఝార్ఖండ్‌–హేమంత్‌ సోరెన్, తమిళనాడు–ఎంకే స్టాలిన్, మేఘాలయా–కాన్రాడ్‌ సంగ్మా, గోవా–శశికళా కాకోద్కర్‌) ప్రాంతీయ పార్టీల నేతలు. ఈ 17 మందిలో ఏడుగురు ప్రస్తుత ముఖ్యమంత్రులనే వాస్తవం మొదట్లోనే చెప్పినట్టు దేశంలోని మొత్తం (28) రాష్ట్రాల్లో నాలుగో వంతు మంది మాజీ సీఎంల కొడుకులు కావడం ఇండియాలో 21 శతాబ్దం మొదటి రెండు దశాబ్దాల్లో వచ్చిన వినూత్న రాజకీయ పరిణామంగా భావించవచ్చు.

-నాంచార‌య్య మెరుగుమాల‌