బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ హత్యపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతల్ని సీబీఐకి అప్పగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. సోనాలి ఫోగట్ మృతి మొదట సాధారణ మరణమని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఆమెను పక్కా పథకం ప్రకారం హత్య చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.
దీంతో సంచలనం రేకెత్తించిన నటి హత్యకు పాల్పడ్డ దోషులెవరో బయట పెట్టాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. అలాగే ఆమె కూతురి విన్నపం మేరకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మా పోలీసుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే ప్రజల నుంచి ఒత్తిడి, మృతురాలి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’ అని ప్రమోద్ సావంత్ ప్రకటించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
సోనాలి ఫోగట్ హర్యానా నివాసి. దీంతో హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా స్పందించారు. గోవా పోలీసుల విచారణపై సోనాలీ కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తే సీబీఐ విచారణకే అప్పగిస్తామన్నారు. చివరికి అదే జరిగింది. అంటే గోవా పోలీసుల విచారణపై నటి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
సీబీఐ విచారణకు కేంద్రం అంగీకరించాల్సి వుంది. హత్యకు గురైన నటి బీజేపీ నాయకురాలు కూడా కావడంతో కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.