అపార్ట్ మెంట్ లో శున‌కాలు.. ఏది రాంగు ఏది రైటు?

గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో భార‌తీయుల్లో పెరిగిన అభిరుచి శున‌కాల పెంప‌కం. మ‌నిషికి అత్యంత విశ్వాస పాత్ర‌మైన‌వి శున‌కాలు. మ‌నిషి తో పాటు శ‌తాబ్దాల నుంచి పెరుగుతున్నాయి శున‌కాలు. గ్రామీణ భార‌తంలో శున‌కాలు వీధివీధికీ వేటిక‌వే…

గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో భార‌తీయుల్లో పెరిగిన అభిరుచి శున‌కాల పెంప‌కం. మ‌నిషికి అత్యంత విశ్వాస పాత్ర‌మైన‌వి శున‌కాలు. మ‌నిషి తో పాటు శ‌తాబ్దాల నుంచి పెరుగుతున్నాయి శున‌కాలు. గ్రామీణ భార‌తంలో శున‌కాలు వీధివీధికీ వేటిక‌వే ఉంటాయి. వాటి పోష‌ణ‌లో మ‌నుషులు చేసేదే. వీధి కుక్క‌కో, ఇంటి కుక్క‌కో అన్నం వేయ‌డంతో అనేక మందికి రోజు ప్రారంభం అవుతుంది. 

వ్య‌వ‌సాయ‌ధారులు త‌మ‌తో పాటు కుక్క‌ను ఉంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. తోట‌ల ద‌గ్గ‌ర కుక్క‌ల‌ను ఉంచి, వాటికి స‌మ‌యానికి వెళ్లి ఆహారం పెట్ట‌డం చేస్తూ ఉంటారు. ఇంటి ద‌గ్గ‌ర కాపాల‌కు, ఊరి కాపాల‌కు కూడా కుక్క‌లు చాలా ముఖ్య‌మైన‌వి. ప‌ల్లెల్లో అయితే కుక్కలు గ‌ట్టిగా మొరుగుతుంటే అర్ధ‌రాత్రి అయినా త‌లుపులు తీసి చూసే వాళ్లుంటారు. ప‌ల్లెల్లో శున‌కాల‌ను ఎక్క‌డి వ‌ర‌కూ తీసుకెళ్లాలో అక్క‌డి వ‌ర‌కూ తీసుకెళ‌తారు.

అయితే ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కూడా శున‌కాల పెంప‌కం హాబీ గా మారింది. గ‌త ద‌శాబ్ద‌కాలంలో శున‌కాల‌ను పెంచ‌డం అనే హాబీ మ‌రీ ఎక్కువైంది. దీని కోసం ఖ‌రీదైన బ్రీడ్ కుక్క‌ల‌ను తెచ్చి మ‌రీ పోషిస్తూ ఉంటారు. ప‌ది వేల రూపాయ‌లు పెట్టి కుక్క‌పిల్ల‌ను తెచ్చి పెంచుకోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే అంశం. ప‌ది వేలేంటి.. ల‌క్ష‌ల రూపాయ‌లు అయినా తాము కుక్క‌ల‌పై ఖ‌ర్చు పెడ‌తామ‌ని కొంద‌రు రెడీ ఉంటారు. 

ఆ శున‌కాల‌కు ఆహారం సెప‌రేటు. వాటి కోసం మాంసాహారాన్ని ఆన్ లైన్ లో తెప్పించి పెడ‌తారు. వాటికి సాదాసీదా ఆహారాన్ని పెట్ట‌రు కూడా! ఇక వాటికి క్లినిక్ లు వెలిశాయి ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో. కుక్క పిల్ల‌ల‌ను అమ్మే వ్యాపారం కూడా చేసేవాళ్లు బోలెడంత‌మంది ఉన్నారు. ఇదంతా వారి వారి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం. కుక్క‌ల‌ను పెంచుకోవ‌డం పూర్తి వ్య‌క్తిగ‌తం. అయితే ఈ హాబీ ఇప్పుడొక సామాజిక స‌మ‌స్య‌గా మారుతూ ఉంది.

అపార్ట్ మెంట్ ల‌లో కుక్క‌ల‌ను పెంచుతూ ఇత‌రుల‌కు ఇబ్బందులను క‌లిగిస్తున్నా చాలా మంది. అపార్ట్ మెంట్ లో ర‌క‌ర‌కాల మ‌నుషులుంటారు. కొంద‌రికి శున‌కాల పెంప‌కం హాబీ అయితే కావొచ్చు. కానీ ఆ హాబీ ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్ట‌డం అభ్యంత‌క‌ర‌కం. కొన్ని ర‌కాల శున‌కాల ప్ర‌వ‌ర్త‌న విప‌రీతంగా ఉంటుంది. విప‌రీత‌మైన సాధు ర‌కం కుక్క‌లు ప‌క్కింట్ల‌లోకి దూరిపోతాయి. అక్క‌డి పిల్ల‌ల‌, పెద్ద‌ల కాళ్ల‌ను నాక‌డం, విప‌రీతంగా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తాయి. అదేమంటే… త‌మ కుక్క‌లు ఏమీ అన‌వ‌ని, భ‌య‌ప‌డొద్దంటూ చెబుతారు వాటి య‌జమానులు. అయితే ఈ విష‌యం అవ‌త‌లి వాడికి అర్థం అయ్యేలోగా వాడు ప‌డే టెన్ష‌న్ అంతా ఇంతా కాదు. ప్ర‌తి సారీ అలా కుక్క‌లు ప్ర‌వ‌ర్తిస్తే చిరాకు రావొచ్చు!

ఇక గ‌ట్టిగా మొరిగే ర‌కాలు మ‌రో టార్చ‌ర్. త‌మ ఫ్లాట్ బాల్క‌నీలో వాటిని క‌ట్టేస్తారు. అవేమో బంధీ కావ‌డం చేత విపరీతంగా మొర‌గ‌డం, దారెంట వెళ్లే వాళ్ల‌ను చూస్తే మొర‌గ‌డం.. ఇదంతా కూడా ప‌క్క వారిని ఇబ్బంది పెట్టే అంశ‌మే. ఇక లిఫ్ట్ ల‌లో కుక్క‌ల‌తో సంచ‌రించే వారు త‌యార‌య్యారు. ఆ కుక్క‌లు త‌మ యజ‌మానితో బాగా ఉన్నా.. ఇత‌రుల‌ను గుర్రుగా చూస్తే ఉంటాయి. ఈ మ‌ధ్య కొన్ని సంఘ‌ట‌న‌ల్లో ఈ కుక్క‌లు వారే వాళ్ల‌ను క‌ర‌డం, వీటి బాధితులు చిన్న పిల్ల‌లు కావ‌డం జ‌రిగింది. వాటిని పెంచుకునే వారికి ఇదేమీ ఇబ్బంది కాదు. కానీ.. అపార్ట్ మెంట్ల‌లో ఇలా సాటి వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌డం స‌మంజసం కాదు.

ఇక ఆ శున‌కాల కాల‌కృత్యాల కోసం ఉద‌యాన్నే వాటిని బ‌య‌ట‌కు తీసుకు వ‌స్తారు. బెల్టుల‌తో క‌ట్టి తీసుకువ‌చ్చి రోడ్ల‌పై వాకింగ్ చేసే వాళ్ల‌ను బెద‌ర‌గొడ‌తారు. అలాగే రోడ్ల‌పై ఆ కుక్క‌లు కాల‌కృత్యాలు తీర్చుకుంటే వాటిని క్లీన్ చేసే వాడెవ‌రు? ఇదేమీ వాటి య‌జమానుల‌కు ప‌డ‌వు. కుక్క‌లు వారికి స్టేట‌స్ సింబ‌ల్! అంతే.. వారి భూత‌ద‌య‌కు కుక్క‌ల పెంప‌కం గొప్ప నిద‌ర్శ‌న‌మే కానీ, ఇత‌రుల ఇబ్బందిని వారు ఖాత‌రు చేయ‌క‌పోవడం స‌మంజ‌సం కాదు. 

త‌మ ఇంటికంటూ ఒక కాంపౌండ్ ఉండే వారు కుక్కల లాల‌నాపాల‌నా బాగా చూసుకోగ‌ల‌రేమో కానీ, అపార్ట మెంట్ ల‌లో ఇత‌రుల‌ను హ‌డ‌లుకొట్ట‌డం మాత్రం నిస్సందేహంగా అభ్యంత‌ర‌క‌రం.