రెబల్‌స్టార్ కృష్ణంరాజును రాజకీయంగా బీజేపీ తమ వాడిని చేసుకుంది. బీజేపీ నాయకుడిగానే ఆయన అంతిమ ప్రస్థానాన్ని ముగించేలా ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. కృష్ణంరాజు రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యంలలో కొనసాగారు. ఆ తర్వాత ఆయన బీజేపీ నాయకుడిగానే చెలామణి అవుతూవచ్చారు. గతంలో ఆయన వాజ్‌పేయ్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేసిన సంగతి తెలిసిందే.
మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్‌గా వెళ్లారనే ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ కోరిక తీరకుండా ఆయన తనువు చాలించారు. ఇవాళ ఆయన భౌతికకాయానికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితర నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు పార్థివదేహంపై బీజేపీ జెండాను ఉంచి తమ నాయకుడిగా గౌరవించుకున్నారు.
గతంలో కృష్ణంరాజు, ప్రభాస్‌తో పాటు కుటుంబ సభ్యులంతా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభు త్వానికి, బీజేపీకి ఆయన మద్దతు తెలుపుతూ వచ్చారు.
అలాగని పదవుల కోసం కృష్ణంరాజు ఎప్పుడూ వెంపర్లాడ లేదు. ఎంతో హుందాగా నడుచుకునే వారు. కృష్ణంరాజు వివాద రహితుడిగా గుర్తింపు పొందారు. అందరి వాడిగా ఆయన తుది వరకూ జీవన యానం సాగించడం విశేషం.