రాజధాని మహాపాదయాత్ర-2కు చౌదరమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవాళ ఉదయం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేంకటేశ్వరస్వామి రథాన్ని నడిపి పాదయాత్రను ప్రారంభించారు. హైకోర్టు స్వల్ప ఆంక్షలతో పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి రావడం విశేషం.
అమరావతి కాదు, అది భ్రమరావతి, కమ్మరావతి అని వైసీపీ నేతలు విమర్శించడంపై గతంలో రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. అది కూడా తన సామాజిక వర్గ సమావేశంలో జగన్కు ఆమె సవాల్ విసిరారు. ఏపీలో అనేక సమస్యలుంటే ప్రత్యేకంగా అమరావతి పాదయాత్రకే రేణుకా చౌదరి ఎందుకొచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వాళ్లంటే ఆమెకి అంత ప్రేమ మరి.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా వచ్చానన్నారు. మళ్లీమళ్లీ వస్తుంటానని ఆమె చెప్పు కొచ్చారు. ఈ సందర్భంగా జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మూర్ఖపు పాలన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అందువల్ల అమరావతికి మద్దతుగా నిలుస్తామన్నారు. గతంలో రాజధానిగా అండగా నిలుస్తామని ప్రధాని మోదీ చెప్పారని, ఇప్పుడాయన ఏమయ్యారని నిలదీశారు.
అమరావతి అంటేనే చంద్రబాబు సామాజిక వర్గం వాళ్లంతా ఏకమవుతున్నారనే విమర్శ ఉంది. అమరావతి ఉద్యమానికి గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బంగారు గాజులను విరాళం ఇచ్చారు. అమరావతి ఉద్యమం నడిపేందుకు గతంలో చంద్రబాబు జోలె పట్టిన సంగతి తెలిసిందే. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా చౌదరి, నాయుడు, రావులు ఏకమవడం ఆసక్తికర పరిణామం.