కరోనా నివారణకు మందు కనుగొనడం గురించి పరిశోధిస్తున్న అమెరికన్ ఫార్మా సంస్థ మోడెర్నా కీలకమైన ప్రకటన చేసింది. ఇప్పటికే ల్యాబ్ దశలో విజయవంతం అయిన తాము రూపొందించిన వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లో కూడా విజయవంతం అవుతోందని ఆ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలోనే వాలంటరీగా ముందుకు వచ్చిన వారిపై హ్యూమన్ ట్రయల్స్ మొదలయ్యాయి. మొత్తం 8 మంది మీద ఈ ప్రయోగాలను నిర్వహించారు. అందుకు సంబంధించి పరిశీలనల అనంతరం, ఆ మందు విజయవంతం అయ్యిందని మోడెర్నా ఫార్మా ప్రకటించింది.
మొత్తం మూడు డోసేజ్ లతో ప్రయోగాలు నిర్వహించినట్టుగా వివరించింది. లో , మీడియం, హై డోసేజ్ లతో ప్రయోగం జరిగిందని, ఈ ప్రయోగంలో హై డోసేజ్ మాత్రం తేడా కొట్టిందని పేర్కొంది. జ్వరం, ఇతర సైడెఫెక్ట్స్ తలెత్తాయట హై డోసేజ్ తో, కానీ ఒక్క రోజులోనే మళ్లీ ఆ జ్వరం, నొప్పులు కూడా తగ్గిపోయాయని పరిశోధన సంస్థ ప్రకటించింది. హై డోసేజ్ గురించి పరీక్షలే అనవసరం అని, ఎలాగూ హై డోసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఆ సంస్థ చెబుతోంది. లో, మీడియం డోసేజ్ ల మీదే తదుపరి పరీక్షలు చేయనున్నట్టుగా తెలిపింది.
ఇక రెండో ఫేస్ లో మొత్తం 600 మంది మీద ఈ ట్రయల్స్ నిర్వహించబోతున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అమెరికన్ ప్రభుత్వ అనుమతి కూడా జారీ అయినట్టుగా సమాచారం. రెండో దశ ప్రయోగం కూడా విజయవంతం అయితే, మూడో దశలో కొన్ని వేల మంది మీద ఈ మందును ప్రయోగించి చూస్తారు. కరోనా నివారణకు యాండీ బాడీస్ ను జనింపజేయడం ఈ మందు ప్రయోగం ఉద్ధేశం. యాంటీ బాడీస్ జనరేట్ కావాలి కానీ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, తాత్కాలికంగా అయినా, దీర్ఘకాలికంగా అయినా సైడ్ ఎఫెక్ట్స్ లేని రీతిలో ఈ మందును తయారు చేయాల్సి ఉంది.
ల్యాబ్ దశలో ప్రయోగం విజయవంతం కావడం, తొలి దశలో 8 మంది మీదా ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. 600 మంది మీద ప్రయోగించనున్నారు, ఆ తర్వాత వేల సంఖ్యలో వ్యక్తుల మీద ప్రయోగాలు జరగబోతున్నాయి. అవి కూడా విజయవంతం అయితే అప్పుడు అధికారికంగా మందును అందుబాటులోకి తీసుకొస్తారు. మిగతా రెండు దశల ప్రయోగాలూ పూర్తయ్యేందుకు మరి కాస్త సమయం పట్టొచ్చని అంటున్నారు. ఈ ఏడాది చివరకు లేదా, వచ్చే ఏడాది ప్రారంభానికి కల్లా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని అంచనా.