కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి షాక్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. తన భార్య శిల్పా నాగిని రెడ్డిని ఎలాగైనా వైస్ చైర్‌పర్సన్‌గా చూడాలనుకున్న ఎమ్మెల్యే కలలను వైసీపీ అధిష్టానం కల్లలు చేసింది. దీంతో ఎమ్మెల్యే నొచ్చుకున్నారని సమాచారం.
రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో రెండో డిప్యూటీ మేయర్/ వైస్ చైర్మన్ పదవిని జగన్ ప్రభుత్వం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నెల 30న ఈ తంతు పూర్తి కానుంది. దీంతో చైర్మన్ పదవి ఆశించిన వాళ్లకు రెండో పదవిపై కన్ను పడింది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలనే ఆశతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తన సతీమణి శిల్పా నాగినిరెడ్డిని 36వ వార్డు నుంచి ఎన్నికయ్యేలా చూసుకున్నారు.
శిల్పా నాగినిరెడ్డి రాజకీయాల్లో చాలా యాక్టీవ్ అని పేరు తెచ్చుకున్నారు. ప్రజాసేవ చేయాలనే తపన ఆమె మాటల్లో, చేతల్లో కనిపిస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవిలో ఉంటే నంద్యాల వాసులకు మరింత చేరువ కావచ్చని ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య భావించారు. అయితే తామొకటి తలస్తే …వైసీపీ అధిష్టానం మరో రకంగా ఆలోచించింది. చైర్పర్సన్ పదవిని ముస్లింలకు కేటాయించింది. దీంతో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి మాబున్నీసాను వరించింది.
కనీసం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పదవైనా దక్కుతుందని నాగినిరెడ్డి భావించారు. ఆ పదవిని బలిజ సామాజిక వర్గానికి కేటాయించడంతో వాసగిరి విజయభాస్కర్‌ను ఎన్నుకోవాల్సి వచ్చింది. రెండో వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చిందని సమాచారం.
తాజాగా సామాజిక సమీకరణల్లో భాగంగా ఆ పదవిని కూడా ఇవ్వలేమని ఎమ్మెల్యేకు అధిష్టానం స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే, ఆయన సతీమణి తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం.