cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

మరి..మీరేం చేస్తారు జగన్ జీ!

మరి..మీరేం చేస్తారు జగన్ జీ!

అధికారుల పనితీరు తాను ఆశించిన మేరకు లేదని ఆంధ్ర సిఎమ్ జగన్ కాస్త బాధపడ్డారు. అది సహజమే. ఏ బాస్ అయినా తన కిందవారు తను ఆశించిన మేరకు పని చేయలేకపోతే అలాగే బాధపడతారు. కానీ అదే సమయంలో బాస్ కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి వుంది. 

తాను ఇంట్లో కూర్చుంటాను. మీరు చాకిరీ చేయండి అంటే ఎంత నెల జీతగాళ్లు అయినా వ్యవహారం సరిగ్గా వుండదు. ఎంత సూపర్ వైజరీ జాబ్ అయినా ఫీల్డ్ లో వుంటే వచ్చే ఫలితం వేరు. ఇంట్లో కూర్చుంటే ఒనగూడే ఫలితం వేరు. ఈ విషయం ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ గమనించలేకపోతున్నారు.

సుదీర్ఘకాలం, కిలోమీటర్ల కొలదీ పాదయాత్ర చేసి సాధించిన అధికారం అనంతరం విశ్రాంతి కోరుకుంటున్నారా? అప్పుడు నడిచేసాం, మళ్లీ ఎన్నికలప్పుడు మళ్లీ వెళ్లాలి. ఇప్పుడు మధ్యలో ఎందుకు అనుకుంటున్నారా? కేవలం పక్కా బాస్ మాదిరిగా పదిగంటలకు రావడం, రెండు మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించడం, సాయంత్రం కాగానే ఇంటి ముఖం పట్టడం. ఇదేనా బాస్ బాధ్యత? 

కరోనా ఫస్ట్ ఫేజ్ కావచ్చు. రెండో ఫేజ్ కావచ్చు. అవి ముగిసిన అధ్యాయాలు. ఇక ఎన్నాళ్లో వాటి సాకు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకోలేరు ఎవ్వరూ. ఇకనైనా కాలు కదిపి జిల్లాల్లో అడుగు పెట్టకపోతే ఎలా? క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలా వుందో? ప్రభుత్వ పనితీరు ఎలా వుందో? తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్ మీద వుంది కదా? ఆయన ఆ బాధ్యతను విస్మరించి, అధికారులు తన అభిమతం మేరకు పని చేయడం లేదని అనడం ఎంత వరకు సబబు?

కొత్త జిల్లాల ఏర్పాటు హామీ ఇచ్చారు. పేర్లు ప్రకటించి ఊరుకున్నారు. ఆ పక్రియ అసలు ఏ దశలో వుందో జగన్ చెప్పగలరా?

మూడు రాజధానులు అన్నారు. విశాఖ పాలనా రాజధాని అయింది. కానీ కోర్టు వ్యవహారాలు అడ్డం పడి వుండొచ్చు. కనీసం సిఎమ్ క్యాంప్ కార్యాలయం అయినా విశాఖలో ఆరంభించే ఆలోచన వుందా? అసలు ఆ పాలనా రాజధానికి ఏడాదికి ఒకసారయినా జగన్ వెళ్లి వస్తారా? 

ఎడా పెడా ఐఎఎస్ లు, ఐపిఎస్ ల బదిలీలు చేస్తున్నారు. ఎంత అనాలోచితంగా చేస్తున్నారు అంటే బదిలీ ఆర్డర్ అందుకున్నవారు వెళ్లి అక్కడ జాయిన్ అయ్యేలోగానే మరో బదిలీ ఆర్డర్ వస్తోంది. ఇది ఎవరి పనితీరు తప్పిదం?

అనేక మందికి అనేకానేక పదవులు ఇచ్చారు. వాళ్లకి కనీసం కూర్చోడానికి కార్యాలయాలు కానీ, పని చేయడానికి కనీసపు నిధులు కానీ వున్నాయా?

రైతుల ముంగిటకు వెళ్లి ధాన్యం కొనుగోలు అన్నారు. అలా జరుగుతోందా? ధాన్యం ఇచ్చిన రైతులకు నగదు చెల్లింపు ఎప్పటికి జరుగుతుందో ఓ అంచనా అయినా వుందా?

రైతు భరోసా కేంద్రాలు, పల్లెల్లో పలు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపు ఎప్పటికి జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా?

ప్రభుత్వ సిబ్బందికి డిఎ లు ఫలానా ఫలానా తేదీల్లో అని ప్రకటించి చాలా కాలం అయింది. ఆ తేదీలు దాటిపోయాయి. కొత్త తేదీలు ప్రకటించే ఆలోచన వుందా?

ఇలా రాసుకుంటూ, ప్రశ్నించుకుంటూ పోతే అన్నీ ప్రశ్నలే. సమాధానాలే కరువు. మరి వీటన్నింటికీ ఎవర్ని తప్పు పట్టాలి? అధికారులనా? ముఖ్యమంత్రినా? ఇప్పటి వరకు జగన్ ఎలా పాలించినా అధికారులు, ఉద్యోగులు కిక్కురు మనకుండా వున్నారు. కోర్టుల చేత అభిశంసనలు కూడా అందుకుంటున్నారు. ఇప్పుడు జగన్ కూడా వారినే తప్పు పట్టడం ప్రారంభిస్తే, వ్యవహారం వికటించే ప్రమాదం వుంది. 

ఒకసారి ఉద్యోగులు కనుక రోడ్ల మీదకు వచ్చి నోరు తెరవడం ప్రారంభిస్తే ప్రభుత్వం డొల్లతనం అంతా జనం కళ్ల ముందుకు వచ్చేసే ప్రమాదం పొంచి వుంది. ఇది గమనించాలి మీరు జగన్ జీ.

చాణక్య

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×