కేసీఆర్ కి మైనస్.. జగన్ కి ప్లస్

నవరత్నాల కార్యక్రమాన్ని ఏ మహూర్తాన ప్రకటించారో కానీ జగన్మోహన్ రెడ్డికి అది వరప్రదాయినిగా మారిందనే చెప్పాలి. అధికారంలోకి రావడం వరకే కాదు.. ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కూడా నవరత్నాలు బాగా ఉపయోగపడుతున్నాయి. కరోనా…

నవరత్నాల కార్యక్రమాన్ని ఏ మహూర్తాన ప్రకటించారో కానీ జగన్మోహన్ రెడ్డికి అది వరప్రదాయినిగా మారిందనే చెప్పాలి. అధికారంలోకి రావడం వరకే కాదు.. ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కూడా నవరత్నాలు బాగా ఉపయోగపడుతున్నాయి. కరోనా కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను చూస్తే.. కేసీఆర్ కి అదే మైనస్, జగన్ కి అదే ప్లస్ అయింది.

కరోనా ఇబ్బందుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాలు కట్ చేశాయి. సగం సగం జీతాలతో సతమతమైన వేతనజీవులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. మిగతా సగం ఎప్పుడొస్తుందో తెలియదు, వచ్చేనెలైనా పూర్తి జీతం ఇస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వాలపై కాస్త వ్యతిరేకత పెరిగినమాట వాస్తవం. అయితే అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు మేలుచేసే కార్యక్రమాలను అర్జంట్ గా తెరపైకి తెచ్చాయి. అక్కడ కేసీఆర్ రైతుబంధు పథకం నిధులు విడుదల చేశారు, ఇక్కడ జగన్ రైతు భరోసా సొమ్ము అకౌంట్లలో వేశారు, అక్కడికి రైతన్నలు హ్యాపీ. మరి మిగతావారి సంగతేంటి?

తెలంగాణలో మాత్రం రైతులు మినహా మిగతా వర్గాలు సంతోషంగా లేవు, ఎందుకంటే అక్కడ విడివిడిగా ప్రతి వర్గానికి ఉపయోగపడే పథకాలేవీ లేవు. ఏపీలో మాత్రం మహిళలకు సున్నావడ్డీ డబ్బులు పడ్డాయి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జగనన్న విద్యాదీవెన సొమ్ము ముట్టింది, రైతులకు భరోసా పడింది, వచ్చే నెలలో వాహన మిత్ర పథకం నిధులు పడతాయి, నాయీ బ్రాహ్మణులకు, దర్జీలకు కూడా సొమ్ము అదే సమయంలో అందుతుంది, చేనేత భరోసా కూడా జూన్ లోనే వస్తుంది. ఓవరాల్ గా ఏపీలోని ప్రతి కుటుంబమూ కరోనా కష్టకాలంలో ఏదో విధంగా లబ్ధిపొందుతోంది.

ఇక వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ఈ కష్టకాలంలో బ్రహ్మాండంగా అక్కరకొచ్చింది. అంటే నవరత్నాలు జగన్ కి అద్భుతంగా కలిసొచ్చాయన్న మాట. కరోనా విపత్తు సమయంలో ఆదాయం తగ్గి, ఆసరా తగ్గి, సవాలక్ష ఆంక్షలతో మధ్యతరగతిలో ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరిగిందన్న మాట వాస్తవం. అలా పెరిగిన వ్యతిరేకతను ఏపీ ప్రభుత్వం పూర్తిగా పూడ్చుకోగలిగింది. ప్రతి వర్గానికి, ప్రతి కుటుంబానికి న్యాయం చేయగలిగింది. తెలంగాణలో మాత్రం కేవలం రైతులు మాత్రమే లబ్ధిపొందగలిగారు. 

కేసీఆర్ న్యూ రూల్స్ అదుర్స్

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం