“ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదు. స్టెరీన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, విషవాయువు ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే పోరాడతాం. లాక్ డౌన్ తర్వాత ప్రజాజీవితం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే దీనిపై ఉద్యమిస్తాం.”
విశాఖ జిల్లా నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు ఇవి. అతడు చెప్పిన మాటల్ని యథతథంగా ఇక్కడ ఇచ్చాం. ఇందులో ఆరోపణైతే కనిపిస్తోంది కానీ, సహేతుకత కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాయింట్ ఒక్కటి కూడా లేదు. బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు లేవన్నారు పవన్. కేవలం ఎక్స్ గ్రేషియాతో ఆగిపోకుండా.. యంత్రాంగం మొత్తాన్ని బాధిత ప్రాంతంలోనే మొహరించారు జగన్. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ అధికారులంతా ఆ సమస్య మీదే దృష్టిపెట్టారు. వార్డ్ వాలంటీర్లు ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి సహాయం చేశారనే విషయం పవన్ కు తెలుసా? దాదాపు ప్రతి అధికారి బాధిత ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లిన విషయం పవన్ కు తెలుసా?
ఆర్ఆర్ వెంకటాపురంలో ప్రభుత్వ అధికారులే అనధికారికంగా 15 మంది వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి సేవ చేస్తున్నారనే విషయం పవన్ కు తెలుసా? వాళ్లకు కావాల్సిన ప్రతి వస్తువును ఇంటికే అందిస్తున్నారనే విషయం తెలుసా? గడిచిన 5 రోజులుగా వైసీపీ జిల్లా స్థాయి నేతలంతా బాధిత ప్రాంతంలోనే తిరుగుతున్నారనే విషయం జనసేనానికి తెలియకపోవచ్చు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. వెంటిలేటర్ పై ఉన్నవాళ్లకు 10 లక్షల రూపాయలిచ్చారు. 2-3 రోజులు చికిత్స పొందిన వాళ్లకు పాతిక వేలు ఇచ్చారు. విషవాయువు ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 10వేల ఆర్థిక సాయం అందించారు. పశువులు పోగొట్టుకున్న వాళ్లకు కూడా నష్టపరిహారం ఇచ్చారు. ఇలా ఆర్థికంగానే కాకుండా.. మానసికంగా కూడా ఆదుకునేందుకు, బాధిత ప్రజల్లో ధైర్యం నింపేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికీ రెస్ట్ లేకుండా పనిచేస్తోంది. కొంతమంది అధికారులైతే ఇప్పటికీ గూర్ఖాల్లా అర్థరాత్రి వేళ ఆ ప్రాంతంలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాళ్లందరి సేవల్ని ఒక్క స్టేట్ మెంట్ తో పవన్ తీసిపారేశారు.
కావాలనుకుంటే పవన్.. తన అధికారిక మిత్రపక్షం బీజేపీ, అనధికారిక మిత్రపక్షం టీడీపీతో కలిసి ఆందోళన చేసుకోవచ్చు. కానీ స్థానిక అధికారులు, వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలు చేసిన సేవల్ని తప్పుపడితే మాత్రం ప్రజలు క్షమించరు. పవన్ కు ఇప్పటికే విశాఖ ప్రజలు ఓసారి బుద్ధిచెప్పారు. అది గుర్తుపెట్టుకొని జనసేనాని రాజకీయాలు చేస్తే మంచిది.