టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్ “ప్రశ్నించేందుకు” అనే ట్యాగ్‌తో రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ఆ పార్టీ భవిష్యత్ ఏంటి? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన…క్షేత్రస్థాయిలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు.
హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో 2014 మార్చి 14న వైభవోపేతంగా జరిగిన సభలో జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ ఆర్భాటంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టు నాటి సభలో ఆయన ప్రకటించారు. రెండు గంటలకు పైగా ఊగిపోతూ, ఉర్రూతలూగిస్తూ సాగిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. రాబోయే కాలానికి ఓ మంచి నాయకుడు మన ముందుకొస్తున్నారని అప్పట్లో అందరూ ఎంతో ఆశించారు.
అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేయకుండా, బీజేపీ-టీడీపీ మిత్రపక్షానికి మద్దతు పలికారు. ఆ రెండు పార్టీలను గెలిపించాలని ఊరూ వాడా తిరిగి విస్తృత ప్రచారం చేశారు. పవన్ మద్దతు పలికిన బీజేపీ- టీడీపీ ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత పవన్ ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. ప్రశ్నల ఊసేలేదు. అడపాదడపా ఏపీలో అధికార టీడీపీని వెనుకేసుకు రావడానికి మీడియా ముందుకొచ్చే వారు. ఇలా నాలుగేళ్లు గడిచిపోయాక…తీరిగ్గా మళ్లొకసారి పవన్ ప్రజల ముందుకొచ్చారు.
బీజేపీ, టీడీపీలతో పొత్తు లేదన్నారు. వామపక్షాలకు స్నేహహస్తం చాచారు. అసలే మనోడు చేగువేరా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని అనేక సందర్భాల్లో ప్రస్తావించడంతో ఎర్రన్నలు పొంగిపోయారు. పవన్‌తో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలతో పాటు బీఎస్పీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన మొత్తం 136 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అందులో 120 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 21 లక్షలు మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాల్లో కొద్దోగొప్పో ఓట్లు లబించాయి. కనీసం అక్కడ పరువు నిలుపుకునే ఓట్లు సాధించింది. మిగిలిన 11 జిల్లాల్లో జనసేన కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని సాలూరు, గజపతి నగరం నియోజక వర్గాలు, విశాఖ జిల్లాలోని మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో జనసేన కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. అలాగే పాడేరులో జనసేన పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
మరీ ముఖ్యంగా జనసేనాని గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి కూడా ఆయన ఓటమిపాలయ్యారు. ఇక ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. దీంతో ఆ మాత్రమైనా పార్టీ పరువు దక్కింది. అయితే ఆ ఏకైక ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం జనసేనాని వెంట నడవడం లేదు. జగన్ సర్కార్‌కు మద్దతుగా నిలిచారు.
ఐదు నెలల క్రితం బీజేపీతో పవన్‌కల్యాణ్ పొత్తు కుదుర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకుని నాలుగేళ్లలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చేందుకు ఆ రెండు పార్టీల నేతలు కలిసి ఓ ప్రణాళిక రచించుకు న్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు సమాన దూరంలో ఉంటూ తాము బలపడాలని రెండు పార్టీల నేతలు గట్టిగా తీర్మానించుకున్నారు. అయితే రాజధాని మార్పు నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో లాంగ్‌మార్చ్ చేస్తామని పవన్ ప్రకటించినప్పటికీ , ఆచరణకు నోచుకోలేదు.
ఐదు నెలలుగా బీజేపీ-జనసేన ఉమ్మడిగా ప్రెస్మీట్లు పెట్టడం తప్ప, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి ఏ ఒక్క ఆందోళన కార్యక్రమం నిర్వహించలేదు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియాను బీజేపీ స్వాగతించింది. జనసేనాని నోరు మెదపడం లేదు. తాజాగా ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకోకపోతే ఉద్యమించాలని పార్టీ కేడర్‌కు పవన్ పిలుపునిచ్చారు. అలాగే జీఓ 203కి బీజేపీ మద్దతు పలికింది. జనసేనాని మాత్రం నోరు మెదపడం లేదు.
పొత్తు మాత్రం బీజేపీతో, విధానాలు మాత్రం టీడీపీని అనుసరిస్తున్నట్టుగా జనసేనపై విమర్శలున్నాయి. అందులోనూ బీజేపీతో కలవడాన్ని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి జనసేన నాయకులు అంగీకరించడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల వేలం, అధిక కరెంటు బిల్లులు, మద్యం విక్రయాలపై నాయకులందరూ చర్చించుకుని సమష్టిగా క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పవన్ పిలుపు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆందోళన కార్యక్రమాలను బీజేపీతో కలిసి చేస్తారా? లేక సొంతంగా చేస్తారా? టీడీపీ, ఇతర ప్రతిపక్షాలతో కలిసి చేస్తారా? అనే దానిపై జనసేన భవిష్యత్ ఆధారపడి ఉంది. జనసేనానికి నిశ్చల మనస్తత్వం లేదని ఇప్పటికే ఆ పార్టీ నుంచి వైదొలగిన పలువురు ముఖ్య నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే.
మరోవైపు పవన్ సినిమాలకు పరిమితమైన పరిస్థితుల్లో ఆయన ఆదేశాలు కిందిస్థాయిలో ఏ మాత్రం అమలతాయనేది కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఇటూ బీజేపీతో సఖ్యత కుదరక, అటూ టీడీపీతో కలవలేక…మరోవైపు సినిమాల్లో బిజీ అయిన నేపథ్యంలో జనసేన భవిష్యత్‌కు దారేదీ? అని కార్యకర్తలు, నాయకులు అంతర్మథనంలో ఉన్నట్టు సమాచారం. దానికి పవన్ దగ్గర మాత్రమే సమాధానం ఉంది. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన జనసేనాని పవన్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం కావడం ఓ విషాదం.
-సొదుం