వాక్సినేషన్ సాధ్యాసాధ్యాలు అనే వ్యాసంలో ఈ ఆగస్టు-డిసెంబరు మధ్య 140 కోట్ల డోసులు లభ్యమైతే తప్ప మనం ఏడాది చివరకు లక్ష్యాన్ని చేరలేము అన్న విషయం గురించి రాశాను. అన్ని డోసులు ఎలా వస్తాయి? ప్రభుత్వం చెపుతున్న అంకెలలో గందరగోళం ఏమిటి? అనే దానిపైనే యీ వ్యాసం. ఐదు నెలల్లో 140 కోట్ల డోసులు అంటే నెలకు 28 కోట్లు కావాలి. కానీ ఆగస్టులో వస్తున్నదెంత? 15 కోట్లని ఇవాళ్టి పేపర్లో వచ్చింది. చెప్తున్నది ఎవరు? నెగ్‌వాక్ చైర్మన్ వికె పాల్! గతంలో ఐసిఎమ్మార్ చీఫ్ బలరాం భార్గవలా యీయనా ఏవేవో మాట్లాడుతూంటాడు. ఏది చెప్పినా విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. ఈ 15 కోట్ల అంకె చెప్పడంలో కూడా ‘వి హేవ్ ఏ విజిబిలిటీ ఆఫ్ ఎబౌట్ 15 క్రోర్ డోసెస్’ అన్నాడు. ఈ ఎబౌట్ ఎంత ఎబౌటో తెలియదు. పైగా విజిబిలిటీ అనే మాట ఏమిటి? సందేహంగా వుంటే కనీసం పాజిబిలిటీ అనాలి. విజిబిలిటీ అంటే మేఘాలు కనబడుతున్నాయి, వర్షం వస్తే రావచ్చు అన్నట్లా?
నిజంగా ఈయన చెప్పినట్లే 15 కోట్లు వచ్చేశాయనుకోండి, అప్పుడు సెప్టెంబరు-డిసెంబరు 3 నెలల్లో 125 కోట్ల డోసులు రావాలి. చిన్నపిల్లలకు కూడా వాక్సిన్లు మొదలెట్టేస్తాం అంటున్నారు. అలా అయితే లక్ష్యం మరీ పెద్దదై పోతుంది. ఆరోగ్యమంత్రి మాండవీయ కితం వారం చెప్పినపుడు కోవాక్సిన్ జులైలో 2.50 కోట్ల డోసులు, ఆగస్టులో 3.50 కోట్ల డోసులు వస్తాయన్నారు. అంటే ఈ 15 కోట్లలో 3.50 కోట్లు కోవాక్సిన్‌వైతే తక్కిన 11.50 కోట్లు యితర కంపెనీలు సప్లయి చేయాలన్నమాట. దేశంలో ప్రస్తుతానికి వున్న వాక్సిన్‌లు ఎన్ని, ఏవి ఎంతెంత లభ్యమౌతున్నాయి అనేది చూదాం. ముందుగా చెప్పాల్సింది ఫైజర్, మోడెర్నా వాక్సిన్ల గురించి. అవి వద్దామనుకున్నపుడు మన ప్రభుత్వం అనుమతించలేదు. దాంతో ఫైజర్‌కు చికాకేసి అప్లికేషన్ విత్‌డ్రా చేసుకుంది కూడా. రెండో వేవ్ వచ్చిపడ్డాక ప్రజలంతా టీకాలు మహాప్రభో అనడం మొదలెట్టాక, ప్రభుత్వంపై అక్షింతల వర్షం కురిపించాక అప్పుడు ‘సరే, వచ్చి టీకాలమ్ముకోండి’ అంది.
ఇక అప్పణ్నుంచి అవి బెట్టు చేయడం మొదలెట్టాయి. మాకు ఇండెమ్నిటీ కావాలన్నాయి. వాళ్లకిస్తే మాకూ యివ్వాలి అని ఆదార్ పూనావాలా మొదలెట్టాడు. అసలు మన దేశంలో ఈ క్లాజ్ అవసరం వుందా? 45 కోట్ల డోసులు వేశారు. టీకా వేయించుకున్నా కరోనా వస్తూనే వుంది. ఆసుపత్రి పాలవుతూనే వున్నారు. మందులు వేయించుకుంటున్నా తగ్గటమే లేదు. కొందరు చనిపోతున్నారు కూడా. అయినా ఎవరైనా ‘మీ టీకా పని చేయలేదు, మీ మందు పనిచేయలేదు, మాకు నష్టపరిహారం చెల్లించండి’ అని అడిగినవాడున్నాడా? నిజానికి క్లినికల్ ట్రయల్స్ దశలో వాలంటీర్లు అలా అడగవచ్చు. అలా ఒక చెన్నయ్ వాలంటీరు కోవిషీల్డుపై కేసు పెడితే పూనావాలా పరిహారం యివ్వకపోగా వాడిపై ఎదురు కేసు పెట్టాడు. మోతుబర్లతో బక్కవాడు పేచీ పెట్టుకోగలడా? అయినా ఫైజర్, మోడెర్నా, జాన్సన్‌లకు ఇండెమ్నిటీ యిచ్చాం, ఎమర్జన్సీ యూజ్ కింద అనుమతి యిచ్చాం రండి బాబూ అంది ప్రభుత్వం.
కానీ అవి దిగి రావటం లేదు. ప్రభుత్వం రాసే లేఖలకు స్పందించటం లేదు. ఎందుకంటే వాటికి ప్రపంచమంతా మార్కెట్ వుంది. ఉన్నవాటిలో అన్నిటికన్నా మెరుగ్గా మెడెర్నా, ఆ తర్వాత ఫైజర్ పనిచేస్తున్నాయని చదివాను. ఆస్ట్రాజెన్‌కా ఫలితాలతో అంత సంతృప్తిగా లేక యూరోపియన్ దేశాలు కూడా మొదటి డోసు అది వేసుకున్నా రెండో డోసుగా యీ రెండిటిలో ఏదో ఒకటి వేసుకుంటున్నారు. జర్మనీ ఛాన్సెలర్ మెర్కెల్ మొదటి డోసు ఆస్ట్రాజెన్‌కా, రెండో డోసు మోడెర్నా వేసుకుంది. ఫ్రెంచ్ ప్రభుత్వం తన పొరుల్లో 55 ఏళ్ల లోపు వాళ్లు మొదటి డోసు ఆస్ట్రాజెన్‌కా వేయించుకుని వుంటే, రెండో డోసు ఫైజర్, మోడెర్నా వంటి మరోటి వేసుకోండి అని ఆదేశాలిచ్చింది. యుకెలో సైతం రెండో డోసు ఫైజర్, మోడెర్నా వేసుకుంటున్నారని చదివాను.
మరి అలాటప్పుడు వాళ్లకు ఇండియాలో అమ్ముకోవలసిన అవసరం ఏముంది? గ్లోబల్ వాక్సిన్ షేరింగ్ ప్రోగ్రామ్, ‘కోవాక్స్’ ద్వారా 75 లక్షల మోడెర్నా డోసులు ఇండియాకు వస్తాయి అనే వార్త వచ్చింది. ఇంకేముంది, జులై 15 నుంచి మోడెర్నా ఇండియాలో లభ్యం అని చెప్పేశారు. జులై 15 దాటి రెండు వారాలైంది. ఎక్కడా కనుచూపు మేరలో లేదు. ఏమైంది అంటే కంపెనీ వాళ్లు స్పందించటం లేదు అంటోంది ప్రభుత్వం. మరి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చినా కోటి, ముప్పావు కోటి యిస్తే మనకేం సరిపోతాయి?
ఇక స్పుత్నిక్! రష్యన్ల ఆర్‌డిఐఎఫ్ (రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్) మన దేశంలో ఐదు సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని, వాటిలో ప్రముఖ ఔషధ సంస్థ రెడ్డీ లాబ్స్ ఒకటని, అందుచేత ఆగస్టు నాటికి 1.80 కోట్ల స్పుత్నిక్ వాక్సిన్‌లు లభ్యమవుతాయని, భారతీయ భాగస్వాములు 2022 మార్చి కల్లా మొత్తం 85 కోట్ల డోసులు తయారు చేస్తారని మే22 హిందూలో వచ్చింది. ఆ తర్వాత జూన్ 1న 30 లక్షల డోసులు రష్యా నుంచి దిగుమతి అయ్యాయని అన్ని టీవీల్లోనూ వచ్చింది. జూన్ రెండో వారం నుంచి దేశంలోని అపోలో ఆసుపత్రుల నుంచి పంపిణీ జరుగుతుందని, ధర రూ.995 వుంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే జూన్ 15న అపోలోవారు వారి సిబ్బందికి యిచ్చుకున్నారు, వచ్చినవారికి యిస్తున్నారు తప్ప స్పుత్నిక్ గురించి పెద్దగా ప్రచారం చేయటం లేదు. ఎక్కడ చూసినా కోవిషీల్డ్, కోవాక్సిన్ తప్ప స్పుత్నిక్ గురించి ముచ్చటే లేదు. ప్రభుత్వం, మీడియా కూడా దాని గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఎందుకిలా? అని అనుకుంటూ వచ్చాను.
జులై 12న సమాధానం దొరికింది. రెడ్డీ లాబ్స్ వాళ్లు రాయిటర్స్‌తో మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. తక్కిన వాక్సిన్‌లన్నిటికీ మొదటి డోసు, రెండో డోసుల్లో తేడా లేదు. కానీ స్పుత్నిక్ విషయంలో మొదటి డోసును ఒక రకమైన వెక్టర్‌లోను, మూడు వారాల తర్వాత వేసుకునే రెండో డోసును మరో రకమైన వెక్టర్‌లోను తయారు చేస్తారు. రష్యన్లు రెడ్డీ లాబ్స్ వాళ్లకు జూన్1న 30 లక్షల మొదటి డోసులు పంపారు కానీ, రెండో డోసులు జులై నెల మొదటివారంలో కేవలం 3.60 లక్షలే పంపారు. ‘రెండు డోసులూ సమాన సంఖ్యలో వుంటే తప్ప విరివిగా టీకాలు వేయలేం.’ అని రెడ్డీస్ వాళ్లు నిదానంగా పంపిణీ చేస్తున్నారు. హైదరాబాదులో దొరుకుతోంది కానీ కర్ణాటకలో బెంగుళూరులోనే దొరుకుతోందని, కాబట్టి కర్ణాటకలోని మిగతా ప్రాంతాల నుంచి బెంగుళూరు వచ్చి వేయించుకుంటున్నారనీ జులై 10 టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను.
నిజానికి రెడ్డీస్ వాళ్లు యిక్కడ ఉత్పత్తి చేస్తామన్నారు. అది యింకా ప్రాసెస్‌లోనే వున్నట్లుంది. రెండు డోసులు వేరేవేరేగా చేయడంతో ఉత్పత్తి ప్రక్రియ క్లిష్టమైనది. అందువలన రష్యన్లు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ సమకూర్చుకోవడం టైము పడుతుంది. ఇక్కడే యింకో విషయం చెప్పాలి. టీకాలలో ఆదాయం తక్కువ కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు ఔషధాలపై ఆధారపడ్డాయి తప్ప టీకాలను పట్టించుకోలేదు. టీకాల్లో దిగ్గజం అనదగిన సీరం టర్నోవరు రూ. 6 వేల కోట్లయితే, సిప్లా, రెడ్డీ లాబ్స్ వాళ్లది రూ.17 వేల దరిదాపుల్లో వుంటుంది. ఇప్పుడు యీ టీకాలకు డిమాండు రావడంతో చిన్న కంపెనీలు హఠాత్తుగా స్కేల్ అప్ చేయడమంటే తబ్బిబ్బు పడుతున్నాయి.
ప్రస్తుతానికి స్పుత్నిక్ కోసం దిగుమతులపై ఆధారపడడం తప్పటం లేదు. అది యిలా అస్తవ్యస్తంగా వుండడంతో స్పుత్నిక్ సరఫరా కుంటినడక నడుస్తోంది. లోకల్ సంపెనీలు అందుకుంటే తప్ప స్పుత్నిక్ డోసులు కోట్లలో లభ్యం కావు. ఇది పూర్తిగా ప్రయివేటు సెక్టార్‌లో నడిచే వ్యవహారమే. కొని రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన బాధ్యత కేంద్రానిది కాదు. కానీ ఎవరైనా యీ టీకా వేయించుకుంటే లక్ష్యం చేరడానికి దోహదపడినట్లే కదా! అందువలన కేంద్రం రష్యన్లతో మాట్లాడి సెకండ్ డోసుల సరఫరా సరిగ్గా జరిగేట్లు చూడాలి. ఎందుకంటే జులై 17 ఆంధ్రజ్యోతి ప్రకారం కేంద్రం ఆగస్టు-డిసెంబరుల మధ్య తాము 133 కోట్ల డోసులు ఎలా యిస్తామో యిచ్చిన లెక్కలో స్పుత్నిక్ 10 కోట్ల డోసులు వస్తాయని చెప్పారు. ఇప్పుడున్న వరస చూస్తూంటే ఆ ధైర్యం కలగటం లేదు.
వికె పాల్ గారు మే నెలలో చెప్పినపుడు డిసెంబరు 31 నాటికి 216 కోట్ల డోసులు యిస్తామని చెప్పారు. అయితే జూన్ 26 నాడు కేంద్రం కోర్టుకి యిచ్చిన అఫిడవిట్‌లో దాన్ని 135 కోట్లకు తగ్గించారు. జులై నెలాఖరుకి 51 కోట్ల టీకాలు వేస్తామన్నారు. (జూన్ 27 నాటి హిందూ). జులై 17 వచ్చేసరికి అది 133 కోట్లయింది. దానిలో స్పుత్నిక్ 10 కోట్లు పోగా తక్కినవాటిలో జైడస్ కాడిలా 5 కోట్ల డోసులు, బయోలాజికల్–ఇ వారి కోర్బెవాక్స్ టీకాలు 30 కోట్ల డోసులు కూడా వున్నాయి. కోర్బెవాక్స్‌కై రూ. 1500 కోట్ల ఎడ్వాన్సు యిస్తానని కేంద్రం జూన్‌లో చెప్పింది. అంటే డోసుకి రూ.50 అన్నమాట! జైడస్ కాడిలా తాము ఆగస్టు 1 నుంచి నెలకు 1 కోటి డోసులు చొప్పున చేస్తామని, ఏడాదిలో 10 కోట్ల డోసులు చేయడం తమ లక్ష్యమనీ అన్నారు. దాని ప్రకారమైతే 5 కోట్లు వాళ్ల నుంచి వస్తాయి.
ఇక్కడికి 10 ప్లస్ 5 ప్లస్ 30 మొత్తం 45 కోట్లు అయ్యాయి. ఇక తక్కిన 88 కోట్లు ఎక్కణ్నుంచి వస్తాయి? అంటే కోవిషీల్డ్, కోవాక్సిన్‌లను చూపిస్తోంది కేంద్రం. ఆగస్టు-డిసెంబరుల మధ్య సప్లయి చేయవలసిన 37.5 కోట్ల కోవిషీల్డ్ (డోసుకు రూ.205 చొప్పున), 28.5 కోట్ల కోవాక్సిన్ (డోసుకు రూ.215 చొప్పున) మాకు రూ.14505 కోట్లు ఖర్చవుతుంది. దీనిలో కొంత అడ్వాన్సు యిచ్చాం అని కేంద్రం చెప్పింది. ఈ రెండూ కలిపితే 66 కోట్లు మాత్రమే అయింది కదా, తక్కిన 22 కోట్లు ఎక్కణ్నుంచి వస్తాయి? అంటే ‘మరో 22 కోట్ల కోవిషీల్డ్, కోవాక్సిన్ డోసులు ఆగస్టు-డిసెంబరు నడుమ అందుబాటులోకి రాబోతున్నాయ’ని చెప్తున్నారు. అంటే వీటికి ఎడ్వాన్సు యివ్వలేదు కాబట్టి కలిపి చెప్పలేదన్నమాట.
మొత్తానికి తేలిందేమిటంటే ప్రభుత్వం కోవిషీల్డ్, కోవాక్సిన్‌ల సరఫరా మీదే ప్రధానంగా ఆధారపడింది. మరి ఆగస్టు-డిసెంబరు మధ్య అంటే 5 నెలల్లో 88 కోట్ల డోసులు చేసే సామర్థ్యం వీటికి వుందా? మే 24న కేంద్రం కోర్టుకి చెప్పింది యిది – ‘కోవిషీల్డు ప్రస్తుతం నెలకు 5 కోట్లు తయారవుతోంది. కోవాక్సిన్ నెలకు 90 లక్షలు తయారవుతోంది. జులై కల్లా యివి నెలకు 8.5 కోట్ల (6.5 ప్లస్ 2.0) డోసులు యిచ్చేస్తాయి. ఆ లెక్క ప్రకారం ఆగస్టు-డిసెంబర్ల మధ్య 44 కోట్ల డోసులు లభ్యమౌతాయి.’ అని. ఇప్పుడు ఆ అంకెను రెట్టింపు చేసేసి 88 కోట్లు చేసేస్తాయి అంటోంది. ఇలా అంకెలు సవరించడం కేంద్రానికి అలవాటై పోయినట్లుంది.
మే నెలలో కేంద్రం కోర్టుకి స్టేటుమెంటు యివ్వగానే ఈ లెక్కన డిసెంబరు ఆఖరుకు 190 కోట్లు ఎలా వస్తాయి? అని అడగసాగారు. దాంతో అందుకని ఎన్‌టాగీ (నేషనల్ టెక్నికల్ ఎడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్)లో కోవిడ్ వర్కింగ్ గ్రూపు చైర్మన్ ఎన్‌కె అరోడా చేత మే 31న ఓ స్టేటుమెంటు యిప్పించింది. ఆనాటి బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఆయన ‘‘సీరం వాళ్లు జూన్ నెలాఖరు కల్లా నెలకు 10-12 కోట్ల డోసులు చేసేస్తారు, భారత్ వాళ్లు జులై నెలాఖరు కల్లా నెలకు 10-12 కోట్లు చేసేస్తారు. ఆగస్టు కల్లా 20-25 కోట్ల డోసులు వీళ్ల ద్వారానే వచ్చేస్తాయి. మరో 5-6 కోట్ల డోసులు యితర వాక్సిన్‌లో, విదేశీ వాక్సిన్‌లో వచ్చేస్తాయి. దాంతో రోజుకి కోటి మందికి చొప్పున టీకాలు వేసేస్తాం.’’ అని చెప్పారు.
ముందుగా కోవిషీల్డు సంగతి చూద్దాం. సీరం ఇన్‌స్టిట్యూట్ పెద్ద సంస్థే! కానీ అది చాలాచాలా చేసేస్తానంటోంది. స్పుత్నిక్‌ను సెప్టెంబరు నుండి ఉత్పత్తి చేస్తానంది. కోవోవాక్స్‌కు భారతప్రభుత్వం అనుమతి యిస్తే దాన్నీ ఉత్పత్తి చేస్తానంటోంది. ప్రపంచవ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం కోవాక్స్‌కి సీరమ్ వాళ్లు 20 కోట్ల డోసులు జూన్ నెలాఖరుకి యిస్తామనే కమిట్‌మెంట్ వుంది. ఇక కోవిషీల్డు విషయానికి వస్తే కోవిషీల్డు జూన్ నెలలో 10 కోట్ల డోసులు చేయగలిగింది. జులైలో 11 కోట్లు చేయగలిగానని ప్రకటించింది. ఆగస్టు నుంచి 12 కోట్లు చేయగలదని అనుకోవడానికి అస్కారం వుంది. అలా అయితే డిసెంబరు వరకు కనీసం 60 కోట్లు యివ్వగలదని అనుకోవచ్చు.
కోవాక్సిన్ – అసలు చిక్కంతా వీళ్ల సామర్థ్యం గురించి రకరకాలుగా చెప్తూరావడంలోనే ఉంది. మే 28 నాటి డెక్కన్ హెరాల్డ్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వారి ప్రకటన ఒకటి చూశాను. దానిలో వారు కోవాక్సిన్ ఉత్పాదన ఏప్రిల్‌లో కోటి వుందని, జులై-ఆగస్టుల్లో నెలకు 6-7 కోట్లు, సెప్టెంబరు నాటికి 10 కోట్లు అయిపోతుందన్నారు. చూడండి, కేంద్రం కోర్టుకి చెప్పినదానికి, ఆరోగ్యశాఖ మనకు చెప్పినదానికి, అరోడాగారు చెప్తున్నదానికి ఏమైనా పొంతన వుందా?
భారత్ వాళ్లు ఉత్పాదనను నెలకు 12 రెట్లు పెంచేస్తారట, అదీ జులై నెలాఖరు కల్లా! వాళ్లకు నేషనల్ ఇమ్యునైజేషన్‌కు యివ్వవలసిన యితర వాక్సిన్‌ల కమిట్‌మెంట్లున్నాయి. అవి చేస్తూ యివి చేయాలి. 12 రెట్ల సామర్థ్యం పెంచుకోవాలంటే కావలసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవడానికి టైము, డబ్బు అవసరం. ప్రభుత్వం రూ.1500 కోట్లు యిస్తానని ప్రకటించినది ఏప్రిల్ 19న! వెంటనే డబ్బు చేతిలో పెట్టేశారని అనుకున్నా దానితో వాళ్లు యంత్రాలకై ఆర్డర్లు పెట్టాలి, అవి రావాలి. వాళ్లను నడపడానికి, నైపుణ్యం వున్న కార్మికులు కావాలి, టెస్టింగు చేయడానికి నిపుణులు కావాలి. వీళ్లందరూ రాత్రికి రాత్రి పుట్టుకురావడానికి వాళ్లేమైనా కరోనా వేరియంట్లా? గతంలో ఐసిఎమ్మార్ బలరాం భార్గవ్ తరహాలో అరోడాగారు కోతలు కోస్తున్నారని అనిపించటం లేదూ!?
ఇంతకీ భారత్ వాళ్లు ఏమంటున్నారు? మే 28 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎల్లా కృష్ణ జనవరి 5న తమ వద్ద 2 కోట్ల డోసులు తయారుగా వున్నాయన్నారు. ఏప్రిల్ 20న ‘మేం మార్చిలో 1.5 కోట్లు చేశాం, ఏప్రిల్‌లో 2 కోట్లు చేయబోతున్నాం. మేలో 3 కోట్లు చేస్తాం.’ అని చెప్పారు. ‘ఇదే నిజమనుకుంటే వీళ్లు కనీసం 8 కోట్ల డోసులు తయారు చేసి వుండాలి. ఎగుమతి ఐన 6.6 కోట్ల డోసుల్లో అధికాంశం కోవిషీల్డువే. పోనీ వీళ్లవి 2 కోట్లున్నాయనుకున్నా, 6 కోట్ల డోసులు మార్కెట్లోకి వచ్చి వుండాలి. జూన్ 21 నాటి ఇండియా టుడే ప్రకారం ఆ సంచిక తయారయ్యేనాటికి కోవాక్సిన్ 2.7 కోట్లు యిచ్చారు. మరి యీ 6 కోట్ల డోసులు ఏమయినట్లు?’ అని టైమ్స్ అడిగింది.
అంటే భారత్ సామర్థ్యం గురించి ప్రభుత్వం అతిశయోక్తులు చెప్పేస్తోంది, కంపెనీ దానికి వంత పాడుతోంది అని అర్థమవుతోంది. మా సినిమాకు అంత కలక్షన్లు వచ్చాయి, యింత వచ్చాయి అని నిర్మాత యాడ్స్ యిచ్చేస్తాడు. అవి చూపించి ఇన్‌కమ్‌టాక్స్ వాళ్లు నిలదీస్తే ‘అబ్బే, అవన్నీ ప్రచారం కోసమే’ అంటూ నీళ్లు నానుస్తాడు. అలాగే టాక్స్ వాళ్లు అడిగితే వీళ్లు ‘ప్రజల్లో ధైర్యం నింపడానికి చెప్పామంతే’ అని తప్పించుకుంటారేమో!
ఈ మధ్యలో భారత్ వాళ్లు మేం వాక్సిన్ తయారు చేసి, మార్కెట్లో పంపడానికి నాలుగు నెలలు పడుతుంది. మాది సుదీర్ఘ ప్రక్రియ. చిటికెలు వేస్తే ఊడిపడదిది అని కచ్చితంగా చెప్పారు. ప్రభుత్వం ఏప్రిల్‌లో యిచ్చిన డబ్బుతో మే కల్లా యంత్రాలు, పనివారు దొరికి ఉత్పాదన ప్రారంభించినా సెప్టెంబరు దాకా ఆ బ్యాచ్ బయటకు రాదు. అరోడాగారు ఆగస్టు కల్లా వచ్చేస్తాయంటున్నారు. భారత్ బయోతో పాటు మరి కొన్ని సంస్థలు కూడా కోవాక్సిన్ చేస్తాయి కాబట్టి, వాటిని కూడా కలుపుకుని అరోడా చెప్పారనుకుంటే, దాని సంగతి తర్వాత మాట్లాడదాం. దానికి ముందు ఈ 4 నెలల వ్యవధి నన్ను కలవరపెట్టింది.
జనవరి కల్లా 2 కోట్ల డోసులు రెడీగా పెట్టామని జనవరి5న ఎల్లా కృష్ణ చెప్పారు. వాటిని అప్పుడే మార్కెట్‌లో విడుదల చేశారు కానీ మార్చి 3న మూడో దశ ఫలితాలు విడుదల చేస్తే తప్ప ఆ టీకాలు ఎక్కువమంది వేయించుకోలేదు. కానీ అవి జనవరి బ్యాచే కదా! జనవరి 5 కల్లా సిద్ధంగా వున్నాయంటే 4 నెలల క్రితం అంటే సెప్టెంబరు 5న తయారీ మొదలు పెట్టారన్నమాట. అదే సమయానికి భారత్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది. నవంబరు చివరి వారంలో మూడో దశ మొదలుపెట్టింది. దీని అర్థం రెండో దశ మొదలుపెట్టకుండానే యీ టీకా తయారీ మొదలుపెట్టేశారు. తలచుకుంటే భయమేస్తోంది కదా! మనకు తెలియకుండానే మనం వాలంటీర్లమై పోయామన్నమాట!
కోవిషీల్డు, కోవాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం గురించి ప్రభుత్వం ఎంత గందరగోళంగా మాట్లాడుతోందో టైమ్స్ ఆఫ్ ఇండియా 24 07 21 వార్త స్పష్టం చేసింది.
జులై 20న పార్లమెంటులో ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఖర్గే అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘కోవిషీల్డు సామర్థ్యం నెలకు 11 కోట్ల నుంచి 12 కోట్లు అవుతుంది. కోవాక్సిన్‌ది నెలకు 2.5 కోట్ల నుంచి 5.8 కోట్లకు పెరుగుతుంది’ అన్నారు. అదే రోజు టిజి వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు బదులుగా కోవిషీల్డు నెలకు 13 కోట్లు చేస్తుంది, కోవాక్సిన్ నెలకు 1.75 కోట్లు చేస్తుంది అన్నారు. అదే రోజు ఖర్గే అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ‘ఐసిఎమ్మార్, భారత్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కోవాక్సిన్‌కు ప్రస్తుతం వున్న నెలకు కోటి డోసుల సామర్థ్యం నుంచి రాబోయే నెలల్లో 10 కోట్ల సామర్థ్యానికి పెంచడానికి బయోటెక్ డిపార్టుమెంటు కృషి చేస్తుంది.’ అన్నారు.
చూడండి, ఒకే రోజు ఎన్ని రకాలుగా చెప్పారో! ఇదే కాదు, ఏప్రిల్‌లో సుప్రీం కోర్టుకి ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌లో భారత్ కెపాసిటీ నెలకు 2 కోట్లు అని రాసి, కొన్ని పేజీల తర్వాత కోటి మాత్రమే అని రాశారట. (ఫ్రంట్‌లైన్ జూన్ 16 సంచిక). ఇక మే 9న యిచ్చిన అఫిడవిట్ ప్రకారం జులై నాటికి కోవాక్సిన్ సామర్థ్యం 5.5 కోట్లు అయి వుండాలి! మరి చివరి సమాధానం ప్రకారం చూస్తే దాని సామర్థ్యం నెలకు 1 కోటి అన్నమాట! జూన్ 26న కేంద్రం సుప్రీం కోర్టుకి యిచ్చిన అఫిడవిట్ ప్రకారం జులై నెలాఖరుకి 51.6 కోట్ల డోసులు లభ్యమవుతాయని వాటిలో కోవాక్సిన్ వాటా 8 కోట్లు వుంటుందని చెప్పింది.
అయితే వాస్తవమేమిటి? జనవరి నుంచి మే 21 వరకు 2.55 కోట్ల కోవాక్సిన్ డోసులు యివ్వడం జరిగిందని కోవిన్ వెబ్‌సైట్ చెప్తోంది. జులై4 హిందూ ప్రకారం జనవరి నుంచి జూన్ వరకు ఆర్నెల్లలో భారత్ వాళ్లు చేయగలిగింది 4 కోట్ల డోసులు మాత్రమే! జులై 20 నాటి మంత్రి సమాధానం ప్రకారం చూస్తే జులైలో యింకో కోటి డోసులు చేసి వుంటారు. మొత్తం మీద జులై వరకు చేయగలిగినది 5 కోట్లనుకుందాం. కేంద్రం సుప్రీం కోర్డుకి జూన్ 26న యిచ్చిన అఫిడవిట్ ప్రకారం వీళ్లు ఆగస్టు నుంచి డిసెంబరు లోపున 5 నెలల్లో 40 కోట్ల డోసులు (ప్రభుత్వం నుంచి 28.5 కోట్ల డోసులకు అడ్వాన్సు తీసుకున్నారు, ప్లస్ అదనపు 22 కోట్లలో వీళ్ల వాటా 11.5 కోట్లు కాబోలు) చేయాలి. చేయగలమని చెప్పుకోవాలంటే చాలా ఆశాభావం, సాహసం కావాలి. భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర గారికి అది మెండుగా వుంది. నెలకు 6 కోట్లు చేస్తామని, సెప్టెంబరు నాటికి నెలకు 10 కోట్లు చేస్తామని కంపెనీ చెప్పుకుంటూ. కేంద్రం చేపట్టిన ఇమ్యూనైజేషన్ కార్యక్రమానికి 50 కోట్ల డోసులు కోవాగ్జిన్ యిస్తామని అన్నారావిడ. (బ్రెజిల్ కంపెనీ ప్రెసిసా మెడికామెంటోస్‌తో ఒప్పందంలో కమిషన్లు చేతులు మారాయనే వివాదం రావడంతో దాన్ని రద్దు చేసుకున్నారు కాబట్టి 2 కోట్ల డోసులు మిగిలి వుంటాయి!)
ఈ ప్రభుత్వం చాలా గారడీలు చేయగలదు. కరోనా మరణాల సంఖ్య దగ్గర్నుంచి, ఆక్సిజన్ కొరత వలన సంభవించిన చావుల గురించి, చిత్తమొచ్చిన అంకెలు చెప్పేసి, అదేమంటే రాష్ట్రాలు సరైన సమాచారం యివ్వలేదని వారి పైన నెపం నెట్టేయగలదు. (వాటిలో 19 వాళ్ల ప్రభుత్వాలే అయినా) ఇప్పుడీ వాక్సిన్‌ల కొరత గురించి నిజాలు బయటకు వచ్చాయనుకోండి, ఆ యా కంపెనీలు తమను తప్పుదోవ పట్టించాయని చెప్పేస్తుంది. ఇతర దేశాలపై గూఢచర్యం చేయగలరు, పెగాసస్ ద్వారా దేశనాయకులపై చేయగలరు, సర్జికల్ స్ట్రయిక్స్ పేర లక్ష్యానికి సరిగ్గా గురి పెట్టగలరు. అలాటిది దేశంలో పని చేసే కంపెనీ ఉత్పాదనా సామర్థ్యాన్ని తెలుసుకోలేరంటే నమ్మగలమా?
94.4 కోట్ల మందికి రెండు డోసులు చొప్పున వేయాలంటేనే 190 కోట్ల డోసులు కావాలి. వాటి సంగతే అనుమానంగా వుందంటూ యీ రెండు వ్యాసాల్లో వివరించాను. అలాటప్పుడు మా వాక్సిన్ మూడో డోసు వేసుకుంటే సమర్థవంతంగా పని చేస్తుందంటూ కంపెనీలు చెపుతూంటే మూడో డోసు ఎక్కణ్నుంచి వస్తుందాని గాభరాగా వుంటుంది కదా! వాక్సిన్ సామర్థ్యం గురించి, కొత్త వేరియంట్లపై అవి పని చేసే తీరు గురించి నేను సేకరించిన సమాచారాన్ని ‘వాక్సిన్ల సామర్థ్యం’ అనే యింకో వ్యాసంలో అందచేస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2021)