ఏడాది తిరిగే సరికి కరోనా అంతం అవుతుందనుకుంటే …మళ్లీ నాటి మార్చి నాటి భయమే పునరావృతమవుతోంది. కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది. దీనికి మన దేశం, తెలుగు రాష్ట్రాలు అతీతం కాదు.
తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేంద్ర ఆందోళనను గమనిస్తే … కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని మంత్రి ఈటల సూచించారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అంతిమంగా ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు. కొవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆయన సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరారు. మరోవైపు తెలంగాణ వైద్యశాఖ కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే పదో తరగతిలోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తే మంచిదని కేసీఆర్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది.
పిల్లల్లో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వీరిలో పాజిటివ్ ఉన్నా లక్షణాలు బయటికి కనిపించవని ప్రభుత్వ దృష్టికి సంబంధిత శాఖ అధికారులు తీసుకెళ్లారు. కానీ విద్యార్థులకు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాప్తి చెందడానికి కారణమవుతారనే ఆందోళనను వైద్యారోగ్యశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఒకట్రెండు రోజుల్లో సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కరోనా మహమ్మారి మానవ సమాజాన్ని నీడలా వెంటాడుతూ, వేటాడుతూ భయపెడుతూనే ఉంది. దీంతో గత మార్చి నాటి పరిస్థితులే మరోసారి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు మానసికంగా సిద్ధమవుతున్నారు.