కొంత మందితో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మనిషి భౌతికంగా లేకపోయినా, వారితో పెనవేసుకున్న బంధం ఆ సంబంధాలను సజీవంగా నిలుపుతుంది. ఇందుకు తాజా నిదర్శనం తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి ట్వీట్ అని చెప్పొచ్చు.
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీ పంట పండింది. 2019వ సంవత్సరానికి గాను తెలుగు సినిమా ఏకంగా నాలుగు అవార్డులు దక్కించుకుంది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు 'మహర్షి' సినిమాకు రెండు, నేచురల్ స్టార్ నాని 'జెర్సీ'కి మరో రెండు అవార్డులు వచ్చాయి.
ఇదే సందర్భంలో టాలీవుడ్ గర్వించాల్సిన మరో అవార్డు కూడా ఉంది. తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి నటించిన 'చిచోరే'కు ఉత్తమ హిందీ చిత్రం అవార్డు లభించింది. ఈ సినిమాలో దివంగత నటుడు సుశాంత్ రాజ్‌సింగ్ ముఖ్య పాత్రలో నటించాడు.
ఈ సంతోషకర క్షణాల్ని ఆస్వాదించడానికి సుశాంత్ భౌతికంగా మన మధ్య లేకపోవడంతో నవీన్ తన మిత్రుడిని తలుచుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా నవీన్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఇంతకూ నవీన్ ఏమన్నారంటే…
“ఓవైపు 'చిచోరే'కు జాతీయ అవార్డు వచ్చింది. మరోవైపు జాతిరత్నాలు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. సుశాంత్.. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. ఇది నీకే సొంతం. అలాగే చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు. లవ్ యూ యాసిడ్” అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ యాసిడ్ పాత్రలో నవీన్ నటించి హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచాడు. అందుకే టన ట్వీట్లో లవ్ యూ యాసిడ్ అని ప్రత్యేకంగా చెప్పడం.