ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో టిక్కెట్ రేట్లు పెంపు వ్యవహారం కొలిక్కి వచ్చేలా లేదు. మరోవైపు నైజాంలో థియేటర్లు మూసేసి ఎక్కువ రోజులు ఉంచలేని పరిస్థితి. దీంతో టాలీవుడ్ ప్రయోగానికి సిద్ధపడింది. నైజాంలో పూర్తిస్థాయిలో, ఆంధ్ర-సీడెడ్ లో పరిమిత సంఖ్యలో ఈ శుక్రవారం నుంచి సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 5 సినిమాలు థియేటర్లలోకొస్తున్నాయి.
తమ సినిమా హిట్టయి లాభాలు రావాలనేది నిర్మాతల ఆశ. సినిమా క్లిక్ అయి హీరోగా నిలదొక్కుకోవాలనేది ఈ మూవీస్ లో నటించిన నటుల ఆశ. ఈ సినిమాలు ఆంధ్రాలో ఎలా ఆడతాయో చూడాలనే ఆత్రుత టాలీవుడ్ ది. అందుకే తిమ్మరుసు, ఇష్క్ లాంటి ఓ మోస్తరు బజ్ ఉన్న సినిమాలతో పాటు నరసింహపురం అనే ఓ చిన్న సినిమాకు కూడా కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు గట్టిగా ప్రమోషన్ చేశారు.
తిమ్మరుసు, ఇష్క్, నరసింహపురం సినిమాలతో పాటు పరిగెత్తు-పరిగెత్తు, త్రయం అనే మరో 2 సినిమాలు కూడా 30న థియేటర్లలోకి వస్తున్నాయి. ఇవేవో వండర్స్ క్రియేట్ చేస్తాయనే ఆశ టాలీవుడ్ కు లేదు. నిజానికి ఆ మేకర్స్ కు కూడా అలాంటి భ్రమల్లేవు. సినిమాకు జనం వస్తే అదే పదివేలు అనుకుంటున్నారంతా.
ఈ సినిమా ఫలితాల సంగతి పక్కనపెడితే.. ఇకపై ఈ మోడల్ లో (నైజాంలో పూర్తిస్థాయిలో, ఆంధ్ర-సీడెడ్ లో పాక్షికంగా) సినిమాలు రిలీజ్ చేస్తే రిస్క్ అవుతుందా..? లాభం తగ్గుతుందా లేక నష్టం వస్తుందా..? ఎగ్జిబిటర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు వినిపిస్తాయి? డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లో భారీ మార్పుచేర్పులు ఏమైనా జరుగుతాయా? అసలు ఈ సినిమాలతో టోటల్ ట్రేడ్ లేదా టాలీవుడ్ మార్కెట్ ను అంచనా వేయడం సాధ్యమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నల్లో కొన్నింటికైనా సమాధానం దొరికే అవకాశం ఉంది.
ఇష్క్, తిమ్మరుసు సినిమాలు ఆంధ్రలోని విశాఖ, విజయవాడ, రాజమండ్రి లాంటి ప్రైమ్ లొకేషన్లలో విడుదలవుతున్నాయి. అటు సీడెడ్ లో కూడా ఈ రెండు సినిమాలకు తిరుపతి, అనంతపురం, కడప లాంటి మంచి లొకేషన్లు కలిసొచ్చాయి. ఇక నరసింహపురం అనే సినిమాకు కూడా అనకాపల్లి లాంటి బి-సెంటర్లలో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు ముందుకొచ్చారు.
దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వాళ్లు పైకి టిక్కెట్ రేట్ల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీలోని తమ థియేటర్లను ఈ శుక్రవారం నుంచి తెరుస్తున్నారు. ఎందుకంటే, బిజినెస్ ఎలా ఉండబోతోంది? అసలు ప్రేక్షకులు వస్తారా రారా అనే అనుమానాల్ని వాళ్లు కూడా నివృత్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న సినిమాలపై ప్రయోగాలు చేస్తేనే.. రాబోయే రోజుల్లో వాళ్ల పెద్ద సినిమాలకు మార్గం సుగమం అవుతుంది మరి.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో ఈక్వేషన్లు, మరెన్నో క్యాలిక్యులేషన్లు, ఇంకెన్నో లాబీయింగ్ లు, కంటికి కనిపించని వ్యాపార సర్దుబాట్లు. ఇలా మనుగడ కోసం పోరాటం అనే టైపులో పెద్ద ప్రయోగానికే సిద్ధమైంది టాలీవుడ్. అటు కరోనా భయాల్ని, ఇటు టిక్కెట్ రేట్ల వ్యవహారాన్ని దాటి సినిమాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటోంది.