అధికారులకు కూడా హనీమూన్ ముగిసింది

సీఎం జగన్ ఇన్నాళ్లూ ఏ మంత్రినీ పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది లేదు, ఏ అధికారినీ పల్లెత్తు మాట అన్నదీ లేదు. అయితే ఆయన చాలా జాగ్రత్తగా వారి పనితీరు మదింపు చేస్తున్నారనే విషయం…

సీఎం జగన్ ఇన్నాళ్లూ ఏ మంత్రినీ పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది లేదు, ఏ అధికారినీ పల్లెత్తు మాట అన్నదీ లేదు. అయితే ఆయన చాలా జాగ్రత్తగా వారి పనితీరు మదింపు చేస్తున్నారనే విషయం మాత్రం వాస్తవం. 

తాజాగా గ్రామ వార్డు సచివాలయాల తనిఖీలకు వెళ్లని అధికారుల్ని జగన్ హెచ్చరించిన పద్ధతి చూస్తే ఆయన సచివాలయాలపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుంది. అదే సమయంలో అధికారుల పనితీరుని ఏ స్థాయిలో బేరీజు వేస్తున్నారో కూడా తెలుస్తుంది.

రాష్ట్రంలో 1098 చోట్ల సచివాలయాలు తనిఖీ చేయాలని అధికారులకు టార్గెట్ పెట్టారు సీఎం. అయితే అందులో 733 చోట్లకు మాత్రమే ఉన్నతాధికారులు వెళ్లారు. మిగతా చోట్ల తనిఖీలు చేపట్టలేదు. దీనికి రకరకాల కారణాలుండొచ్చు. 50శాతం కంటే పని ఎక్కువగా జరిగింది కాబట్టి, మెరుగు పరుచుకోండి అని చెప్పి వదిలేయొచ్చు. 

కానీ జగన్ ఏకంగా అధికారులకు మెమోలు సిద్ధం చేశారు. సచివాలయాలను తనిఖీ చేయని అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఇవి మీ పనితీరుకి ఇస్తున్న మెమోలు కాదు, నాకు నేనే ఇచ్చుకుంటున్నాను అంటూ సుతిమెత్తగా చీవాట్లు పెట్టారు.

జగన్ లో రెండో కోణం..

పనితీరు మెరుగుపరుచుకోని మంత్రులకు ఇప్పుడు పదవీగండం పొంచి ఉంది. మంత్రుల పదవీకాలం రెండేళ్లు పూర్తి కాగానే రివ్యూ చేసి మంత్రి మండలిని పునర్ వ్యవస్థీకరణ చేస్తామన్న జగన్, అధికారుల విషయంలో కూడా ఆ హనీమూన్ పీరియడ్ ముగిసిపోయినట్టేనని సంకేతాలిచ్చారు. ఇకపై పనితీరు మదింపు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు.

జగన్ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రెండేళ్లలో ప్రజా సంక్షేమ పథకాలు ఓ రేంజ్ లో మొదలయ్యాయి, అంతే విజయవంతంగా కొనసాగుతున్నాయి. అటు అభివృద్ధి పనులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. మరి వీటిపై ప్రజలేమనుకుంటున్నారు? ఇంకా ఏమైనా కోరుకుంటున్నారా? ఇలాగే ఉంటే చాలనుకుంటున్నారా? అనే దానిపై ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ కావాలి. దానికి అధికారుల సాయం తప్పనిసరి. 

ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంది, మరింత మెరుగ్గా ఎలా పనిచేయాలనేది గ్రామాలకు వెళ్లినప్పుడే తెలుస్తుంది. గ్రామ సచివాలయంలో కూర్చుని సమస్యలపై చర్చించి, సిబ్బందిపై దృష్టిపెడితేనే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని ఉపేక్షిస్తే చంద్రబాబుకి పట్టినగతే పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే జగన్ ఈ పని మొదలు పెట్టారు.

సచివాలయాల తనిఖీ అంటే, జగన్ ప్రభుత్వ పనితీరుని సమీక్షించుకోవడమే. ఇప్పట్నుంచి అది సమర్థంగా జరిగితేనే, ప్రభుత్వ పాలన మరింత సమర్థంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలు జగన్ కి రెండోసారి అవకాశమిస్తారు.