ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న విషయం ఇది. మాన్సాస్ ట్రస్ట్ చుట్టూనే రాజకీయం మొత్తం తిరుగుతోంది. దాంతో పాటే భూముల దందాల మీద కూడా ప్రచారం అయితే సాగుతోంది.
ఓ వైపు సింహాచలం దేవస్థానానికి చెందిన 746 ఎకరాలా భూమి రికార్డులలో లేకుండా అన్యాక్రాంతమైంది. దీని విలువ పది వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇంకో వైపు మాన్సాస్ ట్రస్ట్ కి చెందిన భూములు 150 ఎకరాల దాకా చేజారింది అని గుర్తించారు.
ఇపుడు తూర్పుగోదావరి జిల్లాలో కూడా మాన్సాస్ భూములలో పెద్ద ఎత్తున ఇసుక దందా చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల మీద ప్రాధమిక విచారణ చేసిన దేవాదాయ శాఖ కీలకమైన నివేదిక ఇచ్చింది. దాంతో ఇపుడు మరింత సమాచారం రాబట్టడం కోసం ఏకంగా సీఐడీ విచారణకు ప్రభుత్వం రెడీ అవుతోంది అంటున్నారు.
మాన్సాస్ భూములు చేతులు మారడం వెనక ఎవరు ఉన్నారు. అలాగే ఇసుక దందాలు చేసిన వారికి సహకరించిన వారు ఎవరు వంటి వాటి మీద పూర్తి దర్యాప్తు కోసం సీఐడీని రంగంలోకి దించుతారని చెబుతున్నారు.
సీఐడీ లోతైన విచారణ జరిపిన తరువాత బాధ్యులను గుర్తించి కేసులను నమోదు క్రిమినల్ చేయడమే కాదు, అవసరమైన పక్షంలో అరెస్టులు కూడా చేస్తారు అంటున్నారు. మొత్తానికి తీగ దొరికింది. ఇక డొంక కదులుతుంది అంటున్నారు. అంటే రాబోయే రోజులలో ఎన్నో సంచలనాలు నమోదు కావాల్సిందే అన్న మాటే మరి.