8 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు మలయాళ నటి మెతిల్ దేవిక వెల్లడించారు. మలయాళ పాపులర్ జంట ముఖేశ్, మెతిల్ దేవిక విడాకులు తీసుకుంటున్నారనే వార్త చిత్ర పరిశ్రమలో హాట్ టాఫిక్‌గా మారింది. తమ విడాకుల విషయమై డ్యాన్సర్ దేవిక స్వయంగా ప్రకటించడం విశేషం.
కేరళలో నటుడు, నాయకుడైన ముఖేశ్‌కు డ్యాన్సర్ మెతిల్ దేవికతో రెండో వివాహం. గతంలో నటి సరితతో ఆయనకు పెళ్లైంది. ముఖేశ్ తాగుబోతు, పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలున్న తిరుగుబోతు అని 2011లో భర్తకు సరిత విడాకులు ఇచ్చింది.
అనంతరం 2013లో ముఖేశ్ డ్యాన్సర్ దేవికను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉందని అందరూ అనుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంతో విడాకుల విషయం బయటికి రావడం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. తమ విడాకుల విషయమై దేవిక లోకానికి చెప్పడం విశేషం.
మీడియాతో ఆమె మాట్లాడుతూ …విడాకులు తీసుకోడానికి దారి తీసిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసినట్టు ఆమె తెలిపారు. ముఖేశ్ అభిప్రాయమేంటో తనకు తెలియదనడం గమనార్హం. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయవద్దని ఆమె వేడుకున్నారు.
ముఖేశ్ మంచి వాడే కానీ, మంచి భర్త కాలేకపోయాడన్నారు. తమ 8 ఏళ్ల వివాహ బంధంలో ఆయన్ని ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోతున్నట్టు దేవిక చెప్పారు. అందువల్లే ముఖేశ్‌తో తెగదెంపులు చేసుకోడానికి సిద్ధమైనట్టు ఆమె తేల్చి చెప్పారు.
ముఖేశ్ పరువు తీయాలని తాను అనుకోవడం లేదని దేవిక చెప్పారు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం తనకు ఎంత మాత్రం లేదని తేల్చి చెప్పారు. ఆవేశంలో, కోపంతో అతడితో విడిపోవడం లేదని ఆమె ముక్తాయింపు ఇచ్చారు.