కరోనా సంక్షోభంలో చైనా, డబ్ల్యూహెచ్వోల పాత్రపై ఉన్న అనుమానాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి చైనానే ఈ వైరస్ ను సృష్టించిందనే అభిప్రాయాలు చాలా గట్టిగా ఉన్నాయి చాలా దేశాల్లో. చైనా ఈ ప్రమాదకరమైన వైరస్ ను సృష్టించిందని, అది పొరపాటునో గ్రహపాటునో బయటపడిందనే అభిప్రాయాలు కొందరికి అయితే, తనతో పోటీ పడుతున్న దేశాలను దెబ్బతీయాలనే అక్కసుతో చైనా ఈ వైరస్ ను వదిలిందనే అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే ఆ వాదనలను చైనా కొట్టేస్తోంది. కానీ చైనా ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మేలా లేరు అనేది వాస్తవం!
చైనా మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాయి పాశ్చాత్య దేశాలు. అమెరికా, యూరోపియన్ దేశాలు చైనా మీద పడి రక్కేయాలనేంత కోపంగా ఉన్నాయి. కరోనాతో తీవ్రం ఇక్కట్ల పాలవుతున్న దేశాల్లో అమెరికా, యూరప్ దేశాలు కొన్ని ముందు వరసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా పై ఆగ్రహంతో ఉన్నాయి ఆ దేశాలు. ఈ క్రమంలో ఈ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నేపథ్యంలో.. కరోనా పుట్టుపూర్వోత్తరాలపై స్వతంత్ర విచారణ ప్రతిపాదన ఒకటి వస్తోంది.
డైరెక్టుగా చైనాను నిందించేయడం కాకుండా, అలాగని చైనా చెప్పే కాకమ్మ కబుర్లనూ నమ్మకుండా..అసలేం జరిగింది? అనే అంశంపై ఈ స్వతంత్ర విచారణ జరగాల్సి ఉంది. దీనికి అనేక దేశాలు మద్దతును ప్రకటించాయి. చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అమెరికా, యూరోపియన్ దేశాలతో సహా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలతో కలిసి.. ఇండియా కూడా ఈ స్వతంత్ర విచారణకు మద్దతు పలికినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అంతే కాదు.. ఈ రచ్చలో డబ్ల్యూహెచ్ వో పాత్ర ను గురించి కూడా ఈ స్వతంత్ర విచారణ కమిటీ తేల్చనుందని సమాచారం. చైనా మద్దతుతో డబ్ల్యూహెచ్ఓ పీఠం ఎక్కిన వ్యక్తి వల్ల ప్రపంచానికి ఇంత ప్రమాదం ముంచుకొచ్చిందని, చైనా చెప్పినట్టుగా చేసి అతడు ప్రపంచాన్ని ముప్పు బారిన నిలబెట్టాడనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా విపత్తు చైనాలో తలెత్తిన సమయంలో డబ్ల్యూహెచ్వో ఏం చేసింది? ఎందుకు మొదట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది? అనే అంశాలను కూడా విచారించనున్నట్టుగా తెలుస్తోంది.
యూరప్ దేశాలు కొన్ని, అమెరికా కరోనా వల్ల తీవ్రంగా ఇక్కట్ల పాలయ్యాయి. ఈ నేపథ్యంలో.. కరోనా వెనుక కథ ఏమిటనేది తేల్చేవరకూ అవి నిద్రపోయేలా లేవు. కాబట్టి.. చైనా కుట్రలు ఏవైనా ఉన్నా, డబ్ల్యూహెచ్వో దుష్ట పాత్ర ఏమైనా ఉన్నా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.