ఆ రహస్యం ఎప్పటికైనా తెలుస్తుందా ?

ఏ రహస్యం తెలియాలి ? గండికోట రహస్యమా ? రాజపుత్ర రహస్యమా ? ఇవి సినిమా రహస్యాలు. సినిమాలు చూసినవారికి తెలుస్తాయి. చూడనివారికి తెలియవు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా తెలియాల్సిన రహస్యం ఒకటుంది. అదే…

ఏ రహస్యం తెలియాలి ? గండికోట రహస్యమా ? రాజపుత్ర రహస్యమా ? ఇవి సినిమా రహస్యాలు. సినిమాలు చూసినవారికి తెలుస్తాయి. చూడనివారికి తెలియవు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా తెలియాల్సిన రహస్యం ఒకటుంది. అదే కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం. ఆ రహస్యం తెలుసుకోవాలనే ప్రపంచ దేశాలన్నీ ఆరాటపడుతున్నాయి. కరోనా ఎక్కడ పుట్టిందో తెలుసు. కానీ ఎలా పుట్టిందో తెలియదు. చిన్న పిలవాడిని అడిగినా చైనాలో పుట్టిందని చెబుతాడు. కానీ ఎలా పుట్టిందో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద కరోనా మహమ్మారిని చైనా ప్రపంచం మీదికి వదిలిందనేది ప్రపంచ దేశాల ఏకాభిప్రాయం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే చైనా మీద ఉగ్రుడైపోతున్నాడు. చండప్రచండంగా మండిపోతున్నాడు. చైనా నుంచి భారీగా పరిహారం రాబడతానంటున్నాడు.

ఈ విషయంలో కొన్ని దేశాలు అమెరికాకు వత్తాసు పలకడమే కాకుండా తాము కూడా నష్ట పరిహారం కోసం డిమాండ్ చేస్తామంటున్నాయి. కరోనా వెలుగు చూడగానే అది చైనాలోని వూహాన్ మాంసం మార్కెట్లో పుట్టిందని జోరుగా ప్రచారం  సాగింది. చైనా వాళ్ళు సమస్త జంతువుల మాంసాన్ని తింటారు కాబట్టి కరోనా గబ్బిలాల ద్వారా పుట్టిందన్నారు. దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఇదే అభిప్రాయంతో చాలాకాలం ఉన్నాయి. చైనీయుల తిండి అలవాట్లను జనం అసహ్యించుకున్నారు. కరోనా చైనాలోనే పుట్టిందని అమెరికా ఆరోపిస్తే, కాదు అమెరికా సైనికుల ద్వారా వ్యాపించింది అని  చైనా ఆరోపించింది.

కరోనా గబ్బిలాల నుంచి పుట్టింది అనే  అభిప్రాయం మారిపోయి వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్లో ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారనే ప్రచారం జరిగింది. ట్రంప్ పదే పదే ఈ ఆరోపణ చేశారు. కరోనాను ల్యాబ్లో పుట్టించారనే అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయానికి ఆయన స్టికాన్ అయ్యారు. ట్రంప్ ఆరోపణలను చైనా గట్టిగా ఖండించింది. వైరస్ సహజంగానే పుట్టిందని. ల్యాబులో తయారుచేయలేదని చెప్పింది. కరోనా వైరస్ ఎలా పుట్టింది అనే విషయంలో అమెరికా, దాని మిత్ర దేశాలు ఒక విధంగా వాదిస్తుండగా చైనాకు మద్దతు ఇస్తున్న దేశాలు  మరో విధంగా వాదిస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా కొమ్ముకాస్తోందని ఆరోపించిన డోనాల్డ్ ట్రంప్ దానికి నిధులు ఆపేశాడు. అయినప్పటికీ కరోనా వైరస్  ల్యాబ్ లో తయారు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నమ్మలేదు. ఇక కరోనా చైనాలోని వూహాన్ మాంసం మార్కెట్లో పుట్టలేదని బ్రిటన్ లోని ప్రముఖ పత్రిక డైలీ మెయిల్ కథనం ప్రచురించింది. కరోనా సోకిన వ్యక్తి మాంసం మార్కెట్ కు వస్తే అతని ద్వారా వ్యాపించిందనీ కొందరు జీవ శాత్రవేత్తలు చెప్పినట్లు డైలీ మెయిల్ కథనం తెలిపింది. అయితే ఇది కూడా నిర్ధారణగా చెప్పలేదు. ఆ వ్యక్తి ద్వారా సోకి ఉంటుందని అంచనా మాత్రమే. ఇప్పుడు తేలింది ఏమిటంటే కరోనా వైరస్ వూహాన్ లో పుట్టింది వాస్తవమేగాని ఎలా పుట్టిందో తెలియదు.

కొన్ని రోజుల కిందట చైనా ప్రభుత్వం కరోనా వైరస్ తమ దేశంలోనే పుట్టలేదని, ఎక్కడ పుట్టిందో తెలియదని చెప్పింది. చైనా ఈ విషయం చెప్పాక అమెరికా, దాని మిత్ర దేశాల్లో కరోనా ఎలా పుట్టిందో తెలుసుకోవాలనే పంతం పెరిగింది. అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాకు వ్యాక్సిన్ ఇప్పటిలో కనుగొనలేకపోవచ్చని చెప్పింది. కరోనాతో కలిసి బతకాల్సిందేనని, దాంతో సహజీవనం చేయాల్సిందేనని చెప్పింది. ఈ నేపథ్యంలో కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని పలు దేశాలు  ప్రపంచ ఆరోగ్య సంస్థను డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం 62 దేశాలు తమ డిమాండ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు పెట్టాయి.

కరోనాపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలనే డిమాండుకు భారత్ కూడా మద్దతు ఇచ్చింది. కరోనా వైరస్ ఎలా పుట్టిందనేదానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. గబ్బిలాల నుంచి పుట్టింది అనే వాదనకు కూడా ఆధారాలు లభించలేదు. ఇప్పటివరకు చైనాకు మద్దతు పలికిందని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ  స్వతంత్ర దర్యాప్తు ఏ విధంగా చేస్తుందో చూడాలి. ఈ సంస్థ కరోనా జన్మ రహస్యాన్ని ఛేదిస్తుందా ? 

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం