దక్షిణాఫ్రికా జనాభా ఏడు కోట్లు. కొంతవరకూ అభివృద్ధి చెందిన దేశం. కరోనా విపత్తు నేపథ్యంలో అక్కడ కూడా లాక్ డౌన్ ను ప్రకటించారు. అయితే లాక్ డౌన్ ను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ప్రజలకు కొంత గడువు సమయాన్ని ఇచ్చారు. మొత్తం 72 గంటల పాటు సమయాన్ని ఇచ్చి, ఎక్కడకు వెళ్లాలనుకున్న వారు అక్కడకు వెళ్లాలని.. ఆ తర్వాత ఊర్లు దాటడానికి అవకాశం ఉండదని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రకటించిన గడువు తర్వాత లాక్ డౌన్ ను అమల్లో పెట్టింది.
ఒక ప్రజాస్వామ్య దేశంలో లాక్ డౌన్ అమలు గురించి చిన్న ఉదాహరణ అది. అయితే ఇండియాలోనూ లాక్ డౌన్ ప్రకటించారు. ఉరుము లేని పిడుగులా మోడీ వచ్చారు.. జనతా కర్ఫ్యూ అన్నారు. కరోనా పని అయిపోయిందని భక్తులు ప్రకటించేశారు. ఆ మరుసటి రోజు నుంచి లాక్ డౌన్! మొదట్లో అర్థం కాలేదు.. నెమ్మనెమ్మదిగా అర్థం అయ్యింది. కరోనా గో బ్యాక్ అంటూ.. రోడ్లకు ఎక్కిన మోడీ భక్తుల నినాదాలు ఆ వైరస్ కు వినపడినట్టుగా లేవు. లాక్ డౌన్ ను పొడిగిస్తూనే ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో వలస కూలీల గురించి కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ, వారి పరిస్థితి గురించి కేంద్రం ఆలోచించిన తీరు గురించి ఎంత తక్కువ చెబితే మోడీ భక్తుల ఆరోగ్యానికి అంతమంచిది. లాక్ డౌన్ ప్రకటించి రెండో నెల గడిచిపోతోంది.. ఇప్పటికీ వలస కూలీల కష్టాలు తీరలేదు. వారి పరిస్థితి ఏమిటి? అని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగారిని అడిగితే, వారి గురించి ఆలోచించే వాళ్లు వెళ్లి బ్యాగులు మోసి సహకరించాలని తనకు తెలిసిన వ్యంగ్యాన్ని శ్రీమాన్ మంత్రిగారు వ్యక్తీకరించారు!
'ఏనాడైనా ప్రజల నుంచి నెగ్గిన వారిని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా చేస్తే వాళ్లకు పేదల కష్టాలు, కడగండ్ల గురించి కాస్త అయినా అవగాహన ఉండొచ్చు. ప్రజల నుంచి గెలిచే ప్రయత్నమే చేయని నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళను ఆర్థిక మంత్రులుగా చేస్తే ఇలాంటి మాటలు తప్ప మరేం వస్తాయి?' అని సామాన్యులు చర్చించుకుంటున్నారు.
బీజేపీ వాళ్లకు ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఈ తరహా వ్యాఖ్యానాలు చేశారు. వాజ్ పేయి కాలంలోనే రైతుల ఆత్మహత్యల గురించి ఒక కేంద్రమంత్రి స్పందన కోరగా, ఒళ్లు కొవ్వెక్కి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం చేతిలో ఉందనే అహంభావంతో అలాంటి మాటలు మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచినే ఏ ప్రభుత్వానికి అయినా కౌంట్ డౌన్ మొదలవుతున్నట్టు!