కేర‌ళ‌లో క‌రోనా మూడో వేవ్..?

క‌రోనా మ‌ర‌ణాల రేటు అతి త‌క్కువ‌గా న‌మోదు అయ్యింద‌ని, తొలి రెండు వేవ్ ల స‌మ‌యంలో కితాబులు అందుకున్న కేర‌ళ, ఈ సారి క‌రోనా హాట్ స్పాట్ గా మారుతున్న‌ట్టుగా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో…

క‌రోనా మ‌ర‌ణాల రేటు అతి త‌క్కువ‌గా న‌మోదు అయ్యింద‌ని, తొలి రెండు వేవ్ ల స‌మ‌యంలో కితాబులు అందుకున్న కేర‌ళ, ఈ సారి క‌రోనా హాట్ స్పాట్ గా మారుతున్న‌ట్టుగా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది కేర‌ళ‌. గ‌త కొన్నాళ్లుగా అక్క‌డ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతూ ఉంది.

గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల‌కు సంబంధించిన డాటా ప్ర‌కారం.. కేర‌ళ‌లో ఏకంగా 22 వేల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశం మొత్తం మీదా దాదాపు 43 వేల కేసులు న‌మోదు కాగా.. అందులో ఏకంగా 50 శాతానికి మించిన వాటా కేర‌ళ‌దే కావ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు వంటి మ‌ధ్య స్థాయి కేసులు న‌మోదైన రాష్ట్రాల్లో కూడా ఈ వారంలో కేసుల సంఖ్య మ‌రింత త‌గ్గుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు 1500 స్థాయిలో రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే గ‌త కొన్నాళ్లుగా కేసుల సంఖ్య‌ను పెరుగుతున్న కేర‌ళ‌లో మూడో వేవ్ దాదాపు వ‌చ్చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. దేశంలో సెకెండ్ వేవ్ కూడా ఇలా ఒక రాష్ట్రం నుంచినే ప్ర‌బ‌లింది. అప్పుడు మ‌హారాష్ట్ర‌లో కేసుల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగింది. ఈ ఏడాది మార్చి నెల‌లోనే మ‌హారాష్ట్ర‌లో ప‌ది వేలు, ఇర‌వై వేల స్థాయిలో కేసులు న‌మోద‌వుతూ వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత క్ర‌మంగా దేశ‌మంతా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఆ సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టిందిప్పుడు. కేర‌ళ‌లో కూడా అలానే కేసుల సంఖ్య త‌గ్గింది. కానీ పెద్ద‌గా స‌మ‌యం లేకుండానే, ఇప్పుడు అక్క‌డ రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా 20 వేల‌ను దాటేయ‌డంతో.. ఇక నుంచి ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారుతోందిజ.

కేర‌ళ‌లో ఇలానే కేసుల సంఖ్య పెరుగుతూ పోతే.. మూడో వేవ్ దాదాపు ప్రారంభం అయిన‌ట్టేనా, అది ప్రారంభం అయితే మూడో వేవ్ ఒట్టి కేర‌ళ‌తోనే ఆగుతుందా? ఇత‌ర రాష్ట్రాల‌కు ఈ వేవ్ పాకుతుందా?  లేక వైర‌స్ కొత్త వేరియెంట్ ఏదైనా ఇలా మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతోందా? అనేవి ప్ర‌స్తుతానికి స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు.

అయితే ఇప్పుడు కేర‌ళ లో కేసులు పెర‌గ‌డం విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యపూరిత ధోర‌ణి కూడా ఒక కార‌ణంగా నిలుస్తోంది. బ‌క్రీద్ అంటూ అక్క‌డ ఫుల్ రిలాక్సేష‌న్ ఇచ్చింది ప్ర‌భుత్వం. ఆ సంబ‌రాల ప్ర‌భావ‌మే ఇప్పుడు కేర‌ళ‌లో కేసుల సంఖ్య పెరిగేందుకు కార‌ణ‌మా? అనేది కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఏతావాతా కేర‌ళ‌లో భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతూ ఉండ‌టం మాత్రం.. దేశానికే ఆందోళ‌న‌క‌ర‌మైన అంశం.