ప్రభాస్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. లెక్కప్రకారం మరో 2 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ సెకెండ్ వేవ్ కారణంగా, షూటింగ్ ఆలస్యమై ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?
ఒరిజినల్ గా రాధేశ్యామ్ సినిమాను ఎప్పుడైతే రిలీజ్ చేయాలనుకున్నారో, అదే తేదీకి (అంటే జులై 30కి) ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించాలని అనుకుంటున్నారు మేకర్స్. అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి రీసెంట్ గా కొంత షూటింగ్ జరిగినప్పటికీ ఇంకో పాట పెండింగ్ లో ఉంది. వచ్చేనెల ఆ షూట్ పెట్టుకున్నారు. మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. ఈ రెండు అంశాలపై 2 రోజుల్లో క్లారిటీ వస్తే.. ఎల్లుండికి రాధేశ్యామ్ రిలీజ్ డేట్ పై స్పష్టత వస్తుంది. లేదంటే ప్రకటన ఉండదు.
రాధేశ్యామ్ విడుదల తేదీపై స్పష్టత వస్తే, ఆ వెంటనే ఆచార్య, అఖండ సినిమాల రిలీజ్ డేట్స్ పై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ 3 సినిమాలు దాదాపు ఒకే టైమ్ లో షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.