ఏపీ అప్పుల కుప్ప.. తప్పెవరిది?

ఏపీకి లెక్కలేనన్ని అప్పులు తెస్తున్నారనేది ప్రతిపక్షాల రాద్ధాంతం. అప్పుల కుప్పగా ఏపీని మార్చేశారని, అసలు బయటెక్కడా అప్పులు పుట్టకుండా చేస్తున్నారని అంటున్నారు టీడీపీ, బీజేపీ నేతలు. ఈరోజు ఓ ప్రముఖ దినపత్రిక కూడా ఇదే…

ఏపీకి లెక్కలేనన్ని అప్పులు తెస్తున్నారనేది ప్రతిపక్షాల రాద్ధాంతం. అప్పుల కుప్పగా ఏపీని మార్చేశారని, అసలు బయటెక్కడా అప్పులు పుట్టకుండా చేస్తున్నారని అంటున్నారు టీడీపీ, బీజేపీ నేతలు. ఈరోజు ఓ ప్రముఖ దినపత్రిక కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ బ్యానర్ స్టోరీ ఇచ్చింది. ఏపీ ఆర్థికంగా మునిగిపోతోందని, అప్పులు విపరీతంగా చేస్తున్నారని లెక్కలతో సహా కథనాన్ని ప్రచురించింది.

అయితే మంత్రులు మాత్రం అప్పు తెచ్చిన సొమ్మంతా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామంటూ వివరణ ఇచ్చుకుంటున్నారు. ఓవైపు ప్రతిపక్షాల రాద్ధాంతం, మరోవైపు మీడియా రాతలు. ఈ దశలో అసలు సగటు ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు. జగన్ చేస్తున్న అప్పుల లెక్కలపై ప్రజల అభిప్రాయం ఏంటనేది ఆసక్తిగా మారింది.

అప్పులు లేని రాష్ట్రమేది..?

దేశంలో అన్ని రాష్ట్రాలు లోటు బడ్జెట్ తోనే కాలం గడుపుతున్నాయి. విభజన తర్వాత రిచ్ స్టేట్ గా మారిన తెలంగాణ కూడా ఆ తర్వాత వివిధ అవసరాల కోసం అప్పులు చేయీల్సి వచ్చింది. కరోనా కష్టకాలంలో రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అంతెందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర  ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్లు సెలవు ప్రకటించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇక ఏపీ విషయానికొద్దాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పోలవరానికి సకాలంలో కేంద్రం నిధులివ్వకపోయినా, రాష్ట్రం సర్దుకొస్తోంది. అన్నదాతలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, దర్జీలు, మత్స్యకారులు.. ఇలా ఒకరేంటి.. అన్ని వర్గాలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో ఏ

రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వమూ చేయనంత ఖర్చు సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయిస్తోంది. కరోనాతో రాష్ట్రఆదాయంలో కోతపడిన సమయంలో ఈ సొమ్మంతా ఎక్కడినుంచి రావాలి. అప్పులే దిక్కయ్యాయి, అందుకే చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరుస్తున్నారు.

యజమాని అప్పు చేసి కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చినట్టే, రాష్ట్ర యజమానిగా ముఖ్యమంత్రి అప్పుచేసి మరీ సంక్షేమ పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో జగన్ పై ఇదే అభిప్రాయం ఉంది. పింఛన్లు ఆగలేదు, రైతు భరోసా ఆగలేదు, స్కూళ్లు లేకపోయినా అమ్మఒడి ఆగలేదు.. ఇంత సహాయం చేస్తున్న జగన్ ని తామెందుకు వ్యతిరేకించాలని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

బాబు హయాంలో అప్పులు చేయలేదా..?

అప్పుల కుప్ప అంటూ ఏపీని నిందిస్తున్న చంద్రబాబు తన హయాంలో ఏం చేశారు. అప్పుడు చేసిన అప్పులన్నీ దేనికోసం ఖర్చు చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్, విదేశీ టూర్లు, ప్రచార ఆర్భాటాల కోసం ఎంతెంత దుబారా చేశారు. అలాంటివన్నీ జగన్ జమానాలో కనుమరుగయ్యాయి. 

తెచ్చిన ప్రతి రూపాయీ తిరిగి ప్రజల వద్దకే వెళ్తోంది. ఇప్పుడు చెప్పండి అప్పులు చేసినా, జగన్ ప్రజలకు మేలు చేస్తున్నారా..? కీడు చేస్తున్నారా..?

కొన్ని వర్గాల్లో మాత్రం అసంతృప్తి..

అయితే నాణానికి రెండు ముఖాలు ఉన్నట్టే… ఏపీ అప్పుల వ్యవహారంలో కూడా సమర్థించేవాళ్లతో పాటు వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా మేధావులు, చదువుకున్న వాళ్లు, ఆర్థిక నిపుణులు.. ఏపీ అప్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిపోతున్న అప్పులు భవిష్యత్ తరాలకు ఇబ్బందికరంగా మారుతుందని.. రాష్ట్రంలో మధ్యతరగతి వర్గం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని విశ్లేషిస్తున్నారు. 

ఈ వాదనలో కూడా నిజం ఉంది. అప్పులు పెరిగితే ఆ భారం పడేది ప్రజలపైనే. పన్నులు పెరుగుతాయి, మరోవైపు రాష్ట్ర ఆస్తులు తరిగిపోతాయి. కాబట్టి ఈ కోణంలో జగన్ నిర్ణయాల్ని సమర్థించలేం. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులకు, ఈ అప్పులు యాడ్ అవుతున్నాయి తప్ప కొత్తగా జగన్ ఈ విషయంలో చేసిన తప్పేం లేదు. రాబోయే రోజుల్లోనైనా ప్రభుత్వం అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది.