రానాకు మల్టీస్టారర్లు కొత్త కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది నటులతో కలిసి పనిచేశాడు. కానీ పవన్ కల్యాణ్ తో వర్క్ చేయడం మాత్రం ఫస్ట్ టైమ్. ఇదే విషయంపై రానా స్పందించాడు. పవన్ కల్యాణ్ ను దగ్గరుండి గమనించిన ఈ నటుడు.. పాత్రను పవన్ అర్థం చేసుకునే విధానం అద్భుతం అంటున్నాడు.
“పవన్ కల్యాణ్ కున్న అనుభవం చూసి ఆశ్చర్యమేసింది. సినిమాపై ఆయనకున్న జ్ఞానం, అనుభవం అపారం. సినిమాను ఆయన ఓ కొత్త కోణంలో చూస్తారు. పాత్రను అర్థం చేసుకునే విధానం, తొందరగా పాత్ర స్వభావాన్ని పట్టుకోవడం పవన్ కల్యాణ్ లో గొప్ప లక్షణం.”
సినిమాపై ఎంతో అనుభవం కలిగిన నటులతో వర్క్ చేయడం వల్ల ఎన్నో లాభాలుంటాయని, మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ తో పని చేస్తున్నప్పుడు ప్రతి రోజూ ఓ కొత్త విషయం నేర్చుకుంటున్నానని అన్నాడు రానా. ఇక అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ పై కూడా స్పందించాడు.
“ఈ సినిమాలో నా పాత్రలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పటివరకు నేను పోషించని రోల్ ఇది. ప్రస్తుతానికి ఇంతకుమించి ఎక్కువగా నా క్యారెక్టర్ గురించి చెప్పలేను.”
సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.