చాలా మంది హీరోయిన్ల కెరీర్ కు, వారి ఆస్తులకూ భర్తలే పెద్ద గండాలుగా మారుతూ ఉంటారు. నటి శిల్పా షెట్టి కి కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందే తలెత్తింది. ఇక్కడ శిల్పకు భర్త డైరెక్టుగా ఆర్థిక నష్టాన్ని తెచ్చి పెట్టలేదు కానీ, మరో రకంగా ఆమె ఇమేజ్ నే దెబ్బ తీశాడు. పోర్న్ ఫిల్మ్ రాకెట్ సూత్రధారిగా అరెస్టైన రాజ్ కుంద్రా వల్ల ఆయన భార్య శిల్ప కెరీర్ ప్రమాదంలో పడినట్టుగా ఉంది.
శిల్ప యాక్టివ్ గా సినిమాల్లో చేయడం మానేసి చాలా కాలం అయ్యింది. ఇటీవల ఒక సినిమాలో చేసిందంతే. అయితే ఇన్నేళ్లూ ఆమెకు సంపాదనకు అయితే లోటు లేదు. బిగ్ బ్రదర్ షో తర్వాత శిల్ప దశ తిరిగిపోయింది. వివిధ వ్యాపకాలతో బిజీగా ఉంది. వాటిల్లో రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం శిల్పకు మంచి ఆదాయ వనరుగా ఉన్నాయి.
ప్రత్యేకించి పెళ్లై, పిల్లలున్న సెలబ్రిటీ కావడంతో ఆమెను ఒక హోమ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా మార్చింది ఇండస్ట్రీ. ఇంట్లో వాడే వివిధ ఉపకరణాలకు, కొన్ని రకాల చిన్న పిల్లల ప్రోడక్ట్ లకు కూడా శిల్ప బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. ఇప్పుడు అలాంటి వన్నీ ఆమె చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శిల్ప భర్త చిక్కుకుంది పోర్న్ వ్యవహారంలో కాబట్టి.. ఆమెతో ఇక గృహోపకరణాల, చిన్న పిల్లలకు సంబంధించిన ప్రోడక్ట్ ల యాడ్స్ మొత్తం రద్దు అయినట్టే! ఇప్పటికే అదంతా జరుగుతోందట. శిల్పతో పలు కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ విషయమై భర్త మొహం మీదే నిందించిందట శిల్ప. తన ఫ్యామిలీ రెప్యుటేషన్ మొత్తం పాడు చేశావంటూ, ఇలాంటి పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ మొదలుపెట్టి.. ఎండోర్స్ మెంట్ ఒప్పందాలు రద్దు కావడంతో జరిగిన నష్టం గురించి కూడా శిల్ప ప్రస్తావిస్తూ భర్తతో గొడవకు దిగిందట. ఇటీవల పోలీసులు రాజ్ కుంద్రాను అతడి ఇంటికి తీసుకెళ్లి, పోర్న్ వీడియోలకు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఇంట్లో దాచిన హార్డ్ డిస్కులను చూపించడానికి అతడిని తీసుకెళ్లారు. ఆ సమయంలో శిల్ప రాజ్ తో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ గట్టిగానే గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ ఈ వ్యవహారంతో శిల్ప ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ దొరకలేదనే వార్తలు వస్తున్నాయి. ఒకవైపు పోలీసు విచారణలో తన భర్త తీసింది పోర్న్ వీడియోలు కాదని వాదించిన శిల్ప, డైరెక్టుగా అతడు ఎదరుపడే సరికి మాత్రం జరిగిన నష్టం గురించి వాపోతూ, నిందించినట్టుగా తెలుస్తోంది.