ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు జాతీయ అవార్డులు, ఓ పద్మ పురస్కారం. బాలీవుడ్ చరిత్రలో ఇదో రికార్డు. కేవలం 33 ఏళ్లకే కంగనా రనౌత్ ఈ అరుదైన గౌరవాలను అందుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుకుంటారనే అంచనాలూ ఉన్నాయి.
కంగన నటనకు వంక పెట్టడానికేమీ లేదు. అయితే అంతమాత్రాన ఆమెను మించిన వారు బాలీవుడ్ లో లేరనే మాట ఎవరూ చెప్పలేరు. మరి అంతమంది ఉత్తమ నటీమణులుండగా కంగననే ఎందుకు అవార్డులు, రివార్డులు వరిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ఈ పరంపర ఎందుకింత జోరుగా సాగుతోంది. తెరముందే కాదు, తెర వెనక కూడా నటించడం తెలుసు కాబట్టే కంగన ఫుల్ రైజింగ్ లో ఉందని అంటారు.
రాజకీయాలతో సినిమావాళ్ల అనుబంధం ప్రత్యేకంగా చెప్పలేం. నేరుగా మద్దతిచ్చేవారు కొందరు, అవసరానికి ప్రచారం చేసి సాయపడేవారు ఇంకొందరు. నేరుగా రాజకీయాల్లోకే వచ్చి తన అభిమానులందర్నీ పార్టీ కార్యకర్తలుగా మార్చేవారు ఇంకొందరు. ఇలా సినిమావాళ్లు నాయకులకు ఇతోధికంగా సాయపడుతుంటారు. అదే సమయంలో ప్రతిఫలాలు కూడా పొందుతుంటారు.
సాంస్కృతిక సేవ పేరుతో సినిమావాళ్లను రాజ్యసభకు పంపించడం, పద్మ అవార్డులకు సిఫార్సు చేయడం.. కుదరకపోతే ఇలా అవార్డులతో అందలమెక్కించడం.. అన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. అందుకే కంగనా లాంటి నటీమణులు బీజేపీ పాలనలో ఏకంగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటీమణిగా ఎంపికవడం సాధ్యమైంది.
బీజేపీ, కంగనా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ కాదనలేరు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేసేవారు కంగన. బీజేపీ విధానాలకు ఉచిత ప్రచారం కల్పించేవారు. సామాజిక సమస్యలపై ఎగిరెగిరి పడే ఆమె రైతు ఉద్యమంపై నెగెటివ్ కామెంట్లు చేసి బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చారు. మహారాష్ట్ర సర్కారుతో కంగన గొడవపడిన సందర్భంలో ఆమెకు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించడం మరింత సంచలనంగా మారింది.
ఇటీవల బీజేపీ ముఖ్యమంత్రి చిరిగిన జీన్స్ లపై విసిరిన వ్యంగ్యాస్త్రాలపై మహిళాలోకం భగ్గుమంది. మహిళలకు మద్దతివ్వాల్సిన కంగనా రనౌత్.. విచిత్రంగా ముఖ్యమంత్రిని సపోర్ట్ చేసి తన నిజస్వరూపం బయటపెట్టుకున్నారు.
ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ ఉపకారాలన్నిటికీ ప్రతిఫలంగా కంగనకు మూడు జాతీయ అవార్డులు, ఓ పద్మ పురస్కారం లభించాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తాజాగా ప్రకటించిన జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా ఆ ఖాతాలోకే వెళ్తుందంటూ ట్రోల్స్ నడుస్తున్నాయి.
మణికర్ణిక సినిమాలో కంగన చేసిన నటన కంటే.. నిజ జీవితంలో కంగన బీజేపీకి అనుకూలంగా చేసిన యాక్టింగ్ కే ఎక్కువ మార్కులు పడ్డాయని, అందుకే ఆవిడకు మరోసారి పురస్కారం లభించిందని అంటున్నారు నెటిజన్లు.