ఎవరైనా రోజుకు ఒకసారే టిఫిన్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం కాస్త ఎక్కువగా తీసుకుంటారు. కానీ బరువు తగ్గే కార్యక్రమంలో ఉన్నవాళ్లు ఈ ప్లాన్ మార్చాలని చెబుతున్నారు నిపుణులు. రోజూ పొద్దున్నే 2 సార్లు టిఫిన్ చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం తినే ఆహారం మోతాదు తగ్గుతుందని, తద్వారా బరువు తగ్గడం సులభం అవుతుందంటున్నారు.
ఉదయాన్నే లేచిన గంటన్నరకు ఓసారి బ్రేక్-ఫాస్ట్ చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత 2-3 గంటల గ్యాప్ లో మరోసారి బ్రేక్-ఫాస్ట్ చేయడం వల్ల మధ్యాహ్నం భోజనం మోతాదు ఆటోమేటిగ్గా తగ్గుతుందంటున్నారు. ఉదయాన్నే ఇలా 2సార్లు బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మెటబాలిజం మరింత మెరుగ్గా పనిచేయడంతో పాటు.. శరీరంలో కొవ్వులు కరగడానికి మరింత ఉపయోగంగా ఉంటుందట.
ఉదయం తీసుకునే అల్పాహారంలో కొవ్వుల కంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఉత్యుత్తమ మార్గం అంటున్నారు. ఈ మేరకు యేల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ కలిసి చేసిన ఓ సర్వే కూడా నిర్వహించాయి. 600 మంది విద్యార్థులపై వీళ్లు నిర్వహించిన సర్వేలో, ఉదయం బ్రేక్-ఫాస్ట్ చేయని వాళ్లు తొందరగా బరువు పెరిగినట్టు.. మినిమం గ్యాప్స్ లో రెండు సార్లు అల్పాహారం తీసుకున్న వాళ్లు బరువు తగ్గినట్టు గుర్తించారు.
ఉదయం వేళ 2 సార్లు బ్రేక్-ఫాస్ట్ చేయడం వల్ల చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుందట. అంటే, ఆటోమేటిగ్గా అనారోగ్యకర కొవ్వులకు దూరంగా ఉన్నట్టే. అంతేకాదు, రాత్రిపూట తినే ఆహారం మోతాదు కూడా తగ్గిపోతుందట. సో.. బరువు తగ్గడం కోసం కష్టపడే వారు ఇకపై ఉదయాన్నే 2 సార్లు టిఫిన్ చేయడం మంచి ఆలోచన.