అమ్మాయిలపై అఘాయిత్యాలకు సంబంధించి ఎన్నో కేసులు చూస్తున్నాం. 'పాపం అబల' అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాం. మరి అదే అమ్మాయిలు తప్పుదోవ పడితే? పోలీసుల్ని కూడా తప్పుదారి పట్టిస్తే ఎలా ఉంటుంది? తాజాగా ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి.
మొన్నటికిమొన్న హైదరాబాద్ ఘటకేసర్ ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసేందుకు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థిని, తల్లిదండ్రుల ముందు కిడ్నాప్ నాటకం ఆడింది. దీన్ని పోలీసులు ఛేదించడంతో ఆమె పరువు పోయింది. అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఇది జరిగిన కొన్నాళ్లకే విజయనగరం జిల్లాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ యువతి తనను తాను చున్నీతో కట్టేసుకొని, పోలీసులకు తప్పుడు సమాచారం అందించింది. కిడ్నాప్ అంటూ కథ అల్లే ప్రయత్నం చేసింది. పోలీసులు ఈ కేసును కూడా చాకచక్యంగా ఛేదించారు. అమ్మాయిని మందలించి వదిలేశారు.
ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన మరో యువతి కూడా సరిగ్గా ఇలాంటి నాటకమే ఆడింది. తను ఎక్కడున్నానో అర్థంకావడం లేదంటూ ఏడుపు నటించింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పెడన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు కిడ్నాప్ లాంటిదేం లేదని గ్రహించారు.
బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోవడం కోసం ఆ అమ్మాయి నాటకం ఆడినట్టు గుర్తించారు. పెడనకు చెందిన ఆ బాలిక, అన్వర్ అనే వ్యక్తితో హైదరాబాద్ వెళ్లిపోయింది. స్థానికంగా ఓ దర్గాలో వీళ్లు పెళ్లి చేసుకొని కాపురం కూడా పెట్టారు.
ఈ కేసును ఛేదించిన పోలీసులు ఆ జంటను విజయవాడ తీసుకొచ్చారు. అమ్మాయి మైనర్ కావడంతో, ఆమెను పెళ్లి చేసుకున్న అన్వర్ పై కేసుపెట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు ఆమెను మహిళా సంక్షేమ హాస్టల్ కు తరలించారు.