అధికారంలో ఉండగా యువతకు, నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు చేసిందేమీలేదు. కేవలం టీడీపీ కార్యకర్తల కోసమే, అది కూడా చివరి ఆరునెలల్లో హడావిడిగా నిరుద్యోగ భృతిని తెరపైకి తెచ్చి మోసగాడుగా మాయని మచ్చ తెచ్చుకున్నారు. ఇప్పుడు అధికారం దూరమైనా చంద్రబాబు నిరుద్యోగల జీవితాలతో చెలగాటమాడే నీఛ రాజకీయాలకు తెరతీశారు.
గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల ఎంపిక నిలిపివేయాలంటూ.. హైకోర్ట్ లో కేసు వేయించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ కేసు వేశారు. విచిత్రం ఏంటంటే.. గత ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వీరికి మద్దతుగా కేసు టేకప్ చేయడం. అడ్వొకేట్ జనరల్ గా ఆయన గతంలో ప్రభుత్వంకోసం పనిచేశారా లేక టీడీపీ తొత్తుగా వ్యవహరించారా అనే విషయం ఈ కేసులో ఆయనకున్న ఆసక్తిని బట్టి తేలిపోయింది.
కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా వాలంటీర్ల పోస్ట్ లకు ఎంపిక జరుగుతోందని ఇది అన్యాయం అనేది ఫిర్యాదిదారుల తలతిక్క వాదన. వాదన ఎలా ఉన్నా.. జగన్ నవరత్నాల్లో ఒక రత్నాన్ని తొక్కిపట్టాలని, రిక్రూట్ మెంట్ ఆపేసి ప్రజాకోర్టులో జగన్ ని దోషిగా నిలబెట్టాలనేది వీరి లక్ష్యం. అయితే హైకోర్ట్ ఈ పిటిషన్ ని కొట్టేసింది.
గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల భర్తీ ప్రక్రియ నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. దీంతో ఈరోజు నుంచి గ్రామ వాలంటీర్ పోస్ట్ లకు ఇంటర్వ్యూలు యథాతథంగా మొదలవుతున్నాయి. మొత్తం 9లక్షల85వేల మంది వాలంటీర్ పోస్ట్ లకు దరఖాస్తులుచేసుకున్నారు. వీరిలో 9లక్షల 10వేలమందిని ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు.
ఆగస్ట్ 15నాటికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్ల సేవలు అందుబాటులోకి తేవాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ పవిత్ర యజ్ఞాన్ని భగ్నం చేయడానికి టీడీపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. హైకోర్ట్ మొట్టికాయలతో వీరి పాచిక పారలేదు.