టీడీపీ ప్రభుత్వం అధికారులపై రాజకీయ నాయకుల పెత్తనాన్ని ప్రోత్సహించారు చంద్రబాబు. ప్రతి జిల్లాలో ఇంచార్జి మంత్రిదే హవా. లోకల్ ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రి చెప్పినట్టే జిల్లాలో పాలన నడిచేది. ఏ కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా కలెక్టర్లు జంకేవారు. ఇక పోలీస్ డిపార్ట్ మెంట్ సంగతి సరే సరి. ఏరికోరి తమకు నచ్చినవారిని తమ జిల్లాలకు బదిలీ చేయించుకునే రాజకీయ నాయకులు వారితో తమకు నచ్చిన పనులు చేయించుకునేవారు. ఒకరకంగా రెవెన్యూ, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు చంద్రబాబు.
కానీ ఇప్పుడు సీఎం జగన్ అధికారమంతా కలెక్టర్లు, ఎస్పీలకే అప్పగించారు. జిల్లాల్లో ఏది జరిగినా మీదే బాధ్యత అంటూ హెచ్చరించారు. అవినీతిని సహించేది లేదని చెబుతూనే.. అదే సమయంలో అవినీతికి కలెక్టర్లు, ఎస్పీలు వంత పాడకూడదని హితవుపలికారు. అధికార పక్షనేతలు ఒత్తిడి తెచ్చినా సరే వెనకడుగు వేయొద్దని, అన్నీ నేను చూసుకుంటాననే భరోసా ఇచ్చారు.
వ్యవస్థలో లోపం ఎక్కడుందో జగన్ కనిపెట్టారు కాబట్టే అధికారాలన్నిటినీ అధికారులకే కట్టబెట్టారు. పాదయాత్ర చేస్తున్నప్పుడే జగన్ ఈ విషయాన్ని స్పష్టంగా గమనించగలిగారు. ప్రతిచోటా రాజకీయ పెత్తనం ఎక్కువైపోవడం వల్లే పాలన సజావుగా సాగడంలేదని గ్రహించారు. అందుకే రాజకీయా జోక్యాన్ని తగ్గిస్తూ.. జిల్లాల్లో కలెక్టర్ల మాట చెల్లుబాటయ్యేలా అందరికీ ఆదేశాలిచ్చారు జగన్.
ఇక లా అండ్ ఆర్డర్ లో రాజకీయ జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, మహిళలపై జరుగుతున్న దాడుల్ని అణచి వేయాలంటే.. నిష్పాక్షికంగా విచారణ జరిపి, నిందితులపై చర్యలు తీసుకోవాలంటే ఎవరి సిఫార్సులూ పనికిరావు. అలాంటి సిఫార్సులు ఎక్కువయ్యే కొద్దీ పోలీస్ వ్యవస్థ నిర్లిప్తంగా మారుతుంది.
అందుకే జిల్లాలపై అధికారాలన్నీ కలెక్టర్లు, ఎస్పీలకే ఇవ్వాలని నిర్ణయించారు సీఎం జగన్. వారినే బాధ్యులుగా చేస్తూ వ్యవస్థని ప్రక్షాళణ చేయడానికి తొలి అడుగు వేశారు.